సాక్షి, విజయవాడ: పత్రిపక్ష నేత చంద్రబాబు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే విమర్శలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు హైదరాబాద్‌కే పరిమితమని.. ఆయనకు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో స్థానం లేదని ఆయన విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో పొరపాటుగా టీడీపీకి 23 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు వచ్చాయని..పూర్తిగా ప్రజా విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు పార్టీకి ఈసారి అవికూడా రావని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీడీపీ కనుమరుగవుతుందన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. బయటకు రాకుండా హైదరాబాద్‌లో తన ఇంటిలో కూర్చోని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కరోనా కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఆయనకు లేదా అంటూ మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు.
(కరోనా బాధితులకు మంత్రి వీడియో కాల్)
అబద్ధాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు..
ఒక వైపు కరోనా నియంత్రణకు సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న చర్యలకు ప్రజలు మద్దతు పలుకుతున్నారని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి పనిని చంద్రబాబు భూతద్దంలో తప్పుగా చూస్తూ విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు అబద్ధాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని తెలిపారు. ప్రతిపక్ష నేతగా విపత్తు సమయంలో ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు,సలహాలు ఇవ్వాలని.. ఇకనైనా తన వైఖరీ మార్చుకోవాలని మంత్రి హితవు పలికారు.
(సమన్వయంతో పోరాడుతున్నాం)
కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ ప్రథమం..
రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలతో కరోనా నియంత్రణలో మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో కేవలం నాలుగు వారాల్లో తొమ్మిది ల్యాబ్ లను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో సగటు పరీక్షల కన్నా మూడు రెట్లు.. రోజుకు 961 టెస్ట్ లు చేస్తున్నామని వివరించారు. కోవిడ్ అనుమానిత వైద్య పరీక్షలు చేయడంలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రతి జిల్లాలోనూ కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 7900 మంది క్వారంటైన్ లో వున్నారని.. వారికి అన్ని వసతులు అందుబాటులో ఉంచామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ప్రజల ఆరోగ్యం కోసం టెలీమెడిసిన్ ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారని చెప్పారు. టెలీ మెడిసిన్ లో 300 మంది వైద్యులు పనిచేస్తున్నారని.. 14400 నంబర్ కు మిస్ట్ కాల్ చేస్తే చాలని.. వైద్యులు అందుబాటులోకి వస్తారన్నారు. ఈనెల 23వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 48,034 మందికి కోవిడ్ పరీక్షలు చేశామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment