రైటర్లదే రాజ్యం.. | Irregularities Of Document Writers In Sub Registir Office At Amaravati | Sakshi
Sakshi News home page

రైటర్లదే రాజ్యం..

Published Fri, Aug 30 2019 8:51 AM | Last Updated on Fri, Aug 30 2019 8:51 AM

Irregularities Of Document Writers In Sub Registir Office At Amaravati - Sakshi

పటమటలోని రిజిస్ట్రార్‌ కార్యాలయ భవనం 

సాక్షి, అమరావతి : సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ రైటర్లను అనుమతించకూడదని.. వారి ప్రమేయం లేకుండానే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సాగాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ నేటికీ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్‌ రైటర్ల హవానే కొనసాగుతోంది. వారు చెప్పిందే వేదంగా నడుస్తోంది. అక్కడి అధికారులు..సిబ్బందికి అ‘ధన’పు సాయం అందించడంలో వారే కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్రమాల సంగతి బయట పడకుండా, సిబ్బంది తప్పులు ఎవరికీ కనపడకుండా వారి ఇళ్లకు సంబంధిత మొత్తాన్ని చేర్చడంలో వారిదే ప్రధాన పాత్ర. డాక్యుమెంట్‌ రైటర్లతో సంధానకర్తలుగా ప్రైవేటు వ్యక్తులు కొందరు అక్కడే ఉంటూ వారు కూడా వసూళ్లకు పాల్పడుతున్నారు. కొందరు రిజిస్ట్రార్లే ప్రైవేటు వ్యక్తులకు నెలనెలా కొంత మొత్తం చెల్లించి తమ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారని, ప్రజల నుంచి వారి ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పటమట కార్యాలయంలో 12 మంది...
సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ రైటర్లు లేనిదే పని కావడం లేదు. వారి ఆధ్వర్యంలో మామూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి అవినీతి మరక అంటకుండా... వారి జేబుల్లోకి డబ్బులు దర్జాగా చేరుతున్నాయి. వారధులుగా డాక్యుమెంట్‌ రైటర్లు అనధికార విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోమవారం తనిఖీలు చేశారు. అందులో రాష్ట్రంలోనే ఆదాయంలో ప్రథమ వరుసలో నిలిచే విజయవాడ పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దాడుల సమయంలో ఏకంగా 12 మంది డాక్యుమెంట్‌ రైటర్లు దొరికారు. వారి నుంచి రూ. 3.41 లక్షలను స్వాధీనం చేసుకోవడంతో ఏ స్థాయిలో ఈ దందా జరుగుతోందో ఆర్థమవుతోంది.

నిబంధనల ప్రకారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోకి డాక్యుమెంట్‌ రైటర్లను అనుమతించకూడదు. కానీ అక్కడ ప్రతి పని వారి ద్వారానే జరుగుతోంది. వీరు అధికారికంగా పనిచేసే అవకాశం లేదు. రిజిస్ట్రార్‌ కార్యాలయాల సమీపంలో కేంద్రాలను ఏర్పాటు చేసుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు వచ్చిన పార్టీలకు సేవలు అందించవచ్చు. కానీ పూర్తిగా వారే చక్రం తిప్పుతూ డబ్బులు గుంజుతున్నారు.

ఆశ్రయించకపోతే కొర్రీలు..
ప్రభుత్వం మాత్రం రిజిస్ట్రేషన్‌ చేయించుకునే పార్టీలు(అమ్మకం, కొనుగోలుదారులు) ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని చలానా రూపంలో అందజేస్తే చాలు అంటోంది. రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక సంబంధిత డాక్యుమెంట్లు పార్టీల చేతికి వచ్చేయాలి. ప్రభుత్వ నిబంధన ఇలా ఉన్నా పార్టీలు నేరుగా రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లడం లేదు. అనధికారికంగా కార్యాలయాల సమీపంలో ఏర్పాటు చేసుకున్న డాక్యుమెంట్‌ రైటర్లనే ఆశ్రయిస్తున్నారు. డాక్యుమెంట్‌ రాయించిన వారి వద్ద వెయ్యి నుంచి సంబంధిత ఆస్తి విలువ ఆధారంగా పర్సంటేజీ రూపంలో రైటర్లు వసూలు చేస్తున్నారు.

ఇది కాకుండా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది పేరుతో స్టాంప్‌ డ్యూటీ చెల్లించే మొత్తంలో ఒక శాతం మామూళ్ల రూపంలో వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్‌ రైటర్‌ చెప్పినట్టు చేస్తే..పని సాఫీగా అయిపోతుంది. కాదూ కూడదంటే...కార్యాలయ సిబ్బంది సవాలక్ష కొర్రీలు పెడతారు. దీనిని దృష్టిలో పెట్టుకొని క్రయ, విక్రయదారులు వారు అడిగినంత ఇచ్చుకొని పని పూర్తి చేయించుకుంటారు. వసూలైన మొత్తం రోజంతా రైటర్ల దగ్గరే ఉంచుకొని సాయంత్రానికి సిబ్బందికి అందజేస్తుంటారు.

నకిలీ డాక్యుమెంట్‌ రైటర్ల పనే...
పాత తరం డాక్యుమెంటరీ రైటర్లు ఇలా భారీ స్థాయిలో డబ్బులు తీసుకొని అనధికార విధుల చేసేవారు కాదు. లైసెన్స్‌డ్‌ నెంబర్‌ కలిగిన డ్యాక్యుమెంట్‌ రైటర్లు తప్పు చేయాలంటే బయపడేవారు. ఉన్నతాధికారులు తప లైసెన్స్‌ రద్దు చేస్తారేమోన న్న భయం వారిలో ఉండేది. అలా జరిగితే అవమానంగా భావించి పనిచేసేవారు. కాలక్రమంలో ప్రభుత్వం లైసెన్స్‌ విధానం రద్దు చేయటంతో ప్రతి ఒక్కరు డాక్యుమెంట్‌ రైటర్లుగా అవతారం ఎత్తి అనధికార దందాను మొదలు పెట్టారు. చాలావరకు రియల్‌ ఎస్టేట్‌ చేసేవారే వీరిని మెల్లగా రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చొప్పించి తమ పనిని సులువుగా చేయించుకుంటున్నారు. నకిలీ డాక్యుమెంట్‌ రైటర్ల వల్ల అసలు రైటర్లు చెడ్డపేరు తెచ్చుకోవాల్సి వస్తోంది.

ఆఫీస్‌లోకి నో ఎంట్రీ..!
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అనధికార వ్యక్తులకు అనుమతి నిషేధం. డాక్యుమెంట్‌ రైటర్లు, వారి ఏజెంట్లు  కొన్ని ఆఫీసుల్లో విధులు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుతోంది. అటువంటివి మా దృష్టికి వస్తే సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. అవినీతిని ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదు.
–శ్రీనివాసమూర్తి, డీఐజీ, రిజిస్ట్రేషన్‌ శాఖ, కృష్ణా జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement