ఆర్టీసీ వరం...రాయితీ ప్రయాణం
విశాఖపట్నం: భద్రతకు, సురక్షిత ప్రయాణానికి మారుపేరుగా నిలుస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రయాణికులకు అనేక రాయితీలు కల్పిస్తోంది. కొన్ని సేవలను ఉచితంగా కూడా అందిస్తోంది. ప్రైవేటు రవాణా నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని, ప్రయాణికులకు దగ్గరయ్యేందుకు సంస్థ అనేక చర్యలు తీసుకుంటోంది. వీటితో ప్రయాణికులకు ఎక్కువ లబ్ధి చేకూరుతోంది. ఈ సంస్థ అందిస్తున్న సేవల వివరాలు..
బాలికలకు ఉచిత పాస్ : 18 సంవత్సరాలోపు బాలికలు పదో తరగతి వరకు చదువుకునేందుకు ఆర్టీసీ ఈ పాస్‌ను జారీ చేస్తోంది. ఆయా విద్యా సంస్థల నుంచి విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే పాస్‌లు జారీ చేస్తారు. 20 కిలోమీటర్ల వరకు ఈ కార్డుపై ఉచితంగా బాలికలు ప్రయాణించవచ్చు. అలాగే 12 ఏళ్లులోపు బాలురకు సైతం ఉచితంగా బస్‌పాస్ అందిస్తున్నారు.
సిల్వర్, గోల్డ్ కార్డు
గతంలో కొనసాగిన నెలవారీ సీజన్ టికెట్ స్థానంలో సిల్వర్ కార్డు, మూడు నెలల వెలిడిటీతో గోల్డ్‌కార్డును ఆర్టీసీ ప్రవేశపెట్టింది. పల్లె వెలుగు బస్సుల్లో 20 రోజుల చార్జీ చెల్లించి 30 రోజులపాటు ప్రయాణం చేయవచ్చు. ఈ కార్డులు కలిగిన వారు రూ.5 అదనంగా చెల్లించి ఎక్స్‌ప్రెస్‌లో, రూ.10 అదనంగా చెల్లించి డీలక్స్ బస్సుల్లో ప్రయాణం చేసే సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. ఈ కార్డులను 5 కి.మీ. స్లాబ్ నుంచి 75 కి.మీ. వరకు జారీ చేస్తారు.76 కి.మీ. నుంచి 100 కిమీ వరకు 80 కి.మీ. చార్జీని పరిగణనలోకి తీసుకుంటారు.
జనరల్ పాస్ : అన్ని వర్గాల ప్రజలు ప్రయాణించేందుకు వీలుగా ఆర్టీసీ జనరల్ బస్‌పాస్‌ను ప్రవేశపెట్టింది. నెలకు రూ.750 చెల్లించి జనరల్ బస్ టికెట్ పొందవచ్చు. దీని ద్వారా నగరంలో మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎన్నిసార్లయినా ప్రయాణించవచ్చు. వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులకు ఈ పాస్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
ఎన్జీవోస్ బస్‌పాస్ : చిరుద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లి వచ్చేందుకు ఈ పాస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రూ.14.860లోపు స్కేల్ కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ధ్రువీకరణ పత్రాలను సమర్పిస్తే ఎన్జీఓస్ జనరల్ బస్‌టికెట్ పొందవచ్చు. నెలకు రూ.235 చెల్లించి సిటీ బస్సుల్లో 20 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. మెట్రో, జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సుల్లో కూడా ఈ పాస్‌లను అనుమతిస్తారు.
వికలాంగుల బస్‌పాస్ :
అంగవైకల్యం కలిగిన వారికి చేయూతనందించేందుకు ఆర్టీసీ బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తోంది. వంద శాతం వైకల్యం కలిగిన వారికి పూర్తి రాయితీ అందిస్తున్నారు. వికలాంగుడితోపాటు సహాయకుడూ ఉచితంగా ప్రయాణించే వీలుం టుంది. వికలాంగత్వం తక్కువగా ఉంటే 50 శాతం రాయితీలపై ప్రయాణించే సౌకర్యం ఉంది.
విహారి కార్డు
జూబ్లీ హైటెక్ కార్డు, కపుల్ గిఫ్ట్ కార్డు స్థానంలో ఆర్టీసీ ఇటీవల విహారి కార్డును ప్రవేశపెట్టింది. ఈ కార్డు కొన్న వారు ఏసీ బస్సులు మినహా ఏ బస్సుల్లోనైనా, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా 50 శాతం రాయితీపై ప్రయాణించవచ్చు. రూ.550 చెల్లించి ఈ కార్డును పొందవచ్చు. ఇది ఏడు రోజులపాటు చెల్లుబాటు అవుతుంది. విహారి కార్డును రద్దు చేసుకునే అవకాశం సైతం ఉంటుంది. ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు కార్డు కొనుగోలు చేసిన చోటే రద్దు చేసుకుంటే కార్డు విలువలో 75 శాతం తిరిగి పొందవచ్చు.
రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి
ఆర్టీసీ బస్సులో తిరిగే ప్రయాణికులు సంస్థ కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకొని సురక్షతమైన ప్రయాణం చేయాలి. ప్రయాణికులే మా దేవుళ్లు. సంస్థ చేపట్టే ఈ పథకాలను విశాఖలో 63 శాతం వినియోగించుకుంటున్నారు. త్వరలో మరిన్ని రాయితీలు ప్రవేశపెట్టనున్నాం.
-పి. జీవన్‌ప్రసాద్,ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ డిప్యూటీ మేనేజర్ (రూరల్)
నవ్య క్యాట్ కార్డు
ఆర్టీసీలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్డు నవ్య క్యాట్ కార్డు. క్యాట్ కార్డు స్థానంలో ఆర్టీసీ నవ్య క్యాట్ కార్డును ప్రవేశపెట్టింది. ఈ కార్డు ద్వారా పది శాతం రాయితీతో ఏసీ బస్సులు మినహాయించి అన్ని బస్సుల్లో ప్రయాణించవచ్చు. రూ.250 చెల్లించి కార్డు తీసుకుంటే ఏడాదిపాటు చెల్లుబాటులో ఉంటుంది. సంవత్సరం తర్వాత రూ.150 చెల్లించి రెన్యూవల్ చేసుకోవచ్చు. రూ.వంద అదనంగా చెల్లించి నలుగురు కుటుంబ సభ్యులకు అనుబంధ కార్డు పొందవచ్చు. నూతన కార్డు తీసుకున్నవారికి రూ.1.75 లక్షలు, రెన్యూవల్ చేసుకున్న వారికి రూ.2లక్షలు ప్రమాద బీమా వర్తిస్తుంది. అదనపు కార్డుదారుడికి సైతం ఈ బీమా వర్తిస్తుంది.