కేశినేని నానితో మాట్లాడతా | to be speak with kesineni nani | Sakshi
Sakshi News home page

కేశినేని నానితో మాట్లాడతా

Published Tue, Dec 30 2014 4:33 AM | Last Updated on Tue, Aug 21 2018 6:02 PM

to be speak with kesineni nani

⇒ పోలీసు విధుల్లో ప్రజాప్రతినిధుల జోక్యం తప్పు కాదు
⇒ప్రజల భద్రత కోసమే పోలీసు చర్యలు
⇒విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి తుళ్లూరు
⇒విలేకరుల సమావేశంలో డీజీపీ జేవీ రాముడు

విజయవాడ సిటీ : విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌లో చేపట్టిన ఆపరేషన్ నైట్ డామినేషన్ కార్యక్రమంపై ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) చేసిన వ్యాఖ్యలపై ఆయనతో మాట్లాడతానని రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్ జేవీ రాముడు తెలిపారు. ఇందుకు దారితీసిన పరిస్థితులను ఎంపీతో కలిసి చర్చించనున్నట్లు చెప్పారు. కమిషనరేట్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో డీజీపీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆపరేషన్ నైట్ డామినేషన్‌పై కేశినేని చేసిన వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకురాగా.. పైవిధంగా వ్యాఖ్యానించారు. తమకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషాలు ఉండవని డీజీపీ పేర్కొన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. రాజధాని నగరంలో నేరగాళ్ల సంచారం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వాతావారణం కల్పించడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఇలాంటి సమయంలో గుర్తింపు కార్డులు చూపించడం తప్పనిసరని చెప్పారు.

ఈ విధానాన్ని ఇతర అంశాలతో ముడిపెట్టడం సరికాదన్నారు. నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఁఆపరేషన్ నైట్ డామినేషన్*పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేలోనే ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని తనిఖీలు చేయవచ్చని ఉందని తెలిపారు.
 
తుళ్లూరుపై ప్రతిపాదనలు ప్రభుత్వానికి...
రాజధాని ప్రతిపాదిత ప్రాంతమైన తుళ్లూరు సబ్ డివిజన్ విజయవాడ కమిషనరేట్ పరిధిలోనే ఉంటుందని డీజీపీ తెలిపారు. రాజధాని పట్టణం స్మార్ట్ సిటీగా రూపొందించాల్సి ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కమిషనరేట్ పరిధిలోకి ఆ ప్రాంతాన్ని తీసుకురావాల్సి ఉంటుందని చెప్పారు. ఏ ప్రాంతం ఏ కమిషనరేట్ పరిధిలో ఉండాలనేది మాత్రం ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్టు వివరించారు.
 
ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు...
పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వహించనప్పుడు పై అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఎవరికైనా ఉందని డీజీపీ చెప్పారు. కాబట్టి ప్రజాప్రతినిధులు ఫిర్యాదులు చేస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను ఉన్నతాధికారులకు చెప్పలేరని, తమకు నిత్యం అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తారని చెప్పారు.

అలాంటి సందర్భాల్లో పనిచేయని అధికారుల వ్యవహారాన్ని ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకొస్తారని, ఇది పోలీసు విధుల్లో జోక్యం చేసుకోవడం ఎంతమాత్రం కాదన్నారు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి సంబంధిత కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు తగిన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. విలేకరుల సమావేశంలో అదనపు డీజీపీలు ఎన్‌వీ సురేంద్రబాబు, అనూరాధ, వీఎస్ కౌముది, ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement