the forest area
-
లారీ డ్రైవర్ సజీవ దహనం
చెట్టును లారీ ఢీకొనడంతో ప్రమాదం పెడిమికొండ అటవీ ప్రాంతంలో దుర్ఘటన నాతవరం : చెట్టును లారీ ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మండలంలోని గాంధీనగరం సమీపం పెడిమికొండ అటవీ ప్రాంతంలో నర్సీపట్నం నుంచి ఎర్రమట్టి లోడుతో తుని వైపు వెళ్తున్న లారీ రోడ్డు పక్కనున్న చెట్టును అదుపు తప్పి ఢీకొంది. శనివారం తెల్లవారు జాము 3.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు రావడంతో నర్సీపట్నానికి చెందిన పెదిరెడ్ల కన్నాపాత్రుడు (45) సజీవ దహనమయ్యాడు. లారీ యజమాని అయిన కన్నాపాత్రుడే వాహనాన్ని నడుపుతున్నాడు. ఆ సమయంలో లారీలో అతనుతప్ప మరెవరూ లేరు. చింతపల్లి మండలం డౌనూరు నుంచి శుక్రవారం సాయంత్రం మట్టి లోడు వేసుకొని రాత్రికి నర్సీపట్నంలో తన ఇంటివద్ద ఉండిపోయి శనివారం తెల్లవారుజామున బయల్దేరాడు. ఈలోడు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలో గల ఫ్యాక్టరీకి తరలించాల్సి ఉంది. ఈ లారీ క్లీనర్ ముందు రోజు సాయంత్రం తూర్పుగాదావరి జిల్లా బిళ్లనందూరులోని తన ఇంటికి వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సజీవ దహనమైన కన్నాపాత్రుడికి ఇద్దరు పిల్లలు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో తుని నుంచి నర్సీపట్నం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు నాతవరం ఎస్ఐ పి.రమేష్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన ఆయన చేరుకునే సరికి లారీ క్యాబిన్ నుంచి మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. వెంటనే నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే లారీ క్యాబిన్ పూర్తిగా కాలిపోయింది, అందులో ఉన్న కన్నాపాత్రుడు పూర్తిగా కాలిపోయి చివరకు కాళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఘటన చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రమాద స్థలానికి న ర్సీపట్నం రూరల్ సీఐ ఎ.దాశరథి చేరుకుని మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం న ర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. లారీలో ఉన్న ఎర్రమట్టి రోడ్డుపై పడిపోవడంతో తుని -నర్సీపట్నం వెళ్లే వాహనాల రాకపోకలు సూమారు రెండు గంటలు స్తంభించిపోయాయి. పోలీసులు ఆ మట్టిని పొక్లైనర్ సాయంతో తొలగించారు. -
‘ఎర్ర’ వార్
పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్‌కు యత్నం పోలీసులు రావడంతో ఎర్ర దొంగల రాళ్లదాడి ఆత్మరక్షణకోసం పోలీసుల కాల్పులు రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత పోలీసుల అదుపులో 15 మంది కూలీలు 100 మందికి పైగా కూలీల పరార్ పోలీసులు.. ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల మధ్య సోమవారం తెల్లవారుజామున భీకరపోరు జరిగింది. చంద్రగిరి మండలం మామండూరు అటవీ ప్రాంతంలో సుమారు గంటన్నర పాటు ఎర్రకూలీలు పోలీసులపైకి రాళ్లదాడికి దిగారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. చివరకు 100 మందికి పైగా ఎర్రచందనం కూలీలు పరారయ్యారు. 15మంది మాత్రం పోలీసులకు చిక్కారు. రూ.3 కోట్ల విలువ చేసే 203 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంద్రగిరి, న్యూస్‌లైన్: మామండూరు అటవీ ప్రాంతం లో కూలీలు పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో చంద్రగిరి పోలీసులతో పాటు తిరుపతి క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయుధాలతో సహా అక్కడకు చేరుకున్నారు. అప్పటికే కూలీలు సుమారు 70 ఎర్రచందనం దుంగలను టెన్‌టైర్ లారీలో లోడ్ చేశారు. అక్కడక్కడా పొద ల్లో దాచిన దుంగలను లోడ్ చేస్తున్న సమయంలో పోలీసులు రావడంతో ఎర్ర స్మగ్లర్లు అప్రమత్తమయ్యారు. పోలీసుల పైకి ఎర్రచందనం కూలీలు రాళ్ల దాడికి దిగారు. పొదల్లో మాటు వేసి రాళ్లు, కర్రలు విసరడం మొదలు పెట్టారు. దీంతో వారిని అదుపులోకి తీసుకోవాలనుకున్న పోలీసుల ప్రయత్నం సాధ్యం అయ్యేలా కనిపించలేదు. ఎర్ర కూలీల దాడులు ఆగకపోవడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో కొంచెం దూరంగా పొదల్లో మాటువే సిన దుండగులు పారిపోయారు. అతి సమీపంలో ఉన్న 15 మంది ఎర్ర కూలీలు మాత్రం పోలీసులకు చిక్కారు. అదుపులోకి తీసుకున్న దుండగులచేత వివిధ ప్రాంతాల్లో దాచిన దుంగలను కనుగొన్నారు. ఆ చుట్టుపక్కలా అటవీ ప్రాంతమంతా గాలించి మిగిలిన దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 203 దుంగలు పట్టుపడ్డాయి. అనంతరం లారీతో పాటు దుంగలు, 15 మంది ఎర్రచందనం కూలీలను చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దుంగలు, వాహనాన్ని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న దుంగలు రూ.3 కోట్లకు పైగా చేస్తాయని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అదుపులోకి తీసుకున్న దుండగుల నుంచి ప్రధాన స్మగ్లర్ సమాచారం రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఆపరేషన్ కూంబింగ్‌లో క్రైం సీఐ మున్నార్ హుస్సేన్, ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి, చంద్రగిరి ఐడీ పార్టీ నాగరాజు, గంగాధరం, బాబు, క్రైం పోలీసులు మునిరాజ, సుధాకర్, శివయ్య, మునిరత్నం, గణేశ్వర్, శ్రావన్, వేణుగోపాల్, వరప్రసాద్ పాల్గొన్నారు. -
అవును... ఆ ఊరొకటుంది!
ఎన్నికల సమయంలో.... ఓట్ల కోసం ఆ గ్రామానికి కాలినడకన నేతలు వెళతారు. గుక్కెడు నీటి కోసం అక్కడి కొండరెడ్లు పడుతున్న కష్టాలు కళ్లార చూస్తారు...జాలిపడతారు...సమస్యతీరుస్తామని హామీలు ఇస్తారు. ఎన్నికలు అయ్యాక... ఓడిపోయిన వారేకాదు... గెలిచిన వారికి కూడా ఆగ్రామం పట్టదు. ఓట్ల సమయంలో వారు ఇచ్చిన హామీలు గుర్తుకురావు. గత యాభైఏళ్లుగా ఇదే ఒరవడికి అలవాటుపడ్డ ఆగ్రామం వేలేరుపాడు మండలంలోని కాకిస్‌నూర్. కాకిస్‌నూర్...అటవీ ప్రాతంలో అత్యంత మారుమూలన ఉంది. ఎలాంటి రహదారి, విద్యుత్ సౌకర్యంలేని ఈ గ్రామానికి వెళ్లాలంటే గోదావరి మార్గంగుండా వెళ్లాల్సిందే. వేలేరుపాడు మండలం టేకుపల్లి దాటాక గోదావరి ఒడ్డునుంచి రెండు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తే పెద్దగుట్ట పై ఈ గ్రామం కనబడుతుంది.ఇక్కడ మొత్తం 120 కొండరెడ్ల కుటుంబాలున్నాయి. ఈ గ్రామం ఏర్పడి దాదాపు వందేళ్లు అవుతోంది. ఈ గ్రామస్తులు ఆది నుంచి తాగునీటి కోసం పడుతున్న పాట్లు వర్ణనాతీతం. గ్రామానికి చేరువలో ఉన్న పాపికొండల కాల్వ నీళ్లే వీరికి తాగునీరు. ఈ కాల్వ వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ సమయంలో ఈ నీరంతా ఎర్రని బురదలా ఉండటంతో తాగలేరు. వర్షం నీటిని మాత్రమే తాగునీరుగా వినియోగిస్తారు. అదె లా అంటే... ఓ పలుచటి గుడ్డను నాలుగువైపులా తాళ్లతో కట్టి మధ్యలో రాయి ఉంచుతారు. దాని కింద బిందెపెట్టి నీళ్లు పట్టుకుంటారు. ఆ నీటిని వర్షాకాలం సీజన్లో తాగుతారు. ఆ తర్వాత రోజుల్లో పాపికొండల కాల్వే వీరికి దిక్కు. అటవీ ప్రాంతంలో పెద్ద పెద్ద గుట్టల నడుమ ఆకులు అలమలు పడి పారే ఈ కాల్వ చెలమల్లో నీటిని తోడుకొని తాగుతున్నారు. చెలమల నుంచి నీళ్ల బిందెలతో మహిళలు గుట్ట పైకి ఎక్కుతూ పడరాని పాట్లు పడుతున్నారు. ఈ కలుషిత నీరు తాగడం వల్ల రోగాలబారిన పడుతున్నారు. ఈ గ్రామంలో కనీసం మంచినీటి చేతిపంపు వేయించేందుకు నేతలు ఎవరూ ప్రయత్నించిన దాఖలాలు కూడా లేవు. ఎప్పటిలాగానే ఈ ఎన్నికల్లో కూడా నాయకులు గ్రామం బాటపట్టారు...హామీల వర్షం కురిపిస్తున్నారు...ఎప్పటికైనా సమస్య తీరకపోతుందా అని కొండరెడ్లు ఆశపడుతున్నారు. -
కుంతల జలపాతం కనులకు విందు
దట్టమైన అడవులలో... సహ్యాద్రి పర్వత శ్రేణిలో... గోదావరికి ఉపనది అయిన కడెం నది పరీవాహక ప్రాంతంలో.. సహజసిద్ధంగా ఏర్పడింది కుంతల జలపాతం. మూడు దఫాలుగా దుమికే ఈ జలపాత సౌందర్యం ఎంతటిదో, దానికి సమాంతరం గా సాగుతున్న గుట్టల మధ్య లోయ సౌందర్యమూ అంతటిదే! రాష్ట్రంలో అతి పెద్దవైన జలపాతాలలో రెండవ స్థానం పొందిన కుంతల ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 60 కి.మీ దూరంలో ఉంది. దుష్యంతుడి భార్య శకుంతల పేరు మీదుగా ఈ జలపాతానికి కుంతల అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. ఈ జలపాతాన్నీ, ఇక్కడి పరిసరాలనూ చూసి మైమరచిపోయిన శకుంతల తరచూ ఈ జలపాతంలో స్నానం చేసేదని నమ్మిక. పరవశింపజేసే ప్రకృతి దాదాపు 45 మీటర్ల ఎత్తు నుంచి దుమికే జలపాతం హోరు వీనులకు విందు చేస్తుంటే, ఆ ప్రవాహపు ఒరవడి నేత్రానందం కలిగిస్తుంటుంది. అటవీ ప్రాంతం అయినందున ఇక్కడంతా గిరిజన సంస్కృతులు, వన్యప్రాణి కేంద్రాలతో అలరారుతుం టుంది. జలపాతం దగ్గర అంచులు చదునుగా, జారుడుగా ఉంటాయి. ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మికతను నింపుకున్న ఈ ప్రాంతంలో అయిదు చిన్నాపెద్ద జలపాతాలతో పాటు నీటి గుండాలూ ఉన్నాయి. ఈ గుండాల్లో ముఖ్యమైన గుండాన్ని స్థానికులు సోమన్న గుండంగా వ్యవహరిస్తారు. జలపాతం వద్ద ప్రకృతిసిద్ధమైన రాతిగుహల్లో శివలింగాలు ఉన్నాయి. అందువల్ల ప్రతి ఏటా శివరాత్రినాడు ఈ గుండాలను భక్తులు దర్శించుకొని పూజలు నిర్వహించడాన్ని సోమన్న జాతరగా వ్యవహరిస్తారు. ఇలా వెళ్లాలి... ఆంధ్రప్రదేశ్‌లో ఆదిలాబాద్ జిల్లా నుండి కుంతలకు 60 కి.మీ. 7వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మల్ నుండి ఆదిలాబాదు వెళ్లే మార్గంలో మండల కేంద్ర ం నేరేడిగొండకు 12 కి.మీ దూరం. నేరేడిగొండ నుంచి 10 కి.మీ దూరంలో పొచ్చెర, ఘన్పూర్ గ్రామపరిధిలో బుంగనాల, కొరటికల్ జలపాతాలు ప్రసిద్దం. నేరేడిగొండ నుంచి 15 కి.మీ దూరంలో సిరిచెల్మ మరో అందమైన ప్రాంతం. ఇక్కడి అడవిలో ఉన్న చెరువు మధ్యన హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు, శిల్పాలు, శాసనాలు అనేకం ఉన్నాయని ప్రతీతి. ప్రకృతి సౌందర్యానికి, చారిత్రక ప్రాధాన్యానికి ఈ ప్రాంతం నెలవు.