►మహిళా సమాఖ్యలకు గ్రహణం
► పాత వారిని తొలగించేందుకు ఎన్నికల మంత్రం
► కోర్టును ఆశ్రయించిన సమాఖ్యల అధ్యక్షులు
► స్టే వచ్చినా గ్రామ సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు
సాక్షి, ఏలూరు : జిల్లాలోని మహిళా సమాఖ్యలు రాజకీయ చదరంగంలో నలిగిపోతున్నాయి. సమాఖ్యల ప్రస్తుత అధ్యక్షులను తొలగించే కుట్రలు సాగుతున్నాయి. తమకు అనుకూలంగా ఉండేవారిని సమాఖ్య అధ్యక్షులుగా ఎంపిక చేయూలని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఎన్నికలు వద్దంటూ ప్రస్తుత సమాఖ్యల అధ్యక్షులు టీడీపీ జిల్లా నాయకుల్ని ఆశ్రయించారు. ఫలితం లేకపోవడంతో చంద్రబాబునాయడు వద్దకు వెళ్లి వేడుకున్నారు. ఆయన కూడా కనికరించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. సేవా ధృక్పథంతో అధ్యక్ష పదవి చేపట్టిన మహిళలు తమ గోడు వినేవారు లేక నిస్సహాయం గా ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వానికి.. సంఘాలకు మధ్య వారిధిగా
జిల్లాలోని 46 మండలాలకు 46 మంది మహిళా సమాఖ్య అధ్యక్షులు ఉన్నారు. నాలుగేళ్లుగా వీరంతా ప్రభుత్వ పథకాలను స్వయం సహాయక సంఘాలకు చేరవేస్తున్నారు. ప్రభుత్వానికి, డ్వాక్రా సంఘాలకు మధ్య వారధిగా ఉంటున్నారు. వీరిని తొలగించి కొత్త వారిని ఎన్నుకోవడానికి వీలుగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి జిల్లాలో మహిళా సమాఖ్యల పదవీ కాలం 2015 వరకూ ఉంది. ఈ మేరకు గ్రామ సమాఖ్యల్లో తీర్మానం చేశారు. అయినా వాటిని రద్దు చేయడానికే ప్రభుత్వం మొగ్గుచూపడంతో వాళ్లంతా న్యాయస్థానం మెట్లెక్కారు.
వారి ఆవేదనకు సమాధానం దొరికేంత వరకూ (గరిష్టంగా రెండు వారాలు) ఎన్నికలు నిలిపివేయాల్సిందిగా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. కానీ గ్రామస్థాయిలో గ్రామ సంఘం ఎన్నికలు జరిగిపోతున్నాయి. ప్రస్తుతం మహిళా సమాఖ్య అధ్యక్షులు పదవిలో ఉన్నప్పటికీ వారిని లెక్కలోకి తీసుకోవడం లేదు. కొద్దిరోజుల క్రితం జిల్లా సమాఖ్య సమావేశం జరిగితే దానికి హాజరుకావాల్సిన ఇన్‌చార్జి డీపీఎం కె.పూర్ణచంద్రరావు రాలేదు. అదేరోజు ఏపీఎంలతో సమావేశం ఏర్పాటు చేసి మహిళా సమాఖ్య సమావేశానికి వారు వెళ్లే అవకాశం లేకుండా చేశారు.
ఎన్నికలపై కోర్టు స్టే ఇచ్చిన అంశాన్ని పూర్ణచంద్రరావుకు తెలియజేసినప్పటికీ పెదవేగి మండలంలో సమాఖ్య ఎన్నికలు నిర్వహించడం అధికారుల తీరుకు అద్దం పడుతోంది. ఇదే అధికారి ఆధీనంలో ఉండే డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీ సొమ్ము మం జూరు కాకపోవడంపై గతేడాది కలెక్టర్‌కు కొందరు మహిళలు ఫిర్యాదు చేశారు. ఆ సమస్య నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. అయితే వీరిని కొందరు ప్రజా ప్రతినిధులు ఈ విధంగా నడిపిస్తున్నారని తెలుస్తోంది. సమాఖ్య అధ్యక్షులపై అపవాదులు వేసి వారిని తప్పిం చడానికి ఎన్నికల మంత్రం జపిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
టీడీపీ నేత ఒకరు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికలు జరపాల్సిందేనంటూ ఉన్నతాధికారులపై వత్తిడి తేవడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు సమాచారం. రానున్న రోజుల్లో తమ నేతల సభలు, సమావేశాలకు మహిళల్ని సమీకరించేందుకు, తమ పనులు చేయించుకునేందుకు అనుకూలంగా ఉంటే కార్యకర్తలను అధ్యక్షులుగా చేసేందుకు అధికార పార్టీ నేతలు ఈ 46 మందిని తప్పించాలని చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాజకీయ ‘చెద’రంగం
Published Tue, Sep 16 2014 1:38 AM | Last Updated on Mon, Sep 17 2018 4:52 PM
Advertisement
Advertisement