బిల్లులకు కొర్రీలు
సాక్షి, కరీంనగర్ : మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపులకు అధికారులు కొర్రీలు పెడుతున్నారు. నిబంధనల పేరిట నెలల తరబడి లబ్ధిదారులను తిప్పించుకుంటున్నారు. జిల్లా అంతటా సుమారు నాలుగు వందల గ్రామాల్లో మరుగుదొడ్లకు చెందిన నిధులు నిలిచిపోయాయి. సుమారు పది వేల మంది లబ్ధిదారులకు ఇంకా డబ్బులు అందాల్సి ఉంది. నిర్మల్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. జిల్లాలో అధికారులు తమ లక్ష్యాలను పూర్తి చేసేందుకు లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చి మరీ పనులు పూర్తిచేయించారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ.9100 చెల్లిస్తుంది. ఈ డబ్బులు సరిపోక లబ్ధిదారులు సొంత డబ్బులు జత చేసి రూ.20వేల వరకు ఖర్చు చేసుకుని మరుగుదొడ్లు నిర్మించుకున్నారు.
నిర్మాణాలు పూర్తయ్యే వరకు వెంటబడిన అధికారులు ఆ తర్వాత లబ్ధిదారులను పట్టించుకోలేదు. సొంత డబ్బులు ఖర్చు చేసుకున్న వారు బిల్లుల కోసం మూడునాలుగు నెలలుగా పడిగాపులు కాస్తున్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలను ఉపాధిహామీతో కలపడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఉపాధిహామీ పథకం కింద చేపట్టే పనుల్లో మెటీరియల్ విలువ 40 శాతానికి మించరాదన్న నిబంధన ఉంది. మరుగుదొడ్లతోపాటు ఆయా గ్రామాల్లో అంతర్గత రోడ్లు, మురుగుకాల్వల లాంటి పనులు చేపట్టారు. ఇలాంటి గ్రామాల్లో మెటీరియల్ విలువ 40 శాతానికి మించడంతో ఆ గ్రామాల్లో చెల్లింపులు నిలిచి పోయాయని అధికారులు చెప్తున్నారు. ఈ కారణంగానే సుమారు నాలుగు వందల గ్రామాల్లో మరుగుదొడ్ల బిల్లులు చెల్లించకుండా నిలిపివేశారు. నిర్మల్ భారత్ అభియాన్ కింద జిల్లాలో 2,69,812 వ్యక్తిగత మరుగుదొడ్లను మంజూరు చేశారు. రూ.245.52 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులను ఉపాధిహామీతో అనుసంధానం చేశారు. ఒక్కో యూనిట్‌కు రూ.9100 చెల్లిస్తారు. ఇందులో రూ.4600 ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి చెల్లిస్తుండగా, మిగతా రూ.4500 ఉపాధిహామీ కింద ఇస్తున్నారు. పనులు పూర్తికాగానే రూ.4600 చొప్పున చెల్లింపులు జరుగుతున్నాయి.
లేబర్ కాంపోనెంటు కింద ఉపాధిహామీ ద్వారా జరగాల్సిన చెల్లింపులు మాత్రం ఆగిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లోనయితే మొ త్తం చెల్లింపులు జరగలేదు. జిల్లాలో ఇప్పటివరకు 58,572 యూనిట్ల నిర్మాణం పూర్తి కాగా, 10వేల యూనిట్లకు బిల్లులు అందలేదు. 24,029 మరుగుదొడ్లు ప్రగతిలో ఉన్నాయి. పూర్తయినవీ, ప్రగతిలో ఉన్నవాటికి కలిపి ఇప్పటివరకు రూ.46.16 కోట్లు ఖర్చు చేశారు. ఉపాధిహామీ జాబ్‌కార్డులున్న లబ్ధిదారులకు స్మార్ట్‌కార్డులు లేవన్న సాకుతో కూడా బిల్లులు నిలిపివేశారు.