మట్టి దొంగలు | Sand Mafia in Anantapur | Sakshi
Sakshi News home page

మట్టి దొంగలు

Published Sat, May 11 2019 11:48 AM | Last Updated on Sat, May 11 2019 11:48 AM

Sand Mafia in Anantapur - Sakshi

టిప్పర్‌లో మట్టిని తరలిస్తున్న దృశ్యం

అనంతపురం :కూడేరు మండలంలో మట్టి దొంగలు రెచ్చిపోతున్నారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్నవెంచర్లను అడ్డుపెట్టుకొని కొందరు టీడీపీ నాయకులు కాంట్రాక్టర్ల అవతారమొత్తి ప్రభుత్వ భూముల్లోని మట్టిని
తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అధికారులూ తమవాటాలను తీసుకోవడమే కాకుండా వారికి అన్ని విధాలా సహకరిస్తున్నారన్నవిమర్శలున్నాయి.

భారీగా వెంచర్లు
మండల పరిధిలోని గొటుకూరు, బ్రాహ్మణపల్లి, కమ్మూరు, అరవకూరు, కూడేరు వద్ద భారీగా వెంచర్లు వెలిశాయి.  వెంచర్లలోకి రోడ్లుకు, ఇతర పనులకు  ఎర్ర మట్టి అత్యవసరమవుతోంది. దీంతో ఎర్ర మట్టి కోసం కొందరు అక్రమార్కులు ప్రభుత్వానికి సంబంధించిన కొండలు, వంకలు, గుట్టలను ఎంపిక చేసుకొని ఎలాంటి అనుమతులు పొందకుండా  జేసీబీలు పెట్టి ట్రాక్టర్లతో  ఇష్టారాజ్యంగా  మట్టిని  తోడేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న వారు టీడీపీకి చెందిన వ్యక్తులు కావడంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ గ్రామాలకు నియమించిన ఓ అధికారి టీడీపీకి కొమ్ముకాయడంతో పాటు  ఎలాంటి ఆటంకాలు రాకుండా అన్నీ తానై చూసుకుంటున్నారని ప్రజలు చెబుతున్నారు. అక్రమ మట్టి తరలింపుపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే ఈ విషయాన్ని అక్రమార్కులకు చేరదీసి కొద్ది రోజులు మట్టి తరలింపుకు బ్రేక్‌ వేయించి తిరిగా యథేచ్చగా తరలించేలా చేస్తున్నాడని చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు మామూళ్ళ మత్తులో మునిగి తేలుతుండటతో మట్టి తరలింపునకు అడ్డు అదుపు లేకుండా పోయింది.  రోడ్డు పనులకు, ఇంటి ముందు  వేసుకునేందుకు , మొక్కల పెంపకానికి ఇలా అనేక రకాలుగా ఎర్ర మట్టిని ఉపయోగించుకుంటున్నారు. 

తమ్ముళ్లకే మట్టితరలింపు కాంట్రాక్ట్‌
కొత్తగా వెలసిన వెంచర్లే ఆ ప్రాంత, అనంతపురానికి చెందిన టీడీపీ నాయకులకు ఆదాయ వనరులుగా మారాయి. అధికార అండతో తామేమి చేసిన చెల్లుబాటు అవుతుందని ఎలాంటి అనుమతులు లేకుండానే ఆ ప్రాంతంలోని గుట్టలు, వంకల్లో వేలాది ట్రాక్టర్ల మట్టిని తరలించి ఆర్ధికంగా లాభపడుతున్నారు. మారుమూల ప్రాంతాల్లోని మట్టిని కాకుండా ఏకంగా అనంతపురం – బళ్ళారి ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూములైన కొండలు, వంకల్లోని మట్టిని తరలిస్తుండటం గమనార్హం. వెంచర్ల యాజమాన్యంతో మట్టి తరలింపునకు టీడీపీ నాయకులు కాంట్రాక్ట్‌ తీసుకొని జేబులను నింపుకుంటున్నారు. వారి అనుమాయులకు చెందిన ట్రాక్టర్లనే తిప్పుతూ వారి పనులకు అడ్డం లేకుండా చేసుకుంటున్నారు.

కొండనూ తోడేశారు
కూడేరులో జోడు లింగాల సంగమేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్న  ప్రభుత్వ భూమి సర్వేనంబర్‌ 535లోని కొండను టీడీపీ నాయకులు జేసీబీలు పెట్టి వందలాది ట్రాక్టర్లతో మట్టిని  ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. టీడీపీ నాయకులు వర్గాలుగా మారి వారికి అనుకూలమైన చోటకు మట్టిని తోలి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఎస్‌ఆర్‌సీ కంపెనీ ప్రతినిధులు రోడ్డు పనికి  వందలాది టిప్పర్ల మట్టిని అనుమతులు లేకుండా తోడేశారన్న విమర్శలున్నాయి. అక్రమంగా ఇంత పెద్ద ఎత్తున మట్టి తరలిస్తుంటే అధికారులకు కనబడదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మట్టి ఇప్పటికైన జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయంపై తహసీల్దార్‌ భాగ్యలతను వివరణ కోరేందుకు  ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.

పట్టించుకోని అధికారులు
రెవెన్యూ, పంచాయతీ అధికారులు, పోలీసులు మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను చూసుకుంటూ వెళ్తున్నారే తప్ప వీటికి అనుమతి ఉందా? లేదా? అని విచారించిన పాపాన పోవడం లేదు. అక్రమార్కుల నుంచి డబ్బులు వసూల్‌ చేసుకొని తమకేమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంత బహిరంగంగానే మట్టి దందా కొనసాగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement