నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్ : దేవుడా.. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డను ఇంత అన్యాయంగా తీసుకెళుతావా. నా కింత కడపుకోత పెట్టావా. నీకు జాలి, కరుణా లేదా? అంటూ ఓ మాతృమూర్తి గుండెలవిసేలా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. హృదయ విదారకమైన సంఘటనకు సంబంధించి.. సం గం మండలం తిరమనతిప్పకు చెందిన గుర్నాథం తిరుపతయ్య, నాగమ్మ దంపతులు బతుకుతెరువు కోసం ఏడేళ్ల కిందట నగరానికి వచ్చారు.
వీరికి బాలాజీ (12), వేణు, శ్రీలక్ష్మి అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. తిరుపతయ్య సరస్వతీనగర్‌లోని పూజాగార్డెన్‌లో వాచ్‌మన్. కుటుంబంతో అక్కడే ఉంటున్నారు. నాగమ్మ పాచి పనిచేస్తూ భర్తకు చేదోడుగా ఉంటూ పిల్లల్ని చదివించుకుంటోంది. బాలాజీ బొల్లినేని హాస్పిటల్ సమీపంలోని నగరపాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. సైకిల్‌పైనే ప్రతి రోజు స్కూల్‌కు వెళ్లేవాడు.
గురువారం పాఠశాలకు సెలవు కావడంతో బాలాజీ ఇంటి వద్దే ఉన్నాడు. మధ్యాహ్నం తర్వాత ఎర్రగడ్డలోని స్నేహితుడిని కలిసేందుకు సైకిల్‌పై వెళ్లి తిరిగి 3.30 గంటలకు ఇంటికి బయలుదేరాడు. సరస్వతీనగర్‌లో రోడ్డు దాటుతుండగా మితిమీరిన వేగంతో కేవీఆర్ పెట్రోల్ బంకు వైపు నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ సైకిల్‌ను ఢీకొంది. బాలాజీ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడి తల్లి నాగమ్మ రక్తపు ముద్దగా మారిన బిడ్డను గుండెలకు హత్తుకుని రోదించింది.
పమాదంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాక్టర్ డ్రైవర్‌కు దేహశుద్ధి చేసేందుకు య త్నించగా నిందితుడు పరారయ్యాడు. అటుగా రాకపోకలు సాగించే టిప్పర్లు, ట్రాక్టర్లను నిలిపివేసి స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రమాద విషయం తెలుసుకున్న నాల్గో నగర సీఐ జి. రామారావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాల్గో నగర ఏఎస్‌ఐ రాజశేఖర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దేవుడా.. ఏంటీ అన్యాయం..
Published Fri, Jan 31 2014 3:25 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
Advertisement
Advertisement