సాక్షి, హైదరాబాద్: రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా కోడి పందేలు జరగడానికి వీల్లేదని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తమ ఆదేశాలకు విరుద్ధంగా ఎక్కడైనా కోడి పందేలు జరిగితే అందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీలే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారాన్ని వీరిద్దరు స్వయంగా పర్యవేక్షించాలంది. కోడి పందేల పేరుతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులంటే ప్రజా ప్రతినిధులకు ఏ మాత్రం లెక్క లేకుండా పోతోందని, జోక్‌గా భావిస్తున్నారని మండిపడింది.
ఏం చర్యలు తీసుకుంటున్నారు?
పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేలు జరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని జిల్లా కలెక్టర్, ఎస్‌పీలను హైకోర్టు ఆదేశించింది. కోడి పందేలకు సిద్ధం చేసిన మైదానాల్లో ఎన్నింటిని తనిఖీలు చేశారు.. గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులపై ఏం చర్యలు తీసుకున్నారు.. ఎన్ని చోట్ల 144 సెక్షన్ కింద నిషేదాజ్ఞలు విధించారు.. తదితర వివరాలను తమ ముందుంచాలని వారికి స్పష్టం చేసింది. ఒకవేళ ఈ వివరాలను సమర్పించకుంటే స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని కలెక్టర్, ఎస్‌పీలను ఆదేశించింది.
తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న సంక్రాంతికి కోడి పందాలు జరగకుండా∙చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కలిదిండి రామచంద్రరాజు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
కోడి పందేలు జరగడానికి వీల్లేదు
Published Wed, Jan 3 2018 2:26 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment