ప్రభుత్వ భూములకు రక్షణ ఏదీ
విజయనగరం కంటోన్మెంట్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాకు విమానాశ్రయం, కేంద్ర, రాష్ట్రాల యూనివర్సిటీల మంజూ రుపై పెద్ద ఎత్తున ప్రచారంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో ప్రభుత్వ స్థలాలపై భూబకాసురుల కన్ను పడింది. జిల్లాలో ఉన్న లక్షా 24వేల ఎకరాల మేర సర్కారు భూమి ఉంది. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను రియల్టర్లు, బడాబాబులు ఆక్రమించేం దుకు యత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులు అప్రమత్తమై భూములను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ కంచెల నిర్మాణం చేపట్టాలి, ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పాతాలి. కానీ జిల్లాలో మాత్రం ఆ చర్యలు కనిపించడం లేదు. భూముల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా జారీ చేసిన ఆదేశాలను కూడా అమలుచేయడం లేదు.
ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు జిల్లాలో ప్రభుత్వ భూములను మండలాల వారీగా గుర్తించాలి వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. అవి ఎక్కెడెక్కడ ఉన్నాయో పరిశీలించి, వాటిని తరచూ అధికారులు పర్యవేక్షించాలి. జిల్లాకేంద్రం, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోనూ ఉన్న భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు కంచెలు ఏర్పాటు చేయాలి. భూములను ఆన్‌లైన్‌లో పెట్టడం వల్ల ఇతరులు దీనిని రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం ఉండదు. జిల్లాలో పరిస్థితి... కలెక్టర్ ఎంఎం నాయక్ ఇటీవల భూముల పరిరక్షణకు ఆదేశాలు జారీ చేశారు. భూముల వివరాలను ఆన్‌లైన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
జిల్లాలో 1,24,455 ఎకరాల మేర ప్రభుత్వ భూములున్నాయని, వాటిని మండలాల వారీగా గుర్తించి కంచెలు ఏర్పాటు చేయాలని తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆన్‌లైన్‌లో పెట్టడానికి మాత్రం కొన్ని మండలాల్లో మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రక్రియ కూడా సక్రమంగా జరగడం లేదు. ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భూములకు పెద్ద ఇబ్బందులు లేకపోయినప్పటికీ చిన్నచిన్న విస్తీర్ణాలతో ఉన్న భూములను మాత్రం ఎక్కడికక్కడ ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత నెల 24వ తేదీ నాటికి కేవలం 341 ఎకరాల భూమిని మాత్రమే ఆన్‌లైన్ చేశారు. కొన్ని మండలాల్లో రికార్డులు లేకపోవడంతో భూముల ఆన్‌లైన్ చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే కంచెల నిర్మాణానికి నిధుల కొరత అడ్డు తగులుతోంది.