ముద్రగడ బైక్ ర్యాలీ.. కేసు నమోదు
ముద్రగడతో పాటు 13 మందిపై కేసు
కిర్లంపూడి (జగ్గంపేట)/గొల్లప్రోలు (పిఠాపురం): కాపు ఉద్యమంపై టీడీపీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 26న చేపట్టనున్న ‘చలో అమరావతి’లో భాగంగా ఆదివారం తన అనుచరులతో కలసి తూర్పుగోదావరి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. దీంతో పోలీసులు ఆయనతో పాటు 13మందిపై కేసు నమోదు చేశారు. ‘చలో అమరావతి’లో భాగంగా ఈనెల 7న ముద్రగడ బైక్ ర్యాలీ నిర్వహించతలపెట్టారు.
దీనిని అడ్డుకునేందుకు ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడిలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వర్షం పడుతుండటంతో ముద్రగడ అనుచరులు ఆ రోజున బైక్ ర్యాలీని విరమించుకున్నారు. దీంతో పోలీసులు అదే రోజు సాయంత్రం బందోబస్తును ఉపసంహరించారు. అయితే పోలీసులు ఊహించని విధంగా ముద్రగడ అనుచరులు ఉన్నట్టుండి ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ వెనుక కారులో ముద్రగడ వారిని అనుసరించారు. దీంతో పలువురిపైయ కేసు నమోదు చేశారు.
కాపు ఉద్యమానికి ఇంటికొకర్ని పంపించండి..
కాపు రిజర్వేషన్లపై చావో రేవో తేల్చుకునేందుకు ఈ నెల 26న చేపట్టనున్న ‘చలో అమరావతి’ కోసం ఇంటికొకర్ని పంపించాలని కాపులకు ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు.. కాలయాపన చేస్తూ కాపులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.