మంచులోగిలిలో అసౌకర్యాల విడిది | Proceedings manculogililo resort | Sakshi
Sakshi News home page

మంచులోగిలిలో అసౌకర్యాల విడిది

Published Sat, Jan 4 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM

Proceedings manculogililo resort

=లంబసింగిలో పర్యాటకాభివృద్ధి కలేనా?
 =అత్యల్ప ఉష్ణోగ్రతలతో రాష్ట్రంలో గుర్తింపు
 =రెండేళ్లుగా పెరుగుతున్న పర్యాటకులు
 =అయినా సదుపాయాలు శూన్యం

 
నర్సీపట్నం, చింతపల్లి రూరల్, గొలుగొండ, న్యూస్‌లైన్ : శీతాకాలం వచ్చిందంటే చాలు...ఆ ప్రాంతంలో ఎక్కడాలేని కొత్త అనుభూతి....ఈ సమయంలో ఆ ప్రాంతంలో కాలుమోపితే చాలు... చల్లగా ఎవరో స్పృశించిన అనుభూతి కలుగుతుంది. ఉదయం తొమ్మిది గంటల వరకు సూరీడుతో పోటీపడుతూ ఉండే మంచుతెరలు ఆపై వెనక్కు తగ్గడంతో ఈ ప్రాంతంలో వెలుగులు కనిపిస్తాయి. మళ్లీ నాలుగైదు గంటలు కనిపించి, సాయంత్రం నాలుగుకల్లా మరలా మంచుతెరలు కమ్ముకొస్తాయి...వీటి నడుమ సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం పది గంటల వరకు మంచు పల్లకీలో ఊరేగుతున్నట్టు అక్కడి వారికి అనుభూతి కలిగిస్తుంటాయి...ఇలా వర్షపు జల్లుల్లా కురిసే మంచు పచ్చదనాన్ని కప్పడంతో కొత్త అందాలు ఆవిష్కృతమవుతాయి.

ఇదంతా ఎక్కడో కాదు... రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే లంబసింగిలో. విశాఖ జిల్లా నర్సీపట్నానికి 25 కిలోమీటర్ల దూరంలో చింతపల్లి మండలంలో లంబసింగి ఉంది. ఈ ప్రాంతం వెళ్లాలంటే నర్సీపట్నం నుంచి తెల్లవారుజామున 4.20 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ప్రతి అరగంటకొక బస్సు చొప్పున రవాణా సౌకర్యం ఉంది. దీంతో పాటు ఇక్కణ్ణుంచే నేరుగా లంబసింగి వెళ్లేందుకు జీపులు ఎప్పడికప్పుడు అందుబాటులో ఉంటాయి.
 
ఇక్కడ వాతావరణం ఆపిల్ తోటల పెంపకానికి అనుకూలంగా ఉంటుందని పలువురు ఆసక్తి చూపుతున్నారు. కొద్దిగానే అయినా ఆపిల్ తోటల పెంపకం చేపడుతుండడం మరో విశేషం. ఇంతటి విశిష్ట వాతావరణం పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తోంది. మలయమారుతాన్ని చవిచూస్తూ చలి నెగళ్లలో సేద తీరుతూ పర్యాటకులు ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తుంటారు. అయితే ఇది కొద్ది సేపే. ఈ ఆహ్లాదం అందరికీ అందని మావే. ఎందుకంటే ఎంతో ఉత్సాహంతో వచ్చే పర్యాటకులకు ఇక్కడ పచ్చి మంచినీళ్లు దొరకవు, ఆహారం వెంట తెచ్చుకోవాల్సిందే.

ఇక ఓ రాత్రి విడిది చేయాలంటే వసతి గగన కుసుమమే. ఇక్కడ ఎటువంటి మౌలిక వసతులు లేవు. దీంతో సందర్శకులు నిరాశగా వెనుదిరుగుతుంటారు. దీనివల్ల ఒకసారి వచ్చిన పర్యాటకుడు మరోసారి ఇక్కడకు రావాలంటేనే వెనుకాడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం పర్యాటకంగా దీనిని అభివృద్ధి పరచడంతో పాటు ఆపిల్ తోటల పెంపకంపై దృష్టి సారిస్తే మన్యంలో ఈ మంచు లోగిలి ఆంధ్రా సిమ్లాలా ప్రఖ్యాతి గాంచడం ఖాయమని పలువురు సూచిస్తున్నారు.
 
 కాస్త ఊరట...
 =సదుపాయాల్లేకపోయినా పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది.
 
 =పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ ప్రాంతానికి అనుకూలంగా ఉన్న శీతాకోకచిలుకల పార్కును లంబసింగిలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
 
 =దీంతోపాటు టూరిజం డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో రూ. 3.50 కోట్లతో కాటేజీ, రెస్టారెంట్ల నిర్మాణం చేయాలని స్థల సేకరణ పూర్తి చేసింది. ఈ పనులింకా ప్రారంభం కాలేదు.
 
 అక్కరకు రాని గుర్తింపు
 =అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదులో లంబసింగికి రాష్ట్రవ్యాప్త గుర్తింపు వచ్చింది.
 
 =శీతాకాలంలో  నమోదయ్యే అత్యల్ప ఉష్ణోగ్రతలపై పత్రికలు, టీవీల ద్వారా ప్రచారం పెరగడంతో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని తిలకించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
 
 =ఈ విధంగా పర్యాటకుల తాకిడి పెరుగుతున్నా, స్థానికంగా దానికి అనువైన పరిస్థితులు లేకపోవడం వల్ల వీక్షకులకు ఇబ్బందులు తప్పడం లేదు.
 
 =పర్యాటకం పెరుగుతున్నా వారికి నాణ్యమైన వసతి సదుపాయాలు కల్పించే స్థోమత లేక స్థానికులకు ఎటువంటి ప్రయోజనం ఒనగూరడం లేదు.
 
 వసతుల్లేక
 పర్యాటకానికి అనువైన వసతులు ఇక్కడ లేక వచ్చేప్పుడే అవసరమైన భోజనం అన్నీ వెంట తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇక్కడ తెలిసిన వారుంటే తప్ప రాత్రి ఉండేందుకు అవకాశం లేదు. దీనివల్ల రాత్రి మొత్తం ఉండేందుకు వీలు కావడం లేదు.
 - లక్ష్మణ్‌కుమార్, పర్యాటకుడు, విశాఖపట్నం
 
 ఆదాయం లేదు
 లంబసింగి పర్యాటకంగా గుర్తింపు పొందినా స్థానికులమైన మాకు ఎటువంటి ఆదాయం ఉండడం లేదు. ఇక్కడకు వచ్చేవారు అన్నీ వెంట తెచ్చుకోవడంతో మా వద్ద ఎటువంటి వస్తువులు కొనుగోలు చేయడం లేదు.
 - కుమారి, హోటల్ వ్యాపారి, లంబసింగి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement