రూ.2 కోట్లు స్వాహా
తాడేపల్లి రూరల్: సంతకాలు ఫోర్జరీ చేసి కార్మికుల సొమ్ము కాజేసిన ఘటన తాడేపల్లి పట్టణ పరిధిలో సీతానగరం పీడబ్ల్యూడీ వర్క్‌షాపులో ఆలస్యంగా వెలుగు చూసింది. వర్క్‌షాపు ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పాలకవర్గం రూ. 2 కోట్ల మేర స్వాహా చేసింది. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారం వారం రోజుల క్రితం బ్యాంకు అధికారులు రావడంతో రట్టయింది. సీతానగరం పీడబ్ల్యూడీ వర్క్‌షాపులో పని చేసే కార్మికులు తమ కుటుంబ అవసరాల కోసం గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా లోన్లు తీసుకుంటూ ఉంటా రు. కార్మికులు ఎవరూ అటు గుంటూరులో ఉన్న కేంద్ర కార్యాలయానికి గాని, ఇటు మంగళగిరిలో ఉన్న బ్రాంచి కార్యాలయానికి గాని లోన్ల కోసం వెళ్లరు.
తమకు కావలసిన లోన్ల కోసం సీతానగరం పీడబ్ల్యూడీ వర్క్‌షాపు ఆవరణలోనే ఉన్న ఎంప్లాయీస్ క్రెడిట్ సొసైటీ కార్యాలయంలో పనులు చక్కబెట్టుకుంటారు. సొసైటీ ప్రెసిడెంట్, గుమస్తా అప్లికేషన్ ఫారాలను బ్యాంకులో ఇచ్చి, రుణ మొత్తాలను తీసుకొచ్చి కార్మికులకు వర్కుషాపులోనే ఇస్తుంటారు. మొదట్లో తమకు రూ. 20 వేలు మాత్రమే బ్యాంకు లోన్లు మంజూరు చేసేవారని, తిరిగి వాటిని సక్రమంగా చెల్లించడంతో రూ. 50 నుంచి రూ. లక్షన్నర వరకు లోన్లు మంజూరు చేస్తున్నారని కార్మికులు చెబుతున్నారు. ఇందుకోసం సొసైటీకి రెండు శాతం కమీషన్ చెల్లిస్తున్నామని చెబుతున్నారు. తిరిగి బకాయిలు కూడా క్రెడిట సొసైటీ పాలకవర్గ ప్రతినిధులే బ్యాంకుకు చెల్లిస్తుంటారని పేర్కొన్నారు.
ఇలా నమ్మకంగా ఏడాది క్రితం వరకూ రుణాలు మంజూరు చేసి, చెల్లించేశారు. తిరిగి ఫోర్జరీ సంతకాలతో గత ఏడాది 80 మంది కార్మికులను ముంచేసి దాదాపు రెండు కోట్ల రూపాయలు కార్మికులకు తెలియకుండా కాజేసినట్టు తెలిసింది. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు వచ్చి కార్మికులను నిలదీయడంతో విషయం బయటకు వచ్చింది. పాలకవర్గం పదవీకాలం రద్దుకావడంతో రెండు కోట్ల రూపాయలు ఏ విధంగా కార్మికుల నుంచి రికవరీ చేయాలో అర్థం కాక బ్యాంకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తమ సంతకాలు ఫోర్జరీ చేసి రుణాలు అక్రమంగా పొందిన వైనంపై సోమవారం అధికారులకు ఫిర్యాదు చేస్తామని కార్మికులు చెబుతున్నారు.