విజయనగరం ఫోర్ట్: పార్వతీపురం ప్రాంతానికి చెందిన డి.రామకృష్ణ అనే వ్యక్తి జ్వరంతో బాధపడుతూ ఈనెల 4వ తేదీన కేంద్రాస్పత్రికి వచ్చాడు. అతడ్ని పరీక్షించిన వైద్యులు మెడాల్ లేబరేటరీలో సీబీపీ పరీక్షలు చేయించుకోవాలని చీటి రాసి ఇచ్చారు. అదే రోజు లేబరేటరీ సిబ్బంది రోగి రక్తనమూనాలు సేకరించి, ఐదో తేదీ వస్తే రిపోర్టు ఇస్తామని చెప్పారు. దీంతో గురువారం ఉదయం 11 .30 గంటలకు వెళ్లి రిపోర్టు అడిగితే వైజాగ్ డాక్టర్ రిపోర్టు చూసి పంపించాల్సి ఉందని మెడాల్ సిబ్బంది చెప్పారు.
దీంతో రిపోర్టు జాప్యంపై రోగి ఆస్పత్రి సూపరింటిండెంట్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అలాగే విజయనగరం పట్టణం పూల్‌భాగ్ కాలనీకి చెందిన ఆర్. శ్రీరాములు అనే వ్యక్తి ఈ నెల ఒకటో తేదిన కేంద్రాస్పత్రిలో కాలేయ సంబంధిత వ్యాధితో చేరాడు. అతనికి 2వ తేదీన ఫ్లూయిడ్ తీసి వైద్య పరీక్షల కోసం మెడాల్ లేబరేటరీకి ఇచ్చారు. అయితే ఆయన ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయినా ఇంతవరకు రిపోర్టులు రాలేదు. ఈ పరి స్థితి ఈ ఇద్దరిదే కాదు.. జిల్లా వ్యా ప్తంగా అనేక మంది రోగులు ఎదుర్కొం టున్నారు. జిల్లాలో అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో జిల్లా నలుమూలలు నుంచి అధిక సంఖ్యలో రోగులు ప్రతిరోజూ వస్తుం టారు. అయితే కేంద్రాస్పత్రిలో శాంపిల్స్ తీయడం ఒక చోట.. వైద్య పరీక్షలు మరోచోట కావడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
పైగా రిపోర్టులు కూడా సమయానికి రాకపోవడంతో వ్యాధి నిర్ధారణ కాక వైద్యసేవలు అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరీక్షలు, రిపోర్టుల కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. సూదర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రెండు, మూడు రోజుల పాటు రిపోర్టుల కోసమే తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
విచారణ చేపడతాం..
మెడాల్ సంస్థ వారు రిపోర్టులు ఎందుకు ఆలస్యంగా ఇస్తున్నారో విచారణ చేపడతాం. రిపోర్టులు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటాం.– కె. సీతారామరాజు, కేంద్రాస్పత్రి సూపరింటిండెంట్
డిశ్చార్జి అయిన తర్వాత..
ఆస్పత్రిలో చేరిన రోగులు ఇంటికి వెళ్లిపోయిన తర్వాత రిపోర్టులు వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. రిపోర్టులు జాప్యం కావడం వల్ల కొంతమంది రోగులు ప్రైవేట్ లేబరేటరీల్లో పరీక్షలు చేయించుకుని వైద్యసేవలు పొందుతున్నారు. సకా లంలో వ్యాధి నిర్ధారణ జరగకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి
81 ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు
జిల్లాలో మెడాల్ సంస్థ 68 పీహెచ్‌సీలు, 12 సీహెచ్‌సీలతో పాటు జిల్లా కేంద్రాస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రుల్లో లేబరేటరీలు నిర్వహిస్తోంది. పీహెచ్‌సీకి రోజుకి 40 నుంచి 50 మంది వరకు రోగుల వరకు వస్తుంటారు. వీరిలో 10 నుంచి 15 మంది రోగులు మెడాల్ లేబరేటరీలో పరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లా ఆస్పత్రికి రోజుకి 700 నుంచి 800 వరకు రోగులు రాగా వీరిలో సుమారు 90 మంది వరకు పరీక్షలు చేయించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment