భూసేకరణే అసలు సమస్య | land collection problem to project construction | Sakshi
Sakshi News home page

భూసేకరణే అసలు సమస్య

Published Mon, Dec 16 2013 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM

land collection problem to project construction

కొంగువారిగూడెం  (జంగారెడ్డిగూడెం రూరల్), న్యూస్‌లైన్ :  జిల్లాలో మెట్ట ప్రాంత రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరందించాలనే లక్ష్యంతో 35 ఏళ్ల క్రితం కొంగువారిగూడెంలో నిర్మించిన శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. కుడి, ఎడమ కాలువలు, ఎత్తిపోతల పథకాల పనులు నత్తనడకన సాగడంతో ప్రాజెక్ట్ నిర్మాణ లక్ష్యం నెరవేరడం లేదు. ఇందుకు భూసేకరణ, నిధుల లేమి కారణం. ప్రజాప్రతినిధులు, అధికారులు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో మెట్ట రైతులు సాగునీటి కోసం ఆకాశం వైపు చూస్తున్నారు.  ఏళ్ల తరబడి పనులు పెండింగ్‌లో ఉండటం..అధికారుల అలసత్వంతో 46 వేల ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యం నెరవేరడం లేదు.
 నిధుల లేమి ఓ కారణం
 వరద, సాగునీటి లక్ష్యాలుగా 1976లో కొంగువారిగూడెంలో మధ్యతరహా ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1979, 80లో ఎర్త్ డ్యామ్ పనులు ప్రారంభించారు. అప్పట్లో ప్రా జెక్ట్‌లో నీరు నిల్వ చేసేందుకు కొంగువారిగూడెం, తాడువాయి, వేగవరం, జొన్నవారిగూడెం తదితర గ్రామాలకు చెందిన రైతుల నుంచి సుమారు 5 వేల ఎకరాలను సేకరించారు. 4 టీఎంసీల నీరు నిల్వ చేసేలా ప్రాజెక్ట్‌ను నిర్మిం చారు. ప్రస్తుతం 83.5 మీటర్ల ఎత్తున నీరు నిల్వ చేస్తున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.124 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటి వరకు రూ. 108.5 కోట్లు ఖర్చు చేసినట్టు నీటిపారుదల  శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే జలాశయం కుడి, ఎడమ కాలువలు, ఎత్తిపోతల పథకాలు, పిల్ల కాలువల పనులు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. దీనికి భూసేకరణలో జాప్యం.. నిధుల లేమి కారణం.
 కుడి కాలువ  ద్వారా 10 వేల ఎకరాలకు..
 కుడి ప్రధాన కాలువ ద్వారా 19,700 ఎకరాలకు గాను 10 వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరందిస్తున్నారు. కాలువ పొడవు 45.6 కిలోమీటర్లు. పుట్లగట్లగూడెం, లక్కవరం, రావికంపాడు, నులకానివారిగూడెం, వెంకటాపురం, ఐఎస్ రాఘవాపురం, ఐఎస్ జగన్నాథపురం, రాజవరం, పోతవరం, చీపురుగూడెం, అనంతపల్లి, నల్లజర్ల, దూబచర్ల గ్రామాల మీదుగా కాలువ వెళుతోంది.
 90 ఎకరాల భూమి సేకరించాలి
 ఎడమ ప్రధాన కాలువ ద్వారా 8 వేల ఎకరాలకు గాను 5 వేల ఎకరాలకు సాగు నీరందిస్తున్నారు. కాలువ పొడవు 7.59 కిలోమీటర్లు. చక్రదేవరపల్లి, కొంగువారిగూడెం, గుర్వాయిగూడెం, నాగులగూడెం, పేరంపేట, పంగిడిగూడెం, వెంకట రామానుజపురం తిరుమలా పురం, కేతవరం తదితర గ్రామాలకు ఈ కాలువ ద్వారా సాగునీరు అందించాలని నిర్దేశించారు. అయితే ప్రధాన కాలువలకు అను సంధానిస్తూ సబ్‌ఛానల్స్, తదితర పనులు పూర్తి కాలేదు. దీంతో లక్ష్యం నెరవేరడం లేదు. కుడి, ఎడమ కాలువల కోసం ఇప్పటివరకు 587 ఎకరాల భూమి సేకరించారు. పనులు పూర్తికావాలంటే మరో 90 ఎకరాలు సేకరించాల్సి ఉంది.
 నిరుపయోగంగా ఎత్తిపోతల పథకాలు
 ఎర్రకాలువ జలాశయం పరిధిలో మూడు ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. దీనిలో యడవల్లి ఎత్తిపోతల పథకం నుంచి మాత్రమే 6 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. అయితే బొర్రంపాలెం, రావికంపాడు పథకాల నుంచి నీటిని అందించలేకపోతున్నారు. ఇక్క డా భూసేకరణే సమస్య. కాలువల తవ్వకానికి భూమిని సేకరించాల్సి ఉందని అధికారులు అంటున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement