స్పందించిన సహృదయం
Published Fri, Jan 3 2014 4:52 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : స్పందించే హృదయం ఉండాలే కానీ.. సొంత ప్రాంతానికి ఎంత దూరంలో ఉన్నా, ప్రజల కష్టం గురించి తెలిశాక చలించకుండా ఉండదు. ఇప్పుడూ అదే జరిగింది. దీనికి ప్రేరణ ఇచ్చింది ‘సాక్షి’ జిల్లా సంచిక లో వచ్చిన ప్రత్యేక కథనం కావటం విశేషం. నిధుల కొరత కారణంగా జిల్లా కేంద్రంలో రెడ్‌క్రాస్ చేపట్టిన రక్త కణ విభజన కేంద్రం ఏర్పాటు పూర్తికాని వైనాన్ని ‘అత్యవసరంలోనూ అంతులేని జాప్యం’ శీర్షికన ‘సమర సాక్షి’ ప్రత్యేక కథనం డిసెంబర్ 18వ తేదీ సంచికలో ప్రచురితమైంది. అమెరికాలో నివసిస్తున్న ఈ జిల్లా వ్యక్తి పుల్లెల సూర్యనారాయణమూర్తి ఈ కథనాన్ని చదివి స్పందించారు. జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కేఎఎన్ భుక్త కూడా సహాయం అందించాల్సిందిగా ప్రోత్సహించటంతో సోదరుడు శ్యామసుందర్‌రావుకు 10 లక్షల రూపాయలు పంపి కలెక్టర్‌కు అందజేయాలని కోరారు. ఈ మేరకు శ్యామసుందర్‌రావు, డాక్టర్ పి.వి.బి.రామలక్ష్మిలు గురువారం కలెక్టర్ సౌరభ్‌గౌర్‌ను కలిసి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు ప్రబలాయని, అక్కడి రోగులకు రక్తం ఎంతో అవసరమని చెప్పారు.
రక్త కణ విభజన కేంద్రం ఉంటే రక్తంలోని కణాలను విభజించి నలుగురికి వినియోగించవచ్చని తెలిపారు. రూ.10 లక్షల విరాళం అందించిన సూర్యనారాయణమూర్తి దివంగత స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే పుల్లెల శ్యామసుందరరావు కుమారుడని చెప్పారు. ఆయన విరాళమిచ్చేలా మాజీ ఎమ్మెల్యే కేఏఎన్ భుక్త ప్రోత్సహించారని తెలిపారు. కలెక్టర్ సౌరభ్ మాట్లాడుతూ సూర్యనారాయణమూర్తి వంటివారు స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారన్నారు. భారీ మొత్తం విరాళంగా అందించడం సంతోషదాయకమన్నారు. రక్తకణ విభజన కేంద్రం ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపడతామని చెప్పారు. రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తం విరాళంగా అందించిన సూర్యనారాయణమూర్తికి అభినందనలు తెలిపారు. రెడ్‌క్రాస్ సంస్థకు తొలుత మగటపల్లి రమణమూర్తి రూ.52 లక్షలు ఇచ్చారని, తర్వాత ఇంత పెద్దమొత్తం రావడం ఇదేనని చెప్పారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సభ్యులు డాక్టర్ నిక్కు అప్పన్న, నిక్కు హరిసత్యనారాయణ, ఎం.రామారావు, గీతా శ్రీకాంత్, ఎం.అప్పారావు, కిమ్స్ వైద్యులు పి.జె.నాయుడు, రాజా ప్రమీల, రాజేంద్ర కర్ణాని తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement