విషాదం..
Published Mon, Feb 24 2014 1:21 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
తుళ్లూరు/ విద్యానగర్(గుంటూరు), న్యూస్‌లైన్ : గుంటూరు రూరల్ మండలం నల్లపాడు పంచాయతీ పరిధిలోగల కేంద్రీయ విద్యాలయంలో పెనుమూడి రాజేష్(17), బోరుగడ్డ సాగర్(17) ఇంటర్‌మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో వీరిద్దరూ మరో 15 మంది విద్యార్థులతో కలిసి ఆటోల్లో చౌడవరంలో తమ స్నేహితుడు షాలిన్ తండ్రి మార్క్ నిర్వహిస్తున్న చర్చిలో ప్రార్థనలకు వెళ్లారు. ఒంటి గంట సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో గ్రామ సమీపంలోని కొండను ఎక్కి కొంత సేపు ప్రకృతి అందాలను తిలకించారు. 3 గంటల ప్రాంతంలో దాసరిపాలెం వద్ద ఆటోలు నిలిపారు. అక్కడి క్వారీ గుంతల్లోని నీటిలో ఈతకు దిగాలనుకున్నారు. కొందరు వద్దని వారిస్తున్నా ఏడుగురు విద్యార్థులు ఈతకు దిగారు. వీరిలో లోతుకు వెళ్లిన రాజేష్, సాగర్ నీటిలో మునిపోతుండగా ఒడ్డున ఉన్న విద్యార్థులు కేకలు వేశారు.
వచ్చి రక్షించేలోగానే ఇద్దరూ నీట మునిగిన వారిని వెలికితీసి గుంటూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ధ్రువీకరించడంతో మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమతోపాటుగా ఆడుతూ పాడుతూ అప్పటి వరకూ ఉన్న స్నేహితులు మరణించటంతో తోటి విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. ఎంతో కష్ట పడి చదువుకునే విద్యార్థుల మృతివార్త విని పాఠశాల ప్రిన్సిపల్ ఎం.రాజేశ్వరరావు కన్నీరు పెట్టుకున్నారు. ప్రమాద విషయం విషయం తెలుసుకున్న రూరల్ డీఎస్పీ నరసింహ, సీఐ వై.శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి క్వారీ గుంతలు తవ్విన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నామన్నారు.
సంప్రదాయాలు మరిచిపోకూడదనే గుంటూరుకు..
రాజేష్ తల్లిదండ్రులు రమణ, బాలబూసీలకు ఒక్కగానొక్క కొడుకు. స్వస్థలం సత్తెనపల్లి మండలం యన్నాదేవి. బాలబూసి సీఆర్‌పీఎఫ్‌లో ఎస్‌ఐగా పని చేస్తున్నారు. విధుల నిమిత్తం 15 ఏళ్ళుగా డిల్లీ, లక్నో తదితర ప్రాంతాల్లో పనిచేశారు. కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తున్న బాలబూసీ తాను విధుల్లో భాగంగా ఇతర రాష్ట్రాల్లో పనిచేశానని, రాజేష్ చిన్న నాటి నుంచి ఇతర రాష్ట్రాల్లో పెరగటం వల్ల తెలుగు భాషను, సంప్రదాయాలు తెలియకుండా పోతాయనే ఉద్ధేశంతో నాలుగు నెలల క్రితం గుంటూరులోని ఏటీ అగ్రహారం 4వలైనుకు వచ్చామని తెలిపారు. సాగర్‌ది జిల్లాలోని మేడికొండూరు. తండ్రి రాజారత్నం డ్రైవర్. కూలీ పనులు చేసుకుంటూ తాము తినకున్నా కొడుకును చదివిస్తున్నారు. అతన్ని ఉన్నత స్థితిలో ఉంటే చూడాలని కలలు కన్న కొడుకు అర్ధంతరంగా లోకం వీడటంతో తండ్రి రాజారత్నం కన్నీరుమున్నీరు కావడం చూపరులను కదిలించింది.
విహారం కోసం వచ్చి... అమరేశ్వరుని దర్శించుకునేందుకు వచ్చిన యువ ఇంజినీర్ల బృందంలో నదిలో స్నానానికి దిగిన ఇద్దరు గల్లంతయ్యారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోగల నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్‌టీటీపీఎస్)లో విద్యుత్ ఏఈలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో వున్న వివిధ థర్మల్ పవర్ ప్లాంట్‌లకు చెందిన ఏఈలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారంతో శిక్షణా తరగతులు ముగిశాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ఏఈలు అమరావతి చూడాలని భావించారు. తొమ్మిదిమంది యువ ఇంజినీర్లు, ముగ్గురు మహిళా ఇంజినీర్లు కలసి మొత్తం 12 మంది కృష్ణా జిల్లా ఫెర్రి పడవల రేవు నుంచి ఓ మరపడవలో కృష్ణానది మీదుగా అమరావతికి వచ్చారు. అమరేశ్వరుని దర్శించుకుని పడవలోనే తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో సాయంత్రం సుమారు 5గంటల సమయంలో మండల పరిధిలోని వైకుంఠపురం ఇసుక తిన్నెల వద్ద సందీప్‌శ్యామ్‌సన్(26), పాండురంగారావు(25) అనే ఇద్దరు ఇంజినీర్లు స్నానానికి దిగారు. ఈ ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు వారిద్దరూ నీటమునిగి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారు.
పొలాల నుంచి వెళుతున్న స్థానికులు విషయం తెలుసుకుని వెంటనే అమరావతి సీఐకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అమరావతి, తుళ్ళూరు పోలీసులు, ఫైర్ సిబ్బంది గల్లంతయిన వారిని గాలించేందుకు హరిశ్చంద్రపురంలోని పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. ప్రత్యక్ష సాక్షులు చూపిన సంఘటనా స్థలంలో గజ ఈతగాళ్ళతో గాలింపు నిర్వహించారు. రాత్రి 10 గంటల వరకు కూడా ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయం 6 గంటలకు గాలింపు చర్యలు చేపడతామని తెలిపారు.కన్నీరు మున్నీరైన సహచర ఉద్యోగులు..రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఏఈగా పనిచేస్తున్న సందీప్ శ్యాంసన్, ఎన్‌టీటీపీఎస్‌లో ఏఈ అయిన పాండురంగారావు ఇద్దరికీ ఇంకా కూడా వివాహం కాలేదని తోటి ఉద్యోగులు తెలిపారు. కళ్లముందే నీట మునుగుతున్నా కాపాడలేకపోయామని, ఇంతటి ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయామని కన్నీటి పర్యంతమయ్యారు.
Advertisement