‘ఎర్ర’ వార్
- పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్‌కు యత్నం
- పోలీసులు రావడంతో ఎర్ర దొంగల రాళ్లదాడి
- ఆత్మరక్షణకోసం పోలీసుల కాల్పులు
- రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
- పోలీసుల అదుపులో 15 మంది కూలీలు
- 100 మందికి పైగా కూలీల పరార్
పోలీసులు.. ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల మధ్య సోమవారం తెల్లవారుజామున భీకరపోరు జరిగింది. చంద్రగిరి మండలం మామండూరు అటవీ ప్రాంతంలో సుమారు గంటన్నర పాటు ఎర్రకూలీలు పోలీసులపైకి రాళ్లదాడికి దిగారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. చివరకు 100 మందికి పైగా ఎర్రచందనం కూలీలు పరారయ్యారు. 15మంది మాత్రం పోలీసులకు చిక్కారు. రూ.3 కోట్ల విలువ చేసే 203 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చంద్రగిరి, న్యూస్‌లైన్: మామండూరు అటవీ ప్రాంతం లో కూలీలు పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో చంద్రగిరి పోలీసులతో పాటు తిరుపతి క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయుధాలతో సహా అక్కడకు చేరుకున్నారు. అప్పటికే కూలీలు సుమారు 70 ఎర్రచందనం దుంగలను టెన్‌టైర్ లారీలో లోడ్ చేశారు. అక్కడక్కడా పొద ల్లో దాచిన దుంగలను లోడ్ చేస్తున్న సమయంలో పోలీసులు రావడంతో ఎర్ర స్మగ్లర్లు అప్రమత్తమయ్యారు.
పోలీసుల పైకి ఎర్రచందనం కూలీలు రాళ్ల దాడికి దిగారు. పొదల్లో మాటు వేసి రాళ్లు, కర్రలు విసరడం మొదలు పెట్టారు. దీంతో వారిని అదుపులోకి తీసుకోవాలనుకున్న పోలీసుల ప్రయత్నం సాధ్యం అయ్యేలా కనిపించలేదు. ఎర్ర కూలీల దాడులు ఆగకపోవడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో కొంచెం దూరంగా పొదల్లో మాటువే సిన దుండగులు పారిపోయారు. అతి సమీపంలో ఉన్న 15 మంది ఎర్ర కూలీలు మాత్రం పోలీసులకు చిక్కారు.
అదుపులోకి తీసుకున్న దుండగులచేత వివిధ ప్రాంతాల్లో దాచిన దుంగలను కనుగొన్నారు. ఆ చుట్టుపక్కలా అటవీ ప్రాంతమంతా గాలించి మిగిలిన దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 203 దుంగలు పట్టుపడ్డాయి. అనంతరం లారీతో పాటు దుంగలు, 15 మంది ఎర్రచందనం కూలీలను చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
దుంగలు, వాహనాన్ని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న దుంగలు రూ.3 కోట్లకు పైగా చేస్తాయని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అదుపులోకి తీసుకున్న దుండగుల నుంచి ప్రధాన స్మగ్లర్ సమాచారం రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఆపరేషన్ కూంబింగ్‌లో క్రైం సీఐ మున్నార్ హుస్సేన్, ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి, చంద్రగిరి ఐడీ పార్టీ నాగరాజు, గంగాధరం, బాబు, క్రైం పోలీసులు మునిరాజ, సుధాకర్, శివయ్య, మునిరత్నం, గణేశ్వర్, శ్రావన్, వేణుగోపాల్, వరప్రసాద్ పాల్గొన్నారు.