చిలుకూరు, న్యూస్‌లైన్ : అతను ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. సీనియర్ కావడంతో వేతనమూ ఎక్కువే. రోజూ పాఠశాలకు వెళ్లడం బోర్ కొట్టింది కాబోలు. మండల స్థాయి అధికారులను, తోటి ఉపాధ్యాయులను మచ్చిక చేసుకున్నాడు. ఓ ప్రైవేటు వ్యక్తిని తన స్థానంలో ఉపాధ్యాయుడిగా నియమించాడు. సొంతంగా వేతనం ఇస్తూ పాఠాలు చెప్పిస్తున్నాడు. ఇతను మాత్రం నెలనాడు ప్రభుత్వ వేతనం తీసుకుంటూ విద్యావ్యవస్థను మోసం చేస్తున్నాడు. గ్రామస్తులకు విషయం తెలియడంతో అతని నిర్వాకం బయటికి పొక్కింది.
చిలుకూరు మండలం ఆర్లెగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో ఓ సీనియర్ ఉపాధ్యాయుడి వేతనం అక్షరాల 53వేల రూపాయలు. మండలంలోనే అత్యధిక వేతనం ఇది. ఇంత జీతం తీసుకుంటూ పాఠశాలకు రాడు. మండల అధికారిని, పాఠశాల ఉపాధ్యాయులను మచ్చిక చేసుకున్నాడు. ప్రైవేటు వ్యక్తిని తన స్థానంలో నియమించుకున్నాడు. అతనికి నెలకు రూ.3వేల వేతనం ఇస్తూ విద్యాబోధన చేయిస్తున్నాడు.
ఈ వ్యవహారం కొన్ని నెలలుగా సాగుతున్నట్టు తెలిసింది. అందరినీ మచ్చిక చేసుకోవడంతో విషయం బయటికి పొక్కలేదు. ఇటీవల గ్రామస్తులకు ఈ విషయం పూర్తిస్థాయిలో తెలిసింది. దీంతో కొంతమంది శనివారం పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడితో ఘర్షణకు దిగారు. ఉపాధ్యాయుడి నిర్వాకాన్ని కలెక్టర్, డీఈఓ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించి వెళ్లారు. కాగా సదరు ఉపాధ్యాయుడికి గ్రామస్తులు ఘర్షణకు దిగిన విషయం తెలియడంతో వెంటనే చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు పైరవీ చేస్తున్నట్టు సమాచారం.
ఎంఈఓ వివరణ
ఈ విషయమై ఎంఈఓ ఈశ్వర్‌రావును వివరణ కోరగా ఆర్లెగూడెం పాఠశాలలో ప్రైవేటుగా వ్యక్తిని నియమించి పాఠాలు బోధించడంతో నిబంధనలకు వ్యతిరేకమని తెలిపారు. దీనిపై గ్రామస్తులు గొడ వ చేసిన మాట వాస్తవమేనన్నారు. వెంటనే సదరు ప్రైవేటు వ్యక్తిని తొలగిస్తామని, ఉపాధ్యాయుడు సోమవారం నుంచి పాఠశాలకు రావాలని చెప్పినట్టు తెలిపారు.
ప్రైవేటు వ్యక్తితో పిల్లలకు విద్యాబోధన
Published Sun, Nov 10 2013 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
Advertisement