వైభవంగా తెప్పోత్సవాలు ప్రారంభం | tepposthavam started grandly | Sakshi
Sakshi News home page

వైభవంగా తెప్పోత్సవాలు ప్రారంభం

Published Sat, Dec 14 2013 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM

tepposthavam started grandly

 తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్:
 తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి తెప్పోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెప్పోత్సవాలను పురస్కరించుకుని ఆలయంతో పాటు స్వామివారి పుష్కరిణిని అరిటి, మామిడి తోరణాలు, పుష్పాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. పుష్కరిణిలో తెప్పను రంగు రంగుల విద్యుత్ దీపాలతో పాటు పుష్పాలతో అలంకరించారు.  మొదటి రోజు ఉదయం స్వామికి అభిషేకం నిర్వహించి పూజలు చేశారు. సాయంత్రం వినాయస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆస్థాన మండపానికి తీసుకొచ్చి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం కపిలతీర్థం పుష్కరిణిలోని తెప్పపైకి స్వామి అధిరోహించి విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
 
  పండితుల వేద మంత్రోచ్ఛారణ, మేళతాళాల నడుమ వినాయకస్వామి పుష్కరిణిలో ఐదు చుట్లు విహరించి భక్తులకు కనువిందు కలిగించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్, డెప్యూటీ ఈవో చంద్రశేఖర్‌పిళ్లై, ఆలయ సూపరింటెండెంట్ మునిసురేష్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసులు, సురేష్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా తెప్పోత్సవాలలో భాగంగా పుష్కరిణిలో శనివారం సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు సుబ్రమణ్యస్వామి తెప్పపై విహరించనున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement