ఇస్రో ‘రామబాణం’!
‘పీఎస్‌ఎల్‌వీ సీ-27’ సూపర్ సక్సెస్
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డీ ఉపగ్రహాన్ని నింగికి చేర్చిన రాకెట్
శ్రీహరికోట: శ్రీరామ నవమి పర్వదినమైన శనివారం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో గ‘ఘన’ విజయం సాధించింది. ఇస్రో కదనాశ్వమైన పీఎస్‌ఎల్‌వీ రాకెట్ మరోసారి ‘రామబాణం’లా తిరుగులేని సత్తా చాటింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి నిప్పులు కక్కుతూ నింగికి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ-27 రాకెట్ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డీ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో అమెరికా, రష్యా, చైనాల మాదిరిగా మనకూ సొంత నావిగేషన్ వ్యవస్థ(జీపీఎస్) అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటిదాకా అమెరికాకు చెందిన జీపీఎస్ సేవలను వాడుకుంటున్న మనం ఇకపై.. త్వరలోనే మన సొంతదైన ‘భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్)’ సేవలను ఉపయోగించుకోవచ్చు.
ప్రయోగం జరిగిందిలా... శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం.. శనివారం సాయంత్రం 5:19 గంటలు.. మిషన్ కంట్రోల్‌రూంలో శాస్త్రవేత్తలు టెన్షన్‌గా గడుపుతున్నారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డీ ఉపగ్రహంలో సాంకేతికలోపం ఏర్పడి మళ్లీ సిద్ధం చేస్తున్న ప్రయోగం కావడంతో ఉత్కంఠ. మిషన్ కంట్రోల్ రూం నుంచి టెన్, నైన్.. అంకెలు వినిపిస్తున్నాయి. త్రీ, టూ.. జీరో. అందరి చూపులు తూర్పు దిక్కుకు మళ్లాయి. నారింజరంగు నిప్పులు కక్కుతూ పీఎస్‌ఎల్‌వీ సీ-27 నింగికి ఎగిసింది. షార్ అంతటా వెలుగులను చిమ్ముతూ శ్రీరామనవమి రోజు రామబాణంలా దూసుకెళ్లింది. రాకెట్ ఒక్కో దశను సమర్థంగా దాటుతుండటంతో శాస్త్రవేత్తల వదనాల్లో చిరునవ్వులు కనిపించాయి. సరిగ్గా 19.25 నిమిషాలకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డీని కక్షలోకి ప్రవేశపెట్టడంతో శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఒక రినొకరు కౌగిలించుకుంటూ అభినందనలు తెలుపుకొన్నారు. ఇస్రో చైర్మన్‌గా ఏఎస్ కిరణ్‌కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి ప్రయోగం విజయవంతం కావడంతో ఆయనతో పాటు శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. పీఎస్‌ఎల్‌వీసిరీస్‌లో ఇది 29వ ప్రయోగం కాగా, 28వ విజయం. ఆరు స్ట్రాపాన్ మోటార్లతో కూడిన పీఎస్‌ఎల్‌వీ సీ-27 రాకెట్ తొలి దశలో 138.2 టన్నుల ఘన ఇంధనం, రెండో దశలో 42 టన్నుల ద్రవ ఇంధనం, మూడోదశలో 7.6 టన్నుల ఘన ఇంధనం, నాలుగోదశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో నాలుగు దశలనూ విజయవంంతగా పూర్తిచేసింది. తర్వాత ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డీ ఉపగ్రహాన్ని రాకెట్ భూస్థిర బదిలీ కక్ష్యలోకి చేర్చింది. భూమికి దగ్గరగా (పెరిజీ) 284 కి.మీ., దూరంగా (అపోజీ) 20,650 కి.మీ. గల దీర్ఘవృత్తాకార భూస్థిర కక్ష్యలోకి 19.2 డిగ్రీల వాలులో ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. ఐదు దశల్లో కక్ష్య పెంపుద్వారా ఉపగ్రహాన్ని 36 వేల కి.మీ. ఎత్తులోని కక్ష్యలోకి చేర్చనున్నారు.
సొంత దిక్సూచీ వ్యవస్థ...అమెరికా, రష్యా, చైనాల మాదిరిగా సొంత ఉపగ్రహ దిక్సూచీ వ్యవస్థ ఏర్పాటు కోసం ఇస్రో ‘భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్)’ను ఏర్పాటుచేస్తోంది. ఇందుకుగాను ఏడు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాలను నింగిలో మోహరించాల్సి ఉంది. అయితే, కనీసం4 ఉపగ్రహాలు పనిచేసినా ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఇస్రో ఇదివరకే 3 ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాలను కక్ష్యకు పంపింది. తాజాగా నాలుగో ఉపగ్రహమూ చేరింది.
దీంతో భారత్‌కూ సొంత ఉపగ్రహ దిక్సూచీ వ్యవస్థ సేవలు పొందేందుకు మార్గం సుగమం అయింది. మిగతా ఉపగ్రహాలను కూడా ప్రయోగించి ఈ వ్యవస్థను 2015 నాటికి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఏర్పాటుకు రూ. 3,425 కోట్ల వ్యయం కానుంది. మొత్తం ఏడు ఉపగ్రహాలకు రూ.1,000 కోట్లు, రాకెట్లకు రూ.1,125 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌కు 2013లో శ్రీకారం చుట్టారు. ఈ ఉపగ్రహ వ్యవస్థకు బెంగళూరు సమీపంలో బైలాలు ప్రాంతంలో రూ.1,300 కోట్లతో గ్రౌండ్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టారు.
మరో 18 నెలలు తర్వాత ‘సార్క్’ ప్రయోగం
‘సార్క్’ దేశాల ఉపగ్రహాన్ని 18 నెలలు తర్వాత ప్రయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ సీ27 విజయానంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరగాల్సి ఉండటంతో ఈ ఉపగ్రహాన్ని 2016 ఆఖరునాటికి లేదా 2017 ప్రథమార్ధంలో ప్రయోగిస్తామన్నారు. ఈ ఏడాది ఆఖరునాటికి పీఎస్‌ఎల్‌వీ సీ28, సీ29 రాకెట్లు ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1ఈ ఉపగ్రహంతో పాటు మరో 3 దేశాలకు చెందిన చిన్న ఉపగ్రహాలు, ఆస్ట్రోశాట్‌ను ప్రయోగించనున్నామన్నారు. భారతదేశం, దానిచుట్టూ 1,500 కిలోమీటర్లు వరకు స్థితి, దిశలనునిర్దిష్టంగా తెలియజేస్తుందన్నారు. ఇస్రో చైర్మన్‌గా పదవి చేపట్టాక చేసిన తొలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రయోగంతో కొత్తగా నిర్మించిన మొబైల్ ల్యాంచ్‌పాడ్ అందుబాటులోకి తీసుకొచ్చామని రేంజ్ ఆపరేషన్ డెరైక్టర్ ఎస్వీ సుబ్బారావు తెలిపారు.
ఉపయోగాలు ఇవీ..
భారత్‌తో పాటు చుట్టూ 1500 కి.మీ. పరిధిలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయి. భూ, జల, వాయు మార్గాల్లో దిక్సూచీ సేవలు అందుతాయి. స్మార్ట్‌ఫోన్లలో వాడుతున్న జీపీఎస్ స్థానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సేవలు పొందొచ్చు. విమనాలు, వాహనాలు, నౌకలకూ దిక్సూచీ సేవలు అందుతాయి. విపత్తుల సమయాల్లో సహాయక చర్యలకు ఉపయోగపడుతుంది. భూమి మీద వాహనాల రాకపోకలను గమనించవచ్చు. పొరుగుదేశాలకూ జీపీఎస్ సేవలను అందించవచ్చు.
ప్రత్యేకతలు
పీఎస్‌ఎల్‌వీ సీ-27 రాకెట్
పొడవు: 44.4 మీటర్లు
మొత్తం బరువు: 320 టన్నులు
ఖర్చు: రూ. 145 కోట్లు
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డీ శాటిలైట్
బరువు: 1,425 కిలోలు
ఖర్చు: రూ. 250 కోట్లు
జీవితకాలం: పదేళ్లు
కేసీఆర్, చంద్రబాబు, జగన్ అభినందన
హైదరాబాద్: పీఎస్‌ఎల్‌వీ-సీ 27 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలను తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఇది చారిత్రాత్మక విజయమని చంద్రబాబు అన్నారు.కఠోర శ్రమతో మన శాస్త్రవేత్తలు సాధించిన విజయం అద్భుతమని కేసీఆర్ ప్రశంసించారు. ఈ సంవత్సరపు తొలి ప్రయోగం ఫలప్రదం కావడం శుభపరిణామమని జగన్‌మోహన్‌రెడ్డి ఒక సందేశంలో హర్షం వ్యక్తం చేశారు.