ఉద్యమాలతో ఉపాధి..భద్రతకు సమాధి
కాకినాడ : పచ్చని కోనసీమ ఇలా భగ్గుమన్నప్పుడల్లా ఉద్యమాలు పుట్టుకొస్తాయి. కానీ అవి నీటి మీద బుడగల్లా చల్లారిపోతుంటాయి. స్వచ్ఛంద సంస్థలు.. సామాజికవేత్తలు చిత్తశుద్ధితో ఉద్యమాలు చేసినా.. వాటికి సరైన రాజకీయ మద్దతు లభించకఎక్కడికక్కడ నీరుగారిపోతున్నాయి. ఇక కొందరు రాజకీయ నాయకులు చేసే ఉద్యమాల కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవన్నీ సూట్‌కేస్ ఉద్యమాలుగానే సాగుతున్నాయి తప్ప ఏనాడూ ఈ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణ కోసం జరగలేదు. అందువల్లనే తమకీ దుస్థితి దాపురించిందని కోనసీమవాసులు గగ్గోలు పెడుతున్నారు.
కోనసీమ భూగర్భంలో పుష్కలంగా సహజవనరులున్నాయని 1983లోనే గుర్తించారు. కానీ 1990 దశకంలోనే వీటి వెలికితీత కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆఫ్‌షోర్, ఆన్‌షోర్‌లలో సిస్మిక్ సర్వేలు ఎక్కువయ్యాయి. చమురు సంస్థలన్నీ ఈ ప్రాంతంపై ఎక్కువగా దృష్టి పెట్టాయి. కేజీ బేసిన్ పరిధిలో 20 వేల చదరపు కిలోమీటర్లు, ఆఫ్‌షోర్‌లో 31 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చమురు, సహజవాయు నిక్షేపాలున్నాయని గుర్తించారు. వీటి వెలికితీతవల్ల తమ ప్రాంతం అన్ని రంగాల్లోనూ ఎంతో అభివృద్ధి చెందుతుందని కోనసీమ వాసులు ఎన్నో కలలుగన్నారు.
1995లోనే ఉద్యమాలకు శ్రీకారం
వేల కోట్ల రూపాయలతో చమురు, సహజవాయువు ఆధారిత పరిశ్రమలు ఇక్కడ ఏర్పడతాయని, తద్వారా ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి సాధించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని ఆశించారు. కానీ వెలికితీత కార్యకలాపాలు ప్రారంభమైన కొద్ది నెలలకే తాము కాళ్లకిందే మందుపాతరలు పెట్టుకొని జీవిస్తున్నామని గుర్తించారు. దీంతో తమకీ దుర్భర జీవితాలు వద్దంటూ కోనసీమవాసులు 1995 నుంచే ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత జనవిజ్ఞాన వేదికతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అనేక దశల్లో ఉద్యమాలు చేపట్టాయి. కేజీ బేసిన్ పరిధిలోని ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో జనవిజ్ఞాన వేదిక జీపుజాతాలు నిర్వహించి ప్రజల్ని చైతన్యపరచింది. తర్వాత కేజీ బేసిన్ పరిరక్షణ సమితి, కోనసీమ పరిరక్షణ సమితి వంటి ఎన్నో సంస్థలు ఈ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎన్నో ఉద్యమాలు చేశాయి. కానీ వీటికి సరైన రాజకీయ మద్దతు లభించకపోవడంతో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి.
సొమ్ము చేసుకున్న రాజకీయ నాయకులు
కోనసీమవాసుల బలహీనతలను మాత్రం కొంతమంది రాజకీయ నాయకులు ఉద్యమాల పేరుతో క్యాష్ చేసుకున్నారు. గత రెండు దశాబ్దాల్లో కనీసం పలుమార్లు బ్లో అవుట్లు, పేలుళ్లు, విస్ఫోటాలతో పాటు వందలాది సార్లు గ్యాస్, ముడిచమురు లీకేజిలు ఏర్పడి వందలాది ఎకరాల్లో పచ్చని పంటపొలాలతో పాటు కొబ్బరితోటలు బుగ్గిపాలయ్యాయి. ఇటువంటి సంఘటనలు జరిగిన ప్రతిసారీ రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమాలు చేసి సొమ్ము చేసుకోవడం ఇక్కడ పరిపాటిగా మారిపోయింది. చీకటిమాటున మారే సూట్‌కేసుల కోసమే తప్ప ఈ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేపట్టిన దాఖలాలే లేవు.
ముఖ్యంగా పదేళ్లుగా రాజకీయ ఉద్యమాలు మరీ శృతి మించిపోయాయి. చమురు సంస్థలపై ఉద్యమాలు చేసిన ప్రతిసారీ పరిహారం లేదా సాయం కోసం తప్ప ప్రజల భద్రత గురించి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఏనాడూ పట్టించుకోలేదు. వారు నిజంగా ‘వాచ్‌డాగ్’ పాత్ర పోషించి ఉంటే చిత్తశుద్ధితో ప్రజల తరఫున ఉద్యమాలు చేసి ఉంటే కచ్చితంగా చమురుసంస్థలు భద్రతా చర్యలు పాటించేవన్న వాదన బలంగా వినిపిస్తోంది. పదేళ్లపాటు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ఒక ఎంపీ అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా రోడ్డెక్కడం..
ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయడం.. చమురు సంస్థలకు అల్టిమేటమ్‌లు ఇవ్వడం.. ఆనక మిన్నకుండిపోవడం సాధారణమై పోయింది. రెండేళ్ల క్రితం మన గ్యాస్ మనహక్కు అంటూ ఉద్యమించి ఓట్ల రాజకీయాలు చేయడం తప్ప ఏనాడూ చిత్తశుద్ధితో ఉద్యమించిన దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన ఒక్కరే కాదు ఇదే ప్రాంతానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి తన గురువు ప్రోద్బలంతో జీఎస్పీసీ సంస్థపై వేలాదిమంది మత్స్యకారులతో ఉద్యమించారు. ఆఫ్‌షోర్‌లో రిగ్‌ను కూడా ముట్టడించారు. జ్ఛరు కూడా పరిహారం కోసమే తప్ప ఈ ప్రాంత భద్రత కోసం ఉద్యమించలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో ఈ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణ, ప్రజల భద్రత కోసం ఉద్యమించాలని కోరుతున్నారు.