దేవునల్తాడ (పూండి) : వజ్రపు కొత్తూరు మండలం దేవునల్తాడకు చెందిన మత్స్యకారుడు పిట్ట అప్పోజి (55) సముద్రంలో వేటకు వెళ్లి మృతి చెందాడు. తోటి మత్స్యకారులు సౌదాల సత్తెయ్య, తమ్మయ్య, బి. పోతయ్య, సీహెచ్ రాజులుతో కలసి అతడు ఆదివారం వేకువ జామున ఫైబర్ తెప్పపై వేటకు వెళ్లాడు. చేపల వేట ముగించుకుని ఇంటి ముఖం పడుతున్న సమయంలో అలల ఉధృతికి తెప్ప బోల్తాపడడంతో అప్పోజి అక్కడికక్కడే మృతి చెందినట్టు సహచరులు తెలిపారు. తాము ఈదుకుంటూ తీరానికి చేరుకున్నామని అలల తాకిడి ఎక్కువ కావడంతో అప్పోజీని రక్షించలేకపోయామన్నారు. అప్పోజీ మృతదేహం దేవునల్తాడ సమీపంలోకి కొట్టుకు రావడంతో తీరానికి తీసుకు వచ్చినట్టు సర్పంచ్ సీదిరి చిరంజీవి, ఎంపీటీసీ సభ్యుడు వరదరాజులు చెప్పారు. అప్పోజీ మృత దేహం వద్దకు చేరుకున్న అతడి భార్య పార్వతి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై రోదించారు. కుటుంబం ఆధారం పోయిందని, ఇక తాము ఎలా బతకాలంటూ వారు విలపించారు. విషయం తెలుసుకున్న వీఆర్వో తిరుమలరావు వజ్రపు కొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కె.రవికిషోర్ శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.
కుటుంబాన్ని ఆదుకుంటాం
మృతిచెందిన మత్స్యకారుడు అప్పోజీ కుటుంబానికి ఆదుకొనేందుకు చర్యలు తీసుకుంటామని వజ్రపు కొత్తూరు ఎంపీడీఓ జి. వసంతరావు హామీ ఇచ్చారు. ఆయన సోమవారం మృతుని కుటుం బాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విషయాన్ని ఎమ్మెల్యే శివాజీ దృష్టిలో పెట్టి సహకరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తెప్పబోల్తా: మత్స్యకారుడి మృతి
Published Mon, Oct 27 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM
Advertisement
Advertisement