మన్యం మగువలు.. మగధీరలు
మాతృస్వామ్యానికి ప్రతీక గిరిజన మహిళ
పాడేరు: మన్యం మహిళలు మాతృస్వామ్య వ్యవస్థకు, శ్రమైక జీవనానికి ప్రతీకలుగా నిలుస్తారు. గిరిజన మహిళ కుటుంబ భారాన్ని, బాధ్యతలను తలకెత్తుకుని పురుషుల కంటే ఎక్కువగా శ్రమిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో మహిళలదే నిర్ణయాధికారం. పురుషాధిక్యత మన్యంలో కానరాదు. అందుకే నేటికి మన్యంలో మాతృస్వామ్య వ్యవస్థ మిగిలివుంది. బాధ్యతల బందీఖానాలో ఒదిగిపోయిన గిరిజన మహిళ, ఆధునికతకు, అక్షరాశ్యతకు దూరంగా శ్రమైక్య జీవనం సాగిస్తోంది. బాల్యం నుంచే పనిపాట నేర్చుకొని శ్రమ జీవనానికి అలవాటు పడుతోంది. అమ్మ ఒడి నుంచే అభ్యాసన మొదలు పెడుతుంది. పట్టణ, గ్రామీణ మహిళలతో పోలిస్తే గిరిజన మహిళ జీవనం విభిన్నంగా సాగుతోంది. చీరకట్టు నుంచి కాలిమట్టెల వరకు గిరిజన మహిళ వైవిద్యంగా కనిపిస్తుంది. ఆధునిక నాగరికతకు భిన్నంగా నేటికి గిరిజన మహిళ తన సంస్కృతి, సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు.
కోందు, పోర్జ, గదబ వంటి పలు గిరిజన తెగల్లో మహిళల కట్టూ, బొట్టూ ఎంతో వైవిధ్యంగా, గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఆకట్టుకుంటాయి. ధైర్యసాహసాల్లో కూడా గిరిజన మహిళ మేటిగా నిలుస్తోంది. కుటుంబ పోషణ కోసం ఏడాది పొడుగునా అటవీ ఉత్పత్తుల సేకరణకు అడవికి వెళ్ళే గిరిజన మహిళ ఎంతో తెగువను ప్రదర్శిస్తుంది. ఒంట రిగానైనా అడవికి వెళ్ళడానికి సాహసిస్తుంది. వ్యవసాయ పనుల్లో కూడా మహిళలే ఎక్కువ కష్టపడుతుంటారు. నారుతీత, ఉడుపులు, కోతలు, నూర్పులు వంటి వ్యవసాయ పనుల్లో మహిళలే కీలకమవుతారు.
అన్ని పనుల్లోను తానే కీలకమై భర్తకు కూడా పనుల్లో చేదోడు, వాదోడుగా నిలుస్తోంది. మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో అనాదిగా గిరిజన మహిళలు అక్షరాశ్యతను సాధించ లేకపోతున్నారు. కాయకష్టంపైనే ఆధారపడి ఆధునికత నాగరికతకు దూరంగా తమ సంస్కృతి, సాంప్రదాయాల మాటున జీవన గమనాన్ని సాగిస్తున్నారు. మన్యంలో 2011 గణాంకాల ప్రకారం గిరిజన మహిళల అక్షరాశ్యత 34.7 శాతం మాత్రమే ఉంది. అక్షరజ్ఞానం అందకపోయినా ఆరుగాలం కష్టపడి పోడు భూముల్లో సిరులు పండిస్తూ కుటుంబాల్లో వెలుగు నింపుతు గిరిజన మహిళ ప్రత్యేకతను నిలుపుకుంటోంది.