గూడు.. గోడు..! | preposterous bills and Homes was stoped | Sakshi
Sakshi News home page

గూడు.. గోడు..!

Published Wed, Feb 11 2015 1:47 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

గూడు.. గోడు..! - Sakshi

గూడు.. గోడు..!

అందని బిల్లులు..ఆగిన గృహాలు..
పేరుకుపోయిన రూ.30 కోట్ల బకాయిలు
8 నెలలుగా నయాపైసా విడుదల చేయని ప్రభుత్వం
ఆందోళనలో లబ్ధిదారులు


కర్నూలు (అర్బన్) : గృహ వసతి లేని నిరుపేదలందరికి ఉచితంగా మూడు సెంట్ల ఇళ్ల స్థలాలను ఇచ్చి  రూ.1.50 లక్షలతో అద్భుతమైన గృహాన్ని నిర్మించి ఇస్తామని ఎన్నికలకు ముందు తెలుగుదేశం కల్లబొల్లి మాటలు చెప్పింది. ఓట్లు దండుకొని అధికారాన్ని చేపట్టిన అనంతరం ఈ ఊసే ఎత్తడం లేదు. అలాగే పట్టణాలు, నగరాల్లో నివశించే పేదలు, మధ్య తరగతి వర్గాలకు అనుకూలమైన స్థలాల్లో కాలనీలు, తక్కువ ధరలో అపార్ట్‌మెంట్ల నిర్మాణం చేపడతామనే చంద్రన్న ఎన్నికల హామీ నేటికి కార్యరూపం దాల్చలేదు. రోజులు, నెలలు గడిచిపోతున్నా, ఒక్క కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలేదు సరికదా, కనీసం కట్టుకున్న ఇళ్లకు కూడా బిల్లులను చెల్లించడం లేదు. గృహ నిర్మాణం పట్ల ఎలాంటి విధానపరమైన నిర్ణయాలను ప్రకటించలేదు. దీంతో గృహ నిర్మాణం పట్ల ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నారు.

నిషేధం ఎత్తివేత ఎప్పుడో...

ఎన్నికల సాకుతో బిల్లుల చెల్లింపుపై గత ఏడాది మార్చి నెలలో విధించిన నిషేధాన్ని నేటికి ఎత్తి వేయలేదు. ఆన్‌లైన్ లెక్కల ప్రకారం జిల్లాలో   పూర్తి అయిన, వేర్వేరు దశల్లో కొనసాగుతున్న ఇళ్లకు దాదాపు రూ.30 కోట్లను చెల్లించాల్సి వుంది. బిల్లుల కోసం లబ్ధిదారులు కార్యాలయాల చుట్టు తిరుగుతున్నా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. అనేక మంది నిర్మాణాలను మధ్యలోనే ఆపేయగా, మరి కొంత మంది అప్పులు చేసి ఇళ్లను నిర్మించుకుంటున్నారు. కట్టుకున్న ఇళ్లకు బిల్లులు రాక, చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక నిరుపేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.

వేర్వేరు దశల్లో ఆగిన 64,498 గృహాలు...

రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణంలో వున్న గృహలకు బిల్లులను నిలిపివేయడంతో జిల్లాలో ఇందిరమ్మ మూడు విడతలు, జీఓ నెంబర్ 171, మూడు విడతల రచ్చబండ కార్యక్రమాల్లోని దాదాపు 64,498 గృహాలు వేర్వేరు దశల్లో కొనసాగుతుండగా, సగానికి పైగా ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. అన్ని పథకాల్లో భాగంగా జిల్లాకు 3,84,273 గృహాలు మంజూరు అయ్యాయి. వీటిలో నేటికి బీబీఎల్ లెవెల్‌లో 9970, బీఎల్‌లో 31003, ఎల్‌ఎల్‌లో 4986, ఆర్‌ఎల్‌లో 18539 గృహాలు వున్నాయి. వీటన్నింటికి బిల్లులు చెల్లించాల్సి వుంది.

ఆధార్ సీడింగ్, జియో ట్యాగింగ్‌తో కాలయాపన...

జిల్లాలో వివిధ దశల్లో నిర్మాణంలో వున్న ఇళ్లకు బిల్లులు మంజూరు చేయకుండా, నిర్మించిన గృహాల్లో అవినీతి అక్రమాలను అరికట్టేందుకు అంటు ఆధార్ సీడింగ్, జియో ట్యాగింగ్ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అవినీతి, అక్రమాలను నిగ్గుతేల్చడంలో ఎవరికి అభ్యంతరం లేదని, అయితే నిరుపేదలు నిర్మించుకుంటున్న గృహాలకు బిల్లులు మంజూరు చేయాలంటున్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమాలు, వరుస ఎన్నికలతో దాదాపు ఏడు నెలలుగా ఆగిపోయిన బిల్లులు, కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే విడుదల అవుతాయని ఆశించినా ఫలితం కనిపించకపోవడంతో నిరుపేద లబ్ధిదారులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గృహ నిర్మాణంపై దృష్టి సారించి బకాయి పడ్డ బిల్లులను విడుదల చేయాలని లబ్దిదారులు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement