ఎన్నికల సమయంలో....
ఓట్ల కోసం ఆ గ్రామానికి కాలినడకన నేతలు వెళతారు. గుక్కెడు నీటి కోసం అక్కడి కొండరెడ్లు పడుతున్న కష్టాలు కళ్లార చూస్తారు...జాలిపడతారు...సమస్యతీరుస్తామని హామీలు ఇస్తారు.
ఎన్నికలు అయ్యాక...
ఓడిపోయిన వారేకాదు... గెలిచిన వారికి కూడా ఆగ్రామం పట్టదు. ఓట్ల సమయంలో వారు ఇచ్చిన హామీలు గుర్తుకురావు. గత యాభైఏళ్లుగా ఇదే ఒరవడికి అలవాటుపడ్డ ఆగ్రామం వేలేరుపాడు మండలంలోని కాకిస్‌నూర్.
కాకిస్‌నూర్...అటవీ ప్రాతంలో అత్యంత మారుమూలన ఉంది. ఎలాంటి రహదారి, విద్యుత్ సౌకర్యంలేని ఈ గ్రామానికి వెళ్లాలంటే గోదావరి మార్గంగుండా వెళ్లాల్సిందే. వేలేరుపాడు మండలం టేకుపల్లి దాటాక గోదావరి ఒడ్డునుంచి రెండు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తే పెద్దగుట్ట పై ఈ గ్రామం కనబడుతుంది.ఇక్కడ మొత్తం 120 కొండరెడ్ల కుటుంబాలున్నాయి. ఈ గ్రామం ఏర్పడి దాదాపు వందేళ్లు అవుతోంది. ఈ గ్రామస్తులు ఆది నుంచి తాగునీటి కోసం పడుతున్న పాట్లు వర్ణనాతీతం. గ్రామానికి చేరువలో ఉన్న పాపికొండల కాల్వ నీళ్లే వీరికి తాగునీరు. ఈ కాల్వ వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ సమయంలో ఈ నీరంతా ఎర్రని బురదలా ఉండటంతో తాగలేరు. వర్షం నీటిని మాత్రమే తాగునీరుగా వినియోగిస్తారు. అదె లా అంటే... ఓ పలుచటి గుడ్డను నాలుగువైపులా తాళ్లతో కట్టి మధ్యలో రాయి ఉంచుతారు. దాని కింద బిందెపెట్టి నీళ్లు పట్టుకుంటారు. ఆ నీటిని వర్షాకాలం సీజన్‌లో తాగుతారు. ఆ తర్వాత రోజుల్లో పాపికొండల కాల్వే వీరికి దిక్కు. అటవీ ప్రాంతంలో పెద్ద పెద్ద గుట్టల నడుమ ఆకులు అలమలు పడి పారే ఈ కాల్వ చెలమల్లో నీటిని తోడుకొని తాగుతున్నారు. చెలమల నుంచి నీళ్ల బిందెలతో మహిళలు గుట్ట పైకి ఎక్కుతూ పడరాని పాట్లు పడుతున్నారు. ఈ కలుషిత నీరు తాగడం వల్ల రోగాలబారిన పడుతున్నారు. ఈ గ్రామంలో కనీసం మంచినీటి చేతిపంపు వేయించేందుకు నేతలు ఎవరూ ప్రయత్నించిన దాఖలాలు కూడా లేవు. ఎప్పటిలాగానే ఈ ఎన్నికల్లో కూడా నాయకులు గ్రామం బాటపట్టారు...హామీల వర్షం కురిపిస్తున్నారు...ఎప్పటికైనా సమస్య తీరకపోతుందా అని కొండరెడ్లు ఆశపడుతున్నారు.
అవును... ఆ ఊరొకటుంది!
Published Sat, Apr 19 2014 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM
Advertisement
Advertisement