కుంతల జలపాతం కనులకు విందు | Falls occurred naturally Kuntala | Sakshi
Sakshi News home page

కుంతల జలపాతం కనులకు విందు

Published Thu, Apr 10 2014 11:10 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

కుంతల జలపాతం కనులకు విందు - Sakshi

కుంతల జలపాతం కనులకు విందు

దట్టమైన అడవులలో... సహ్యాద్రి పర్వత శ్రేణిలో... గోదావరికి ఉపనది అయిన కడెం నది పరీవాహక ప్రాంతంలో.. సహజసిద్ధంగా ఏర్పడింది కుంతల జలపాతం. మూడు దఫాలుగా దుమికే ఈ జలపాత సౌందర్యం ఎంతటిదో, దానికి సమాంతరం గా సాగుతున్న గుట్టల మధ్య లోయ సౌందర్యమూ అంతటిదే! రాష్ట్రంలో అతి పెద్దవైన జలపాతాలలో రెండవ  స్థానం పొందిన కుంతల ఆదిలాబాద్  జిల్లా కేంద్రానికి 60 కి.మీ దూరంలో ఉంది. దుష్యంతుడి భార్య శకుంతల పేరు మీదుగా ఈ జలపాతానికి కుంతల అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. ఈ జలపాతాన్నీ, ఇక్కడి పరిసరాలనూ చూసి మైమరచిపోయిన శకుంతల తరచూ ఈ జలపాతంలో స్నానం చేసేదని నమ్మిక.
 
పరవశింపజేసే ప్రకృతి

దాదాపు 45 మీటర్ల ఎత్తు నుంచి దుమికే జలపాతం హోరు వీనులకు విందు చేస్తుంటే, ఆ ప్రవాహపు ఒరవడి నేత్రానందం కలిగిస్తుంటుంది. అటవీ ప్రాంతం అయినందున ఇక్కడంతా గిరిజన సంస్కృతులు, వన్యప్రాణి కేంద్రాలతో అలరారుతుం టుంది. జలపాతం దగ్గర అంచులు చదునుగా, జారుడుగా ఉంటాయి. ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మికతను నింపుకున్న ఈ ప్రాంతంలో అయిదు చిన్నాపెద్ద జలపాతాలతో పాటు నీటి గుండాలూ ఉన్నాయి. ఈ గుండాల్లో ముఖ్యమైన గుండాన్ని స్థానికులు సోమన్న గుండంగా వ్యవహరిస్తారు. జలపాతం వద్ద ప్రకృతిసిద్ధమైన రాతిగుహల్లో శివలింగాలు ఉన్నాయి. అందువల్ల ప్రతి ఏటా శివరాత్రినాడు ఈ గుండాలను భక్తులు దర్శించుకొని పూజలు నిర్వహించడాన్ని సోమన్న జాతరగా వ్యవహరిస్తారు.
 
 ఇలా వెళ్లాలి...
 ఆంధ్రప్రదేశ్‌లో ఆదిలాబాద్ జిల్లా నుండి కుంతలకు 60 కి.మీ.
     
 7వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మల్ నుండి ఆదిలాబాదు వెళ్లే మార్గంలో మండల కేంద్ర ం నేరేడిగొండకు 12 కి.మీ దూరం.
     
 నేరేడిగొండ నుంచి 10 కి.మీ దూరంలో పొచ్చెర, ఘన్‌పూర్ గ్రామపరిధిలో బుంగనాల, కొరటికల్ జలపాతాలు ప్రసిద్దం.
     
నేరేడిగొండ నుంచి 15 కి.మీ దూరంలో సిరిచెల్మ మరో అందమైన ప్రాంతం. ఇక్కడి అడవిలో ఉన్న చెరువు మధ్యన హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు, శిల్పాలు, శాసనాలు అనేకం ఉన్నాయని ప్రతీతి. ప్రకృతి సౌందర్యానికి, చారిత్రక ప్రాధాన్యానికి ఈ ప్రాంతం నెలవు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement