చంద్రబాణం చెర్వు వద్ద ట్రాక్టర్‌ను అడ్డుకున్న రైతులు
పశ్చిమగోదావరి , భీమడోలు: మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలపై రైతులు కన్నెర్రజేశారు. మండలంలోని పోలసానిపల్లి రెవెన్యూ పరిధిలోని చంద్రబాణం చెర్వులోని ఎర్రకంకర, మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతుండడంతో ఆదివారం ఆయకట్టు రైతులు తవ్వకాలను అడ్డుకున్నారు. వారు తెలిపిన వివరాలు ఇలా, కొన్ని రోజులుగా చంద్రబాణం చెర్వులోని గ్రావెల్, మట్టిలను రెండు జేసీబీల సాయంతో ట్రాక్టర్లల్లో నింపి వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారుల నిఘా కొరవడిందని రైతులు చెప్పారు. ఎట్టకేలకు తవ్వకాలను అడ్డుకుని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలసానిపల్లి రెవెన్యూ పరిధిలోని 12.5 ఎకరాల చంద్రబాణం చెర్వుకు గండి పడింది.
అయితే ఆ గండిని పూడ్చి నీరు నిల్వ ఉంచినట్లయితే ఆయకట్టులోని పోలసానిపల్లి, ఆంజనేయనగరం, మత్తేవారిగూడెంకు చెందిన 30 ఎకరాల్లో రెండు పంటలకు నీరందుతుంది. దీనిపై కన్నేసిన నాయకులు ఆ గండిని పూడ్చకుండా ఆ చెర్వులోని మట్టి, గ్రావెల్‌ను తరలించేస్తున్నారు. రెండు జేసీబీలతో రాత్రి పగలు తేడా లేకుండా రోజుకు వందలాది ట్రాక్టర్లలో ఆ మట్టి, గ్రావెల్‌ను నింపి విక్రయించుకుని జేబులు నింపుకుంటుంన్నారని రైతులు ఆరోపించారు. పైగా ట్రాక్టర్ల వల్ల పొలాలకు వెళ్లే దారులు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పారు. తవ్వకాలను అడ్డుకుని సంబంధిత వీఆర్వో అహ్మద్‌కు సమాచారం అందించారు. వీఆర్వో ఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలు పూర్తిగా నిలిపి వేయించారు. అక్రమంగా తవ్వకాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొలాలకు వెళ్లే దారులు భారీ గోతులమయం కావడంతో ఆ గోతులను వీఆర్వో దగ్గరుండి పూడ్చి వేయించారు. అనంతరం ఖాళీ ట్రాక్టర్లను పంపించి వేశారు. దీంతో వివాదం çసద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment