దర్శి/టెక్కలి : ఒక పార్టీకి కేటాయించిన గుర్తును నిబంధనలకు విరుద్ధంగా స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తూ పలువురు రిట్నరింగ్ ఆఫీసర్లు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజాశాంతి పార్టీకి చెందిన హెలికాప్టర్ గుర్తు తమ పార్టీ గుర్తును పోలి ఉందంటూ ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుండగా రాష్ట్రంలో కొందరు అధికారులు మాత్రం ప్రజాశాంతి అభ్యర్థులులేని చోట్ల.. వారి నామినేషన్లు తిరస్కరణకు గురైన చోట స్వతంత్రులకు ఆ గుర్తును కేటాయించేస్తున్నారు. టీడీపీ నేతల ఆదేశాలకనుగుణంగా అధికారులు పనిచేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లా దర్శి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గాల్లో గురువారం ఇలాంటి ఘటనలే జరిగాయి. దర్శి నియోజకవర్గ ప్రజాశాంతి పార్టీకి చెందిన హెలికాప్టర్ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించారు. ఇలా ఎలా కేటాయిస్తారని గురువారం ఆర్వో కార్యాలయంలో అభ్యర్థులతో జరిగిన సమావేశంలో దర్శి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ ఆర్వో కృష్ణవేణిని నిలదీశారు. దీనికి ఆర్వో బదులిస్తూ.. 28న స్వతంత్ర అభ్యర్థి పరిటాల సురేష్ హెలికాప్టర్ గుర్తుకావాలని దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. దీనికి మద్దిశెట్టి స్పందిస్తూ.. 25తో దరఖాస్తుల గడువు ముగిసిందని.. 28న దరఖాస్తు తీసుకుని గుర్తును కేటాయించడం నిబంధనలకు విరుద్ధం కాదా అని నిలదీశారు. ఆర్వో మాత్రం అభ్యంతరం ఉంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలన్నారు.
టెక్కలిలోనూ ఇదే తంతు..
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోనూ ఒక స్వతంత్ర అభ్యర్థికి హెలికాప్టర్ గుర్తు కేటాయించారు. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే అధికారులు ఫ్యాన్‌ను పోలివున్న హెలికాప్టర్ గుర్తును కేటాయించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో గురువారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా టెక్కలి స్వతంత్ర అభ్యర్థి గెడ్డవలస రాముకు టెక్కలి రిటర్నింగ్ అధికారి ఎస్.భాస్కర్‌రెడ్డి హెలికాప్టర్ గుర్తు కేటాయించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్‌తోపాటు పార్టీ నేతలంతా అభ్యంతరం వ్యక్తంచేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
స్వతంత్రులకు హెలికాప్టర్ గుర్తులా!?
Published Fri, Mar 29 2019 3:18 AM | Last Updated on Fri, Mar 29 2019 3:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment