సర్వదర్శనం భక్తులకూ లడ్డూ టికెట్లు
తిరుమల: తిరుమలేశుని దర్శనం కోసం వేచి ఉండే వైకుంఠం కంపార్ట్‌మెంట్లలో సర్వదర్శనం భక్తులకూ లడ్డూ టికెట్లు ఇచ్చే కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. రూ. 20కి రెండు సబ్సిడీ లడ్డూలు, రూ. 50కి మరో రెండు లడ్డూలకు ఈ నెల 13వ తేదీ నుంచి సర్వదర్శనం క్యూలో టికెట్లు ఇవ్వాలని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు మంగళవారం ఆదేశించారు. ప్రస్తుతం కాలిబాట భక్తులకు ఉచితంగా లడ్డూ టికెట్లు ఇస్త్తున్నారు. సబ్సిడీ ధరతో రూ. 20కి రెండు, రూ. 50కి మరో రెండు లడ్డూలు ఇస్తున్నారు. కాలిబాట భక్తుడికి ఉచిత లడ్డూతోపాటు మొత్తం 5 లడ్డూలు అందుతున్నాయి.
రూ. 300 టికెట్టుపై రెండు లడ్డూలు ఇస్తారు. దాంతోపాటు టికెట్టు రిజర్వు చేసుకునే సమయంలోనే అదనంగా రూ. 50 చెల్లిస్తే మరో రెండు లడ్డూ టికెట్లు పొందే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. ఇలా.. టీటీడీ కల్పించిన సదుపాయం ప్రకారం ఒక భక్తుడికి 4 లడ్డూలు అందుతున్నాయి. తాజాగా, ఇదే తరహాలో సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకూ కంపార్ట్‌మెంట్లలోనే లడ్డూలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.