టీ నోట్ ఆమోదం సిగ్గుచేటు
Published Sat, Oct 5 2013 3:17 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
గుంటూరు రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర సమైక్యత కోసం సీమాంధ్రలో పోరాటాలు జరుతుంటే మరో వైపు తెలంగాణ నోట్‌ను ఆమోదించడం సిగ్గు చేటని సమైక్యాంధ్ర జేఎసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు సమీపంలోని బుడంపాడు వద్ద జాతీయ రహదారిపై విద్యార్థి జేఎసీ కోఆర్డినేటర్ మండూరి వెంకటరమణ, జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణల ఆధ్వరంలో టీనోట్‌కు నిరసనగా శుక్రవారం ఎన్‌ఎస్‌ల్ టెక్స్‌టైల్స్ కార్మికులతో కలసి రాస్తారోకో నిర్వహించారు. వీరికి మద్దతుగా పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్,సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఆచార్య శామ్యూల్ రాస్తారోకోలో పాల్గొని సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు.
నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్రం అగ్నిగండంలో మారి ప్రజలందరు రోడ్డుపైకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ విభజనతో రాష్ర్ట ప్రజలందరూ ఇబ్బందులకు గురి కావడం ఖాయమన్నారు. శామ్యూల్ మాట్లాడుతూ రాష్ర్ట విభజనకు పూనుకున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తుందనుకోవడం భ్రమేనన్నారు. వెంకటరమణ మాట్లాడుతూ సీమాంధ్రలో 63రోజులుగా ఉద్యమాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
తెలంగాణ నోట్ ఆమోదించినా ఉద్యమాన్ని ఆపేది లేదని, మరింత ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు. సాయికృష్ణ మాట్లాడుతూ అన్నదమ్ముల్లా ఉన్న తెలుగు ప్రజల మధ్య కాంగ్రెస్ పార్టీ చిచ్చు రేపిందని ఆరోపించారు. తెలంగాణ నోట్ ఇవ్వగానే సమైక్య ఉద్యమం నిలిచిపోతుందనుకోవడం అవివేకమన్నారు. రాస్తారోకోలో ఎన్‌ఎస్‌టెక్స్ టైల్స్ కార్మికులతోపాటు విద్యార్థి జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
Advertisement