ఉమ్మిడివారిపాలెంలో ఇసుక అక్రమ రవాణాకు వేసిన అనధికార ర్యాంపు, నల్లాకులవారిపాలెంలో వేసిన ఇసుక గుట్ట
సాక్షి, పెరవలి : ఇసుక అక్రమ రవాణా నిన్నమొన్నటి వరకు గుభనంగా చేసిన తెలుగు తమ్ముళ్లు, దళారీలు నేడు బరితెగించి అనధికారికంగా ర్యాంపు వేసి దర్జాగా ఇసుకను తరలిస్తున్నారు. అధికారం మనచేతుల్లోనే ఉంది.. అధికారులు మనవారే.. వారికి ఇచ్చేది ఇస్తాం.. మనల్ని ఎవరు అడ్డుకుంటారు.. అనే ధీమాతో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఈ టీడీపీ నాయకులకు అధికారులు అండ పుష్కలంగా ఉండటంతో వీరికి అడ్డేలేకుండా పోయింది.
ర్యాంపు వేసినా అధికారులు పట్టించుకోవటంలేదంటే వారికి ఏ స్థాయిలో మామూళ్లు ముడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మండలంలోని ఉమ్మిడివారిపాలెంలో జరుగుతున్న తంతు చూస్తే ఆశ్చర్యపోవలిసిందే. ఎటువంటి అనుమతులు లేకుండా గోదావరిలో ఇసుక ర్యాంపు వేసేశారు. ఇసుక ర్యాంపు నుంచి రాత్రివేళ ఇసుకను తరలించి గుట్టలుగా పోసి, పగలు అధికారుల ఎదుటే విక్రయిస్తున్నారు. ఇక్కడ ర్యాంపు ఏర్పాటు చేసేం దుకు వారు ముందుగానే అధికారులతో ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇందుకోసం నెలకు రెవెన్యూ, పోలీసు అధికారులకు రూ.50 వేలు ముట్టజెపుతున్నట్టు సమాచారం. ఈ ర్యాంపు నుంచి రోజూ రాత్రి వేళ 40 నుంచి 60 ట్రాక్టర్ల ఇసుక సేకరిస్తున్నారని తెలిసింది. గతంలో ఈ అక్రమ దందాను అడ్డుకోవటానికి పగలు పంచాయతీ కార్యదర్శులు, రాత్రి రెవెన్యూ సిబ్బందిని నియమించారు. ప్రస్తుతం అధికారుల పక్కనుండే ఇసుక తరలిపోతున్న వారు పట్టించుకోవటం లేదు. ఇసుక అక్రమ రవాణా కానూరు, కా>నూరుఅగ్రహారం, కాకరపర్రు, ఉమ్మిడివారిపాలెం గ్రామాల్లో జరుగుతోంది.
గతంలో గ్రామస్తులు వాహనాలను పట్టుకున్నా రెవెన్యూ అధికారులు వదిలివేయడంతో వారిపై ప్రజల్లో నమ్మకం పోయి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు ఇసుక అక్రమ రవాణా వాహనాలను పట్టుకున్న దాఖలాలు లేవు.
రాత్రి ఇసుక సేకరణ.. పగలు రవాణా
రాత్రి ఇసుకను సేకరించి కొన్ని చోట్ల గుట్టలుగా పోస్తున్నారు. దానిని పగలు ధైర్యంగా రవాణా చేస్తున్నారు. ఈ గ్రామంలోని అనధికార ర్యాంపు నుంచి రాత్రి 8 గంటల నుంచి వేకువజాము 4 గంటల వరకు యథేచ్ఛగా ఇసుక సేకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment