పచ్చనోట్లకు సెల్యూట్
సాక్షి, ఏలూరు: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు నేరస్తులకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు. పచ్చనోట్ల వ్యామోహంలో పడి పోలీస్ వ్యవస్థ పరువు తీస్తున్నారు. వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. విధుల్లో సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు కనీస గౌరవాన్ని ఇవ్వడంలోనూ తలబి రుసుతనాన్ని ప్రదర్శించి ఇబ్బందుల పాలవుతున్నారు. ఇటీవల డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారులు ఇలాంటి ధోరణులతో అభాసుపాలయ్యారు.
అంకన్నగూడెం ఘటన మొదలుకొని...
ఈ ఏడాది ఆగస్టులో పెదవేగి మండలం అంకన్నగూడెంలో అకారణంగా ఓ వర్గం వారి ఇళ్లపై మరో వర్గం వారు దాడిచేసి సామగ్రిని ధ్వంసం చేయడంతోపాటు పలువుర్ని తీవ్రంగా గాయపర్చారు. దాడులకు పాల్పడిన వారిని వదిలేసిన పోలీసులు బాధితులను అరెస్ట్ చేశారు. వారిని కొద్ది రోజులపాటు స్టేషన్లు మారుస్తూ వాళ్లు తమ వద్దలేరంటూ బుకాయించారు. పోలీసుల అదుపులోనే ఉన్న విషయం బయటపడటంతో చివరకు విడిచిపెట్టారు. అంతకుముందు అదే మండలంలోని పినకడిమి గ్రామంలో జేకే రెస్టారెంట్ యజమాని భూతం దుర్గారావును దుండగులు హత్యచేయగా, ఆ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ చేయలేకపోయారు.
ఈ రెండు కేసులను పర్యవేక్షించిన డీఎస్పీ మేకా సత్తిబాబు కొద్దిరోజుల క్రితం చేపల చెరువు విషయమై కొల్లేరు ప్రాంతానికి చెందిన రెండువర్గాల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో ప్రజాప్రతినిధులతో వైరం తెచ్చుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ వంటి వారితోనే జగడానికి దిగారు. ఫలితంగా ఎలాంటి ప్రాధాన్యత లేని కంప్యూటర్స్ విభాగానికి బదిలీ అయ్యారు. ఇదే కేసు లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నిడమర్రు ఎస్సై బీవై కిరణ్‌కుమార్ క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. డీఎ స్పీ మార్గంలోనే నడిచిన ఏలూరు వన్‌టౌన్ సీఐ సీహెచ్‌వీ మురళీకృష్ణ తాజాగా సస్పెండయ్యారు. సంచలనం సృష్టించిన గంధం నాగేశ్వరావు, అతని ఇద్దరు కుమారుల హత్య కేసులో సీఐ తీరు పోలీసు వ్యవస్థ పరువును గంగలో కలిపేసింది. హతులకు రక్షణ కల్పించేందుకు కానిస్టేబుళ్లను పంపిన సీఐ అలాంటిదేమీ లేదని బుకాయించి చివరకు విజయవాడ పోలీసులకు దొరికిపోరుు విధులకు దూరమయ్యారు.
నిజాయితీగా పనిచేసే వారున్నా...
జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో మొత్తం 64 పోలీస్ స్టేషన్లున్నాయి. ఒక ఎస్పీ, ఒక ఏఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు కలిపి దాదాపు 2,800 మంది ఉన్నారు. వీరిలో చాలామంది విధుల్లో నిబద్ధత పాటిస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు. పెద్దపెద్ద నేరాలు జరిగినప్పుడు క్రమకోర్చి నేరస్తులను పట్టుకుంటున్నారు. కానీ.. కొందరు మాత్రం అక్రమార్జనపైనే దృష్టి సారిస్తున్నారు. అవినీతి ఆరోపణలతో పెదపాడు ఎస్సై గంగాభవాని ఈ ఏడాది జనవరిలో సస్పెండయ్యారు. అదే సమయంలో సహోద్యోగి మోసం చేశాడంటూ ఏలూరులో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. నరసాపురంలో హోంగార్డు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతకుముందు లంచం తీసుకుంటూ నిడదవోలు సీఐ సాంబశివరావు ఏసీబీకి పట్టుబడ్డారు.
గతంలోనూ జిల్లా పోలీసులపై పలు అవినీతి, అక్రమాల మరకలు పడ్డాయి. 2004లో లంచం సొమ్ము పంపకాల్లో తలెత్తిన వివాదం ముదిరి పోలీసులే సాటి పోలీసును చంపేశారు. చివరకు కటకటాల పాలయ్యారు. ఈ కేసులో కొవ్వూరు డివిజన్‌లో ఐదేళ్ల కాలంలో పనిచేసిన డీఎస్పీలు, ఎస్సైలకు చార్జి మెమోలు జారీ అయ్యాయి. జరిమానా రసీదులను అక్రమంగా ముద్రించి కొవ్వూరు డివిజన్‌లో ఓ ఏఎస్సై సస్పెండయ్యారు. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ వస్తుందని ఆశ పడుతున్న ప్రతిసారి ఇలాంటి ఘటనలు పోలీస్ శాఖకు మచ్చ తెస్తున్నారుు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఉన్నతాధికారులు పోలీస్ వ్యవస్థను సంస్కరించాలని, సిబ్బంది తీరులో మార్పు తేవాలని ప్రజలు కోరుతున్నారు.