ప్రతీకాత్మక చిత్రం
పిల్లల ఉన్నత చదువులు.. ఆడపిల్ల పెళ్లి... కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కోసం సామాన్యులు డబ్బు కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వచ్చిన వారి అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న వడ్డీ వ్యాపారులు మీటరు వడ్డీ, బారు వడ్డీ, చక్రవడ్డీ పేరిట అడ్డంగా దోచేస్తున్నారు. ప్రామిసరీ నోట్లు, ఏటీఎం కార్డులు, బ్యాంకు ఖాళీ చెక్కులు తీసుకుని నగదు ఇస్తున్నారు. ఆపై రోజువారీ, వారం, నెలవారీ వడ్డీ అంటూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. వడ్డీ చెల్లింపులో ఏమాత్రం జాప్యం జరిగినా వేధింపులకు దిగుతున్నారు. ఒక్క నరసరావుపేట పట్టణంలో వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక రెండు నెలల వ్యవధిలో ముగ్గురు బలవన్మరణాలకు పాల్పడ్డారు.
సాక్షి, గుంటూరు : జిల్లాలో వడ్డీ వ్యాపారులు కాలసర్పాలుగా మారి బుసలు కొడుతున్నారు. అత్యవసరంగా నగదు అవసరమై వచ్చిన వారి నిస్సహాయతను ఆసరా చేసుకొని వడ్డీ మీద వడ్డీ వేస్తూ వారి శ్రమను జలగల్లా పీల్చుకుంటున్నారు. మీటర్ వడ్డీ, బారువడ్డీ, చక్రవడ్డీ అంటూ అప్పు ఇచ్చి, రోజువారీ, వారం, నెలవారీ వడ్డీల పేరుతో సంవత్సరాలు, నెలలు తరబడి వసూలు చేస్తున్నారు. వడ్డీ అసలును మించినా బాకీ తీరలేదంటూ బెదిరిస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఇప్పటి వరకు చెల్లించింది వడ్డీకే చాల్లేదంటూ దాడులకు దిగుతున్నారు. నరసరావుపేటలో వడ్డీ వ్యాపారుల వేధిం పులు తాళలేక రెండు నెలల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వడ్డీ వ్యాపారులల ఆగడాలు మితిమీడంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
పోలీస్‌స్టేషన్లలోనే పంచాయితీలు
జిల్లాలో కొందరు వడ్డీ వ్యాపారులు పోలీస్ స్టేషన్లలో పోలీసులతోనే పంచాయితీలు చేయిస్తూ తమకు రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంన్నారు. గుంటూరులోని ఫ్రూట్ మార్కెట్లో ఇప్పటికీ రోజు వారీ వడ్డీలు బహిరంగంగానే కొనసాగుతుండటం మీటరు వడ్డీ వ్యాపారుల దందాకు నిదర్శనం. తెనాలి, నరసరావుపేట కూరగాయల మార్కెట్లు, మాచర్ల, బాపట్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల సహా వివిధ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారం మూగు ప్రామిసరీ నోట్లు.. ఆరు ఖాళీ చెక్కులు అన్న చందంగా విచ్చలవిడిగా సాగుతోంది.
కోర్టు కేసుల పేరిట వేధింపులు
అప్పుకోసం తమ వద్దకు వచ్చే వారి వద్ద వడ్డీవ్యాపారులు బ్యాంక్ ఖాళీ చెక్కులు, ఏటీఎం కార్డులు తీసుకుని ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు చేయించుకుంటారు. డబ్బు ఇచ్చే సమయంలో రూ.100కు రూ.10 నుంచి రూ.20 తగ్గించి మిగిలిన డబ్బును అప్పుగా ఇస్తున్నారు. వడ్డీ మాత్రం వంద రూపాయలకు వసూలు చేస్తున్నారు. కొంతమంది నిస్సహాయ స్థితిలో భవనాలు, భూములు, నగలు, ఇళ్లను తనఖా పెడుతున్నారు. వారు వడ్డీ చెల్లించడంలో ఆలస్యమైతే వడ్డీ వ్యాపారులు ఆయా ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. రుణగ్రహీత వడ్డీ చెల్లించడం ఆలస్యమయినా, అక్రమంగా వసూలు చేస్తున్న వడ్డీ గురించి ప్రశ్నించినా అప్పు ఇచ్చిన సమయంలో తీసుకున్న ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఆధారంగా ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తం రాసుకుని కోర్టుల్లో చెక్‌బౌన్స్ కేసులు వేస్తామని, జైల్లో వేయిస్తామని చెప్పి బెదిరిస్తున్నారు.
వడ్డీవ్యాపారుల్లో చాలా మంది అనుమతులు లేనివారే కావడం గమనార్హం. ఇటీవల గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బడా వడ్డీ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి భారీ స్థాయిలో ప్రామిసరీ నోట్లు, ఏటీఎం కార్డులు, బ్యాంకు పాస్ బుక్కులు పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనతో వడ్డీ వ్యాపారులు మరింత జాగ్రత్త పడుతున్నారు. ప్రాంసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, ఏటీఎంలు తమ నివాసాల్లో ఉంచుకోవడం లేదు. తెలిసినవారు, స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఉంచుతున్నారు.
వడ్డీ వసూలు చేసేది ఇలా..
రూ.లక్ష తీసుకుంటే నాలుగు నుంచి పది రూపాలయ వరకూ వడ్డీ వసూలు చేస్తారు. నెలనెలా కొంత మొత్తాన్ని అసలు కింద జమచేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. రుణగ్రహీత నెలనెలా అసలు కింద సొమ్ము జమ చేస్తున్నా వడ్డీ మాత్రం చివరి నెల వరకూ రూ.లక్షకే వసూలు చేస్తారు. ఈ లెక్కన రుణగ్రహీత తీసుకున్న సొమ్ముతో సమానంగా వడ్డీ చెల్లించాల్సి వస్తోంది.
కఠిన చర్యలు తీసుకుంటాం..
వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేయకూడదు. ఎవరినీ వేధింపులకు గురిచేయకూడదు. అధికవడ్డీ, వేధింపులపై బా«ధితులు ఫిర్యాదు చేస్తే సంబంధిత వడ్డీ వ్యాపారులపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. వడ్డీ పేరుతో సామాన్యులను పీక్కుతింటున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వడ్డీ వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– పీహెచ్‌డీ రామకృష్ణ, అర్బన్ జిల్లా ఎస్పీ
పోలీసులను ఆశ్రయించాలి
వడ్డీ వ్యాపారస్తులు వేధింపులకు పాల్పడితే బాధితులు స్థానిక పోలీస్‌లను ఆశ్రయించాలి. వడ్డీ వ్యాపారుల వేధింపులకు భయపడి ఆత్మహత్యలకు పాల్పడటం, ఊరు వదిలి వెళ్లిపోవడం వంటి చర్యలకు పాల్పడొద్దు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు బాధితుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పోలీసులను ఆశ్రయించి రక్షణ పొందాలి.
– ఆర్. జయలక్ష్మి, రూరల్ జిల్లా ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment