అమ్మా.. నేను పరీక్షకు వెళ్తున్నా ఆశీర్వదించమ్మా.. అంటూ తోటి పిల్లలందరూ అమ్మ ఆశీస్సులు తీసుకుని పరీక్షకు బయలుదేరుతుంటే.. ఆ అమ్మాయి మాత్రం కళ్లెదుట విగతజీవిగా ఉన్న అమ్మకు నమస్కరించి పుట్టెడు దుఃఖాన్ని.. కన్నీళ్లను దిగమింగి పరీక్ష కేంద్రానికి బయలు దేరింది.
దుఃఖాన్ని దిగమింగి...
ఆ బాలిక తండ్రి గురువారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్ష రాసేందుకు బయలుదేరాల్సిన ఆ విద్యార్థిని తండ్రి మరణంతో ఒక్కసారిగా కుంగిపోయింది. అయినా ఆ బాధను దిగమింగి పదో తరగతి పరీక్షకు హాజరైంది.
సాక్షి, కడప /ఎడ్యుకేషన్ : విద్యార్థుల టెన్షన్....తల్లిదండ్రుల హైరానా...అధికారుల హడావుడి మధ్య పదవ తరగతి పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఎలాంటి సమస్యలు, మాస్‌కాపీయింగ్‌కు ఛాన్స్ లేకుండా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. అయితే, అధికారులు అన్ని వసతులు కల్పించామని పేర్కొంటున్నా....అనేక చోట్ల విద్యార్థులు టేబుళ్లు లేక అవస్థలు ఎదుర్కొన్నారు. నేలపై కూర్చొని పరీక్షలు రాయాల్సిన దుర్గతి ప్రస్తుత తరుణంలో కూడా కనిపించింది.
పోరుమామిళ్లలో ఏకంగా మూడు పాఠశాలల్లో విద్యార్థులు కింద కూర్చొని పరీక్ష రాయడం కనిపించింది. అలాగే ప్రొద్దుటూరులోని ఎస్‌కే సీవీ, సీకే దిన్నెలోని జెడ్పీ హైస్కూలు, బద్వేలులోని హైస్కూలు, కమలాపురంలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన టేబుళ్లపై కూర్చొని విద్యార్థులు పరీక్షలు రాయలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.కడప నగరంలోని గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులను వరండాలో కూర్చోబెట్టి పరీక్షలను వ్రాయించారు. అలాగే అదే సెంటర్‌లో స్లాబ్‌కు పెచ్చులన్నీ ఉడిన గదిలో కూర్చోబెట్టి విద్యార్థుల చేత పరీక్షలను రాయించారు.
237 మంది విద్యార్థులు గైర్హాజరు
జిల్లాలో 35,729 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవగా, అందులో 35,492 మంది విద్యార్థులు హాజరయ్యారు. 237 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతున్న నేపథ్యంలో దాదాపు విద్యార్థులందరూ అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు కూడా తోడుగా కేంద్రాల వద్దకు వచ్చారు. జిల్లా వ్యాప్తంగా తొలిరోజు తెలుగు పేపర్-1 పరీక్షకు సంబంధించి ఎక్కడా ఒక్క విద్యార్థి కూడా డీబార్ కాలేదు.
కేంద్రాలను పరిశీలించిన ఆర్‌జేడీ, డీఈఓ
జిల్లాలోని ఖాజీపేట, దువ్వూరు, మైదుకూరు పాఠశాలల్లో జరుగుతున్న పరీక్షల తీరును ఆర్‌జేడీ రమణకుమార్ పరిశీలించారు. అలాగే కడపలోని గాంధీనగర్ మున్సిపల్ పాఠశాలతోపాటు మదరిండియా పాఠశాలలో జరుగుతున్న పరీక్షల తీరును డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి పర్యవేక్షించారు. అన్ని గదుల్లో తిరుగుతూ పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు.
కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
జిల్లాలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న 162 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ముందుగానే డీఈఓ, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రత్యేక పరిశీలకులు, స్క్వాడ్ బృందాలు కూడా పలు కేంద్రాలను తనిఖీ చేశాయి.
దుఃఖాన్ని దిగమింగి..
గోపవరం: గోపవరం మండలం నీరుబ్దుల్లాయపల్లె గ్రామానికి చెందిన మూప్పూరి వసంత రాచాయపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈమె తల్లి ఎస్. రామాపురం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్‌గా ఉన్న ముప్పూరి చిన్న వెంకటమ్మ బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందింది.
తండ్రి చిన్న నరసింహులు కూడా కూలిపనులకు వెళ్తాడు. గురువారం నుంచి వసంత కు పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అమ్మ చనిపోయిందనే బాధను తట్టుకుని ఎలా పరీక్ష రాయాలనుకున్న ఆ బాలికకు ‘అమ్మా.. అక్కలిద్దరికి చదువులేదు. కూలి పనులు చేసుకునే వాళ్లకిచ్చాం.. నీవు బాగా చదువుకోమ్మా.. ఎంతవరకైనా చదివిస్తాం.. అంటూ రోజూ అమ్మా..నాన్నలు చెప్పే మాటలు గుర్తుకొచ్చాయి. అంతే.. పుట్టెడు దుఃఖాన్ని పంటి బిగువున అదిమిపట్టి గురువారం జరిగిన పరీక్షకు హాజరైంది. పరీక్ష రాసి వసంత ఇంటికి చేరాక తల్లి అంత్యక్రియలు నిర్వహించారు.
తండ్రి మరణించిన బాధలో ..
జమ్మలమడుగు: తండ్రి మరణించినా మోరగుడి గ్రామానికి చెందిన వద్ది నాగలక్ష్మీ 10వతరగతి పరీక్షలకు హాజరైంది. గురువారం ఉదయం అనారోగ్యంతో నాగలక్ష్మీ తండ్రి సుబ్బరాయుడు మృతి చెందాడు. ఆ బాధను దిగమింగి పట్టణంలోని సెయింట్ మేరీస్ పరీక్షా కేంద్రంలో పదో తరగతి పరీక్షలను రాసింది.
సమస్యల పరీక్ష
Published Fri, Mar 27 2015 3:26 AM | Last Updated on Fri, Nov 9 2018 4:52 PM
Advertisement
Advertisement