సర్పంచ్ ఇంటి ముట్టడి
గుంతకల్లు రూరల్ : ఊరంతా విద్యుత్ సరఫరా చేసినా.. తమ కాలనీకి మాత్రమే నిలిపివేయడంపై మండల పరిధిలోని పులగుట్టపల్లి ఎస్సీ కాలనీ వాసులు మండిపడ్డారు. అసలే వారంరోజులుగా విద్యుత్ సరఫరా లేక అంధకారంలో మగ్గుతుంటే.. విద్యుత్ పునరుద్ధరించిన తర్వాత కూడా కాలనీకి సరఫరా చేయకపోవడంపై ఆగ్రహావేశాలకు గురయ్యారు. అదే ఆవేశంతో బుధవారం రాత్రి గ్రామ సర్పంచ్ ఇంటిని ముట్టడించి ఆమెను ఇంట్లో నుంచి బయటికి వెళ్లనీయకుండా నిర్బంధించారు.
వివరాల్లోకెళితే.. గ్రామంలో వారం రోజుల క్రితం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి, దాదాపు 80 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బుధవారం విద్యుత్ శాఖ అధికారులు కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో వేరొకటి ఏర్పాటుచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అంతటితో ఆగని విద్యుత్ శాఖ ఏఈ షఫి గ్రామంలోని ఎస్సీకాలనీలో నివాసం ఉంటున ్న ప్రతి ఇంటి నుంచి రూ.5 వేలు చొప్పున చెల్లిస్తే తప్ప కాలనీకి విద్యుత్ సరఫరా ఇచ్చేదిలేదంటూ ఎస్సీ కాలనీకి మాత్రమే సరఫరా నిలిపివేశారు. దీంతో బుధవారం రాత్రి ఓ వైపు గ్రామం మొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోతుండగా, ఎస్సీకాలనీలో మాత్రం కటిక చీకటి ఆవహించింది.
అసలే ఊరి చివర ఉన్న ఎస్సీకాలనీలో నిత్యం పాముల బెడద ఎక్కువగా ఉండటం, దానికితోడు కాలనీలో చీకటి అలుముకోవడంతో దాదాపు 100 మంది దాకా కాలనీవాసుల కట్టలు తెంచుకొన్న ఆగ్రహంతో సర్పంచ్ ఇంటిపైకి ఎగబడ్డారు. తమ కాలనీకి కరెంటు సరఫరాను పునరుద్ధరించేవరకు సర్పంచ్‌ని ఇంటినుంచి బయటికి వెళ్లనివ్వబోమంటూ బుధవారం రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నిర్బంధించారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్‌ను ప్రశ్నించగా.. సమస్య పరిష్కరించాలని తాను విద్యుత్‌శాఖ ఏఈని పదేపదే కోరానని, ఆయన మాత్రం డబ్బు కట్టేదాకా కాలనీకి కరెంటు వదిలే ప్రసక్తేలేదని తెగేసి చెప్పాడని ఆమె బదులిచ్చారు.