పండుగ పూట విషాదం
కారంపూడి : సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు స్వగ్రామానికి వెళ్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి వాగులో పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం వేకువజామున కారంపూడి సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి...
ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన గోళ్ళపాటి శ్యాంసన్, లుథియారాణి దంపతులు, మరికొందరు బంధువులు ఉపాధి కోసం ఎనిమిది నెలల క్రితం హైదరాబాద్‌కు వెళ్లారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసం ఉంటూ తాపీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. శ్యాంసన్ బావ పల్లెపోగు చిన్నిరామయ్య సంక్రాంతి పండుగ కోసం వీరందరినీ తన కారులో స్వగ్రామానికి తీసుకొస్తున్నాడు. కారంపూడికి మూడు కిలోమీటర్ల దూరం లో ఉన్న మంత్రాలమ్మ కనుమ మూల మలుపు వద్ద బుధవారం వేకువజామున 4.30 గంటల సమయంలో కారు అదుపు తప్పింది.
రోడ్డు రెయిలింగ్‌ను ఢీకొని నాగులేరు వాగు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో లూథియారాణి(26) అక్కడికక్కడే మృతి చెందింది. భర్త శ్యాంసన్, డ్రైవింగ్ చేస్తున్న చిన్నిరామయ్య, గోళ్ళ జర్సీసాలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మృతురాలి కుమారులు ప్రవీణ్, నవీన్, సోదరుడు గంధం యల్లమంద, మరిది గోళ్లపాటి పౌలు గాయపడ్డారు. గాయపడిన వారిని 108లో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్యాంసన్ పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన వారికి ప్రాణాపాయం లేదని సమాచారం. ఎస్‌ఐ రమేష్‌బాబు సిబ్బంది తో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గురజాల తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
గంటన్నర పాటు మృత్యువుతో పోరాటం..
ప్రమాదం వేకువజామున 4.30 గంటలకు జరిగితే 6 గంటలకు 108 సిబ్బందికి సమాచారం అందింది. మంచు కమ్ముకుని ఉండటం, లోయ అంతా కంప చెట్లతో నిండి ఉండటంతో బయటకు రావడానికి దారి లేదు. దీంతో అటుగా వెళ్లే వారికి సైతం ప్రమాద విషయం తెలియలేదు. ఈ నేపథ్యంలో బాధితులు గంటన్నర పాటు అలాగే ఉండిపోయారు. తెల్లవారాక సమాచారం తెలిసి 108 సిబ్బంది, పోలీసుల సహకారంతో నిచ్చెన వేసుకుని కిందకు దిగి, బాధితులను ఆసుపత్రికి తరలించారు. లుథియారాణి కూడా అర గంటపాటు ప్రాణాలతోనే వుందని, సకాలంలో ఆసుపత్రికి చేరి ఉంటే బతికేదేమోనని బాధితులు తెలిపారు.