పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
సాక్షి, కంచిలి(శ్రీకాకుళం) : కరువు, నిరుద్యోగ సమస్యలను కొందరు దళారులు తమకు అనుకూలంగా మార్చుకొంటున్నారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులైన యువకులకు విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామం ఎర వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా కమీషన్ ఏజెంట్లు వెలసి యువతను దోచుకొంటున్నారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఐటీఐలో తర్ఫీదు పొందినవారు, స్థానికంగా ఉన్న వెల్డింగ్ ఇనిస్టిట్యూట్‌లలో నైపుణ్యత పొందిన వారు విదేశాల్లో ఉద్యోగాల కోసం ఆశపడి లక్షలాది రూపాయలు పోగొట్టుకొంటున్నారు. ఏజెంట్లకు అవగాహన లేకపోకవడం వలనో, సరైన నెట్‌వర్క్ లేకపోవడం వల్లనో టూరిస్ట్ వీసాలతో విదేశాలకు పంపిం చడం, తీరా అక్కడికి వెళ్లాక ఆ విషయం బయటపడటం వంటివి జరుగుతున్నాయి. బూరగాం గ్రామానికి చెందిన మహేష్ అనే ఏజెంట్ విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని వసూళ్లకు పాల్పడ్డాడని.. మండలంలోని పద్మతుల గ్రామానికి చెందిన మునకాల జగన్నాథం తదితరులు ఏకంగా జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంలోనే ఫిర్యాదు చేయడంతో ఆ కేసును జిల్లా ఎస్పీ కార్యాలయం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఫార్వర్డ్ చేసింది.
దీంతో స్థానిక ఎస్‌ఐ సిహెచ్.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే. ఇక తాజాగా సోమవారం ఒడిశా రాష్ట్ర పరిధి చీకటిబ్లాక్ పరిధి పారాపేట గ్రామానికి చెందిన పదిమంది యువకులు ఒక్కొక్కరు రూ.80 వేలు చొప్పున మహేష్ అనే ఏజెంట్‌కే ఇచ్చామని స్థానిక విలేకర్ల వద్ద ఆరోపించారు. తమను సింగపూర్ పంపించాడని, తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఉద్యోగం ఇవ్వలేదని, తిరిగి ఇంటికి రావడానికి చేతిలో చిల్లిగవ్వలేకుండా చాలా ఇబ్బందులు పడ్డామని వాపోయారు. తమకు న్యాయం చేయాల్సిందిగా వారంతా కోరారు. ఇలా మండలంలో పలువురు దళారీలు విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ రకరకాలుగా నిరుద్యోగ యువతను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేయడం, వారి చేతిలో కొందరు యువకులు బలవ్వడం పరిపాటిగా మారింది. దీనిపై పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా ఫలితం లేకపోతోంది.
అప్రమత్తంగా ఉండాలి:ఎస్‌ఐ
మండలంలో విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ కొందరు దళారీలు తయారై యువతను తప్పుదారి పట్టిస్తున్నారని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిందిగా స్థానిక ఎస్‌ఐ సిహెచ్ దుర్గాప్రసాద్ సూచించారు. సంబంధిత ప్రక్రియ ఎంతవరకు సరిగ్గా ఉందో సరిచూసుకొని ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఇప్పటికే బూరగాం గ్రామానికి చెందిన కప్ప మహేష్‌పై ఒక కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment