గొల్లప్రోలులో ఆందోళనకు దిగిన పెండెం దొరబాబు, పార్టీ నేతలు
తూర్పుగోదావరి, పిఠాపురం: దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్టుంది అధికార తెలుగుదేశం పార్టీ నేతల తీరు అన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లను అక్రమ మార్గంలో తొలగించడానికి ఆన్‌లైన్ డేటాను ప్రైవేటు సంస్థలకు టీడీపీ ప్రభుత్వం అప్పగించిన విషయం విదితమే. గుట్టుచప్పుడు కాకుండా అక్రమాలకు పాల్పడిందే కాకుండా ఎటువంటి ప్రమేయం లేని తమను వేధింపులకు గురిచేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 70 వేలకు పైగా ఓట్లను రద్దు చేయాలంటూ నకిలీ దరఖాస్తులను దొడ్డిదారిన ఎన్నికల సంఘానికి పంపించగా వాటిలో ఎక్కువ వైఎస్సార్ సీపీ బూత్ కమిటీల నాయకుల పేరున దరఖాస్తు చేసినట్టు ఉండడం గమనార్హం. ఒకే వ్యక్తి పేరున వందకు పైగా దరఖాస్తులు పెట్టడంతో పాటు అన్నీ వైఎస్సార్ సీపీ నేతల పేరున రావడంతో ఎన్నికల అధికారులు వారిని పిలిపించి విచారణ చేపట్టగా తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.
పైగా తమ వారి ఓట్లను తామెందుకు తీసేయమని దరఖాస్తు చేస్తామని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలు ఆందోళనలకు దిగడంతో ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. దీంతో తమ బండారం బయటపడుతుందన్న భయంతో అధికార పార్టీ నేతలు ఎదురుదాడికి దిగినట్టు వైఎస్సార్ సీపీ నేతలు చెబుతున్నారు. తమ సంతకం గాని, వివరాలు గాని ఇవ్వకుండా తమ పరోక్షంలో టీడీపీ యాప్ ద్వారా ఆన్‌లైన్ డేటాను అడ్డుపెట్టుకుని కేవలం వైఎస్సార్ సీపీ ఓట్లనే టార్గెట్ చేసిన టీడీపీ.. ప్రస్తుతం తమపై తప్పుడు కేసులు పెట్టి తమను ఇరికించాలని చూస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఐదు రోజులుగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సుమారు మూడు వేల మందికి పైగా తమ పార్టీ బూత్ కమిటీల సభ్యులకు నోటీసులు జారీచేసిన పోలీసులు, దాదాపు 1500 మందిపై కేసులు నమోదు చేశారు. వారిని పోలీసుల స్టేషన్లకు రప్పించి బలవంతంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతోనే పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని, అక్రమ కేసులు, అరెస్టులు ఆపకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని వైఎస్సార్ సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
పోలీసులు ఇప్పటి వరకు విచారించిన వారి వివరాలు..
తునిలో..
తుని నియోజకవర్గంలో 13 మంది బూత్ కమిటీ కన్వీనర్లపై పోలీసులు కేసు నమోదు చేసి కొంతమందిని విచారించారు. ఓట్ల తొలగింపునకు ఎటువంటి ఫిర్యాదులు తాము చేయలేదని కన్వీనర్ల నుంచి పోలీసులు లేఖలు తీసుకున్నారు.
ప్రత్తిపాడులో..
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడులో ముగ్గురు బూత్ కమిటీ కన్వీనర్లను పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించారు.
పిఠాపురంలో..
గొల్లప్రోలు మండలంలో ఓటర్ల తొలగింపు దరఖాస్తులు చేశారంటూ 43 మంది వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ కన్వీనర్లపై, వైఎస్సార్ సీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి కేసులు నమోదు చేసిన బూత్‌కమిటీ కన్వీనర్ల ఇళ్లకు వెళ్లి పోలీసులు హడావుడి చేశారు. పోలీసుస్టేషన్‌కు రాకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఉదయం వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీనిపై వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ దొరబాబు ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం వద్ద రాస్తారోకో నిర్వహించి బైఠాయించారు. తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగడంతో దిగివచ్చిన పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను వదిలివేశారు.
కాకినాడ సిటీలో..
కాకినాడ సిటీలో 20 మంది బూత్ కమిటీ కన్వీనర్లను పోలీసులు విచారించారు. వారికి నోటీసులు ఇచ్చారు.
పెద్దాపురంలో..
టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ బూత్‌కమిటీ కన్వీనర్లపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదును అందజేశారు.
అమలాపురంలో..
గుర్తుతెలియని వ్యక్తులు ఓట్లు తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేశారంటూ వీరిపై విచారణ చేయాలంటూ తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంపచోడవరంలో..
బుధవారం విలీన మండలాల్లో వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్లను ఆయా పోలీస్‌స్టేషన్లకు పిలిచి పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం వారి నుంచి లిఖిత పూర్వకంగా లేఖలు తీసుకున్నారు. చింతూరులో 20 మంది, ఎటపాకలో 30 మంది, కూనవరంలో 13 మంది, వీఆర్‌పురంలో 10 మంది, రాజవొమ్మంగిలో నలుగుగురు, మారేడుమిల్లిలో ఇద్దరు, గంగవరంలో ముగ్గురు, అడ్డతీగలలో ఇద్దరు, వై.రామవరంలో ఒకరు చొప్పున నాయకులను పోలీసులు విచారించారు. తమకు తెలియకుండానే ఆన్‌లైన్‌లో ఫారం–7 పేరుతో దొంగ దరఖాస్తులు పెట్టారని, వాటికీ తమకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు చెప్పామని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment