మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలన్న పాలక, ప్రతిపక్షాల కుట్రలు సాగలేదని, ఎన్ని కుతంత్రాలు చేసినా జనం మెచ్చిన నేత ఆయనేనని ఆ పార్టీ మహబూబ్‌నగర్ నియోజకవర్గ సమన్వయకర్త సురేందర్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ యువనేతకు ప్రజాదరణ తగ్గలేదనడానికి ఆయన బెయిల్‌పై విడుదలైన రోజు ప్రాంతాలకతీతంగా ప్రజలు పలికిన నీరాజనమే నిదర్శనం అన్నారు.
జగనన్నకు బెయిల్ రావడంతో రాష్ట్ర ప్రజల్లో ఆశలు చిగురించాయని, తెలంగాణ ప్రాంతంలో కూడా తమ పార్టీ బలంగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. సమన్యాయం కోసం నడుంబిగించిన ఆయన చేసే దిశానిర్దేశంతో పార్టీ పూర్వవైభవానికి పునరంకితం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి మూలంగా పార్టీ శ్రేణుల్లో కొంత స్తబ్ధత ఏర్పడిందని, కానీ ఏ ఒక్కరూ కూడా పార్టీని వీడలేదని అన్నారు. తెలంగాణ ఏర్పాటు అంశం పూర్తయిందని, ఈ ప్రాంతంలో అన్ని పార్టీల కంటే వైఎస్సార్‌సీపీకే ప్రజల్లో అత్యధిక ఆదరణ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జగనన్నకు బెయిల్ వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని త్వరలోనే జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించి భావి కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. వైఎస్సార్ కుటుంబం అభిమానులు, జగనన్న శ్రేయోభిలాషులు పార్టీలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ రవిప్రకాశ్, నాయకులు సతీశ్‌గౌడ్, మిట్టమిదీ నాగరాజు, ఎస్.వెంకట్‌రెడ్డి, పవన్, రమేష్ పాల్గొన్నారు.