మూడు దశాబ్దాలుగా ఉద్యమ బాట | The path of movement for three decades | Sakshi
Sakshi News home page

మూడు దశాబ్దాలుగా ఉద్యమ బాట

Published Thu, Jan 9 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

The path of movement for three decades

=నాంది పలికిన కడవెండి భూపోరాటం
 =సంచలనం సృష్టించిన జీవీకే ప్రసాద్ లొంగుబాటు
 =దండకారణ్యంలోనే చెల్లెలు

 
దేవరుప్పుల, న్యూస్‌లైన్: మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి గుముడవెల్లి వెంకటకృష్ణప్రసాద్ అలియాస్ గుడ్సా ఉసెండి లొంగుబాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయూంశమైంది. ఉసెండి లొంగుబాటుతో ఆయన స్వగ్రామమైన దేవరుప్పుల మండలం కడవెండి గ్రామం వార్తల్లోకి ఎక్కింది. మూడు దశాబ్దాల క్రితం స్వగ్రామంలో జరిగిన పడమటి తోట భూపోరాటాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. సుమారు 30 సంవత్సరాల క్రితం సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఓ భూస్వామికి చెందిన పడమటితోట(ఆరు ఎకరాలు)లో ఇళ్ల స్థలాల కోసం పోరాటం మొదలైంది.

అనంతరం ఆ పోరాటంలోకి సీపీఐ(ఎంఎల్)జనశక్తి ప్రవేశించి ప్రాబల్యం పెంచుకుంది. అరుుతే కొంత మంది విద్యార్థులు, యువకులు ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక అప్పట్లో న్యాయవాది విద్యనభ్యసిస్తున్న అదే గ్రామానికి చెందిన ఎర్రంరెడ్డి పురుషోత్తంరెడ్డిని ఆశ్రయించి భూపోరాటంపై చర్చించారు. తన మిత్రుడైన లింగాలఘనపురం మండలం చీటూరుకు చెందిన రవీందర్‌ను పురుషోత్తంరెడ్డి కలిశారు. రవీందర్‌కు అప్పటికే పీపుల్స్‌వార్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో వెంకటకృష్ణప్రసాద్‌తో పాటు మరికొంత మంది విద్యార్థులు, యువకులు ఆర్‌వైఎల్(రాడికల్ యూత్ లీగ్), ఆర్‌ఎస్‌యు(రాడికల్ స్టూడెంట్ యూనియన్)లో చేరారు.

ఎర్రంరెడ్డి పురుషోత్తంరెడ్డి అలియూస్ ఏపీ సారథ్యంలో వీరు పోరాటం చేసి గ్రామంలోని పడమటితోటను సాధించడంలో సఫలీకృతులయ్యారు. ఆ భూపోరాటంతో పాటు నాటి రైతాంగ సాయుధ ఫోరాట స్పూర్తితో ఇక్కడి నుంచి యువకులు నక్సల్ ఉద్యమంలో కీలక నేతలుగా ఎదిగారు. అందులో వెంకటకృష్ణప్రసాద్ అలియూస్ ఉసెండి ఒకరు. దశాబ్దాల కాలం పాటు అజ్ఞాత జీవితం గడిపిన క్రమంలో 1986లో ఎన్‌కౌంటర్‌లో పీపుల్స్‌వార్ జిల్లా కమిటీ సభ్యుడుగా పైండ్ల వెంకటరమణ అలియాస్ కొండన్న, 1999 డిసెంబర్‌లో కరీంనగర్ జిల్లా కొయ్యూరు ఎన్‌కౌంటర్‌లో పీపుల్స్‌వార్ రాష్ర్ట కార్యదర్శి ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి అలియాస్ మహేష్, అనంతరం నెక్కొండ ఎన్‌కౌంటర్‌లో పెద్ది శ్రీను అశువులు బాశారు.
 
కళారూపాలతో చైతన్యం

 పాటు, ఒగ్గు కథల ప్రదర్శనలతో ఉసెండి ప్రజలను చైతన్యం చేశారు. పీపుల్స్‌వార్‌లో ఆయన కళాకారుడిగా రాణించారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం మూడు దశాబ్దాలుగా ఆయన అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గుముడవెళ్లి వెంకటకృష్ణప్రసాద్ అలియాస్ ఉసెండికి స్వయాన చెల్లెలైన రేణుక అలియాస్ భాను దండకార ణ్య ఉద్యమంలో కొనసాగుతున్నారు. ఉసెండి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యూరు. తమ్ముడు హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ప్రసుత్తం ఉసెండి తల్లిదండ్రులు ఆయన సోదరుడి వద్ద ఉంటున్నారు. ఉద్యమంలో వచ్చిన మార్పులతో విభేదించడంతో పాటు అనారోగ్య కారణాలతో చత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోరుునట్టు సమాచారం. ఉసెండిని రాష్ట్ర పోలీసులు బుధవారం హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్టు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement