సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన టీడీపీ నేడు జిల్లాలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గాలికొదిలేసి నాయకులు తలోదారి చూసుకుంటున్నారు. గ్రామ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలకు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు అందుబాటులో లేరు. అధికారం ఉన్నన్ని రోజులు అడ్డదిడ్డంగా సంపాదించుకున్న డబ్బుతో జిల్లాను విడిచి దూరంగా ఉంటూ.. తమ వ్యాపారాల్లో మునిగిపోతున్నారు. కొందరు ముఖ్య నాయకులు మాత్రం చుట్టపుచూపుగా వచ్చి మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించి వెళ్తున్నారు.
సాక్షి, తిరుపతి : తెలుగుదేశం పార్టీ అధినేత సొంత జిల్లా కావడంతో పార్టీని గాడిలో పెట్టకపోతే ఈ ప్రభావం రాష్ట్రంపై పడే అవకాశం ఉందని చంద్రబాబు ఆందోళన చెందినట్లు తెలిసింది. దీంతో జిల్లా అధ్యక్షుడిని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఐదునెలల క్రితం జరిగిన స్వార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే 13 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురువేసింది. మూడు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు చివరకు కుప్పంలో కూడా మొదటి రెండు రౌండ్ల లెక్కింపులో చంద్రబాబు కూడా వెనుకబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు జిల్లాకు ఎన్నో మంచి పనులు చేసే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. నమ్ముకున్న కార్యకర్తలు మంచి భవిష్యత్ ఇచ్చే అవకాశం ఉన్నా అవేమీ చెయ్యలేదు. నాయకులే అక్రమాలకు పాల్పడడం, ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టడంతో గత చరిత్రలో ఎన్నడూ ఇవ్వని విధంగా జనం తీర్పు ఇచ్చారు.
జిల్లా అధ్యక్షుడిపై ఫిర్యాదు
ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతో కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిని వెంటనే మార్చాలని లేదంటే ఉన్న కేడర్ కూడా దూరం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అధిష్టానం కూడా జిల్లా అధ్యక్షుడిని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అందులో భాగంగా మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, గౌనివారి శ్రీనివాసులు, మాజీ ఎంపీ శివప్రసాద్ అల్లుడు గుంతాటి వేణుగోపాల్, సత్యవేడు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన జేడీ రాజశేఖర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయ సమచారం. అయితే వీరిలో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి అధ్యక్ష పదవి చేపట్టేందుకు సుముఖంగా లేరని తెలిసింది. గౌనివారి శ్రీనివాసులు ఎమ్మెల్సీగా ఉన్నారు. అధ్యక్ష పదవిని కట్టబెట్టితే విమర్శలు వస్తాయని కొందరు అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది. మాజీ ఎంపీ శివప్రసాద్ ఇటీవలో అనారోగ్యంతో మరణించారు. ఆయన వారసుడిగా అల్లుడు వేణుగోపాల్‌ని తెరపైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ ఇక లేకపోవడంతో అల్లుడికి అధ్యక్ష పదవిని కట్టబెట్టి ఆ వర్గం వారి నుంచి సానుభూతిని సంపాదించుకోవచ్చు అని ముఖ్యనాయకులు సూచించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు.
శివప్రసాద్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన కార్యక్రమాలను అన్ని దగ్గరుండి చూసుకోవడంతో పాటు సినీ నిర్మాతగా కూడా వ్యవహరించిన అనుభవం ఉందని వివరించినట్లు తెలిసింది. జేడీ రాజశేఖర్ సత్యవేడు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసిన విషయం తెలిసిందే. ఆయనకు గత ఎన్నికల్లో చంద్రబాబు సతీమణి ఆశీర్వాదంతో సత్యవేడు అభ్యర్థిత్వం లభించినట్లు ప్రచారం జరిగింది. ఆమె ఆశీర్వాదంతోనే ఈ సారి జిల్లా అధ్యక్షునిగా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరిలో ఎవరికో ఒకరికి ఇస్తే ఎస్సీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవిని కట్టబెట్టారనే పేరు సంపాదించుకోవచ్చనే ఆలోచన పార్టీ సీనియర్ నాయకులు వ్యక్తం చేసినట్లు తెలిసింది.
వీరు కాకుండా మరి కొందరు జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు, ఆ విషయాన్ని నేరుగా అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే జిల్లా అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందనే విషయంపై నివేదిక తెప్పించుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలిసింది. త్వరలో చంద్రబాబు జిల్లా పర్యటన ఉండే అవకాశం ఉందని, ఆ సమయంలో అధ్యక్షుడు ఎవరనే విషయంపై నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
పిలిచినా పలుకని కేడర్
ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైనా టీడీపీ నాయకుల్లో మాత్రం ఎటువంటి మార్పు కనిపించలేదు. నమ్ముకున్న కేడర్ మంచి చెడులను పట్టించుకోకుండా కొందరు విజయవాడ, మరి కొందరు హైదరాబాద్, ఇంకొందరు బెంగుళూరు, చెన్నైలో ఉంటూ తమ వ్యాపారాల్లో మునిగిపోయారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఫోన్‌చేసినా స్పందించలేదు. ఐదు నెలలు గడుస్తున్నా.. కార్యకర్తలను తలుచున్న నాథుడే కరువయ్యారు. కేడర్ దిక్కులేని వారయ్యారు. దీంతో పార్టీ కోసం పనిచెయ్యడం మాని తమ పని తాము చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇటీవల టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలో పార్టీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఆ కార్యక్రమాలకు పట్టుమని 50 మంది కూడా హాజరైన దాఖలాలు లేవు.
చిత్తూరులో శనివారం జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులెవరూ రాలేదు. ద్వితీయ స్థాయి నాయకుల జాడ కూడా కనిపించలేదు. ఐదు నెలల పాటు కార్యకర్తలు ఏమయ్యారో అని పట్టించుకోని నాయకులు తమ ఉనికి కాపాడుకునేందుకు కార్యక్రమాలు చేపడితే పిలిచిన వెంటనే పరుగెత్తుకు వెళ్లాలా? అంటూ చిత్తూరులోనే ఉంటూ కార్యక్రమానికి హాజరవ్వని నాయకులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment