55 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.20 వేల నగదు, సెల్‌ఫోన్లు చోరీ
చివ్వెంల, న్యూస్‌లైన్: దోపిడీ దొంగలు వీరంగం సృష్టించారు. ఇంట్లో మగవారిని బంధించి, తాము నక్సలైట్లమని బెదిరించి 55 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ. 20వేల నగదు అపహరించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండల పరిధి దురాజ్‌పల్లి ఆవాసం ఖాసీంపేటలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామ శివారులో నివాసం ఉంటున్న ఎండీ ఖాజాఆప్‌ఖాన్ ఎఫ్‌సీఐలో యూడీసీగా పనిచేస్తున్నాడు. సోమవారం అతడి పెద్ద కూతురు ఫర్హీన్ జన్మదిన వేడు కలు జరిగాయి. తర్వాత బంధువులు హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు ఇంటి గడియ వేసి నిద్రలోకి జారుకున్నారు.
అర్ధరాత్రి ఐదుగురు దుండగులు బండరాయితో తలుపులు పగులగొట్టి ఇంట్లో జొరబడ్డారు. సెల్‌ఫోన్లు లాక్కు న్నారు. వారిలో ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి ఉండగా, మరో ముగ్గురు తమ దుస్తులను నడుముకు చుట్టుకుని వాటిల్లో చెప్పులు, కత్తులు, సెల్‌ఫోన్లు ఉంచారు. ఖాజాఆప్‌ఖాన్, అల్లుడు మజీద్ చేతులను నిర్బంధించారు. చోరీకి సహకరిస్తే ఎవరిని ఏమీ చేయకుండా వెళ్తామని, లేదంటే అందరినీ చంపేస్తామని మహిళలను బెదిరించి ఖాజా భార్య మైరున్నీసావద్ద ఉన్న తాళాలు లాక్కొని బీరువా తెరిచారు. అందులో 55 తులాల బంగారం, 40తులాల వెండి ఆభరణాలున్న బాక్సును, బయట ఉన్న రూ. 20వేల నగదు, ఐదు సెల్‌ఫోన్లు తీసుకుని వెళ్లారు. కాగా, దొంగలు వెళ్లిపోయిన అరగంట తర్వాత ఇంట్లోని వారంతా అద్దెకు ఉంటున్న విద్యార్థినుల వద్దకు వెళ్లి వారి సెల్‌ఫోన్ నుంచి బంధువులకు సమాచారమివ్వగా, గ్రామస్తులు, పోలీసులతో కలసి ఘటనాస్థలికి చేరుకున్నారు. దొంగలు సగం తెలుగు, సగం తమిళం మాట్లాడుతున్నారని, అంతా నలుపు రంగులో ఉన్నారని బాధితులు తెలిపారు. దోపిడీ జరిగిన ఇంటిని మంగళవారం ఎస్పీ టి.ప్రభాకర్‌రావు సందర్శించి పరిశీలించారు.
దోపిడీ దొంగల బీభత్సం
Published Wed, Feb 5 2014 1:44 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement