రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, 10మందికి గాయాలు
హనుమాన్‌జంక్షన్, న్యూస్‌లైన్ : జాతీయ రహదారిపై కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని వేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఒకరు అక్కడికక్కడే మరణించగా, పదిమంది గాయపడ్డారు. హైదరాబాదు నుంచి పిఠాపురం వెళుతున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉన్న సిమెంట్ లోడు లారీని బలంగా ఢీకొంది. ఆ సమయంలో ప్రయాణికులు నిద్రమత్తులో ఉన్నారు. బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జు కాగా అద్దాలు పగిలిపోయి ప్రయాణికులకు గుచ్చుకున్నాయి.
లారీ వెనుకభాగం దెబ్బతింది. బస్సు ముందు సీటులో కూర్చున్న చెత్యర్థి పెద్దిరాజు (45) మరణించాడు. ఆయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన కొబ్బరిబొండాల వ్యాపారి. హైదరాబాదులో స్థిరపడిన పెద్దిరాజు స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదంలో మృతి చెందాడు. 108 అంబులెన్స్ సిబ్బంది ప్రయాణికులను బస్సు కిటికీల్లోనుంచి బయటకు తీశారు. రాజమండ్రికి చెందిన పైడిమళ్ల ప్రసాద్, రాజవరపు ప్రసన్న, రాజవరపు అనంతలక్ష్మి, పెద్దాపురానికి చెందిన పెద్దిరాజు అనంతలక్ష్మి, కాకినాడకు చెందిన తాళాల శివ, జగ్గంపేటకు చెందిన మంగి సుబ్రమణ్యం, మరికొందరు గాయపడ్డారు. 108, హైవే అంబులెన్స్, ప్రైవేటు వాహనాల్లో క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో లారీలో చిక్కుకున్న బస్సును బయటకు తీశారు.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే..
ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. జాతీయ రహదారిపై మార్జిన్‌కు అవతల నిలిపి ఉన్న లారీని మితిమీరిన వేగంతో బస్సు ఢీకొంది. డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం లేదా నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.