బాధితులకు ఆసరా ఏదీ?
నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం
⇒ రూ.కోట్ల నిధులున్నా ప్రయోజనం మాత్రం సున్నా...
⇒ జిల్లాలో 20 వేల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు
⇒ 11వ స్థానంలో జిల్లా
నెల్లూరు (వైద్యం): ఎయిడ్స్‌పై సమరం చేద్దాం.. మహమ్మారిని తరిమికొడదాం.. హెచ్‌ఐవీ రహిత సమాజాన్ని నిర్మిద్దాం.. బాధితులకు అండగా ఉంటాం... ఇవి పాల కులు నిత్యం చెబుతున్న మాటలు. ఏడాదిలో ఒకరోజు ఎయిడ్స్ నివారణ దినాన్ని జరిపి ఆ తర్వాత దానిని పట్టించుకోకపోవడం పాలకులు, అధికారులకు పరిపాటిగా మారింది. ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు కోట్లల్లో నిధులున్నా ప్రయోజనం శూన్యం. జిల్లాలో 20 వేల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారికి కనీస వైద్య సదుపాయాలు, సామాజిక భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. బాధితులకు కనీసం పెన్షన్‌కూడా సక్రమంగా అందించడం లేదంటే వీరిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది.
కోట్ల నిధులు స్వచ్ఛంద సంస్థల పరం
ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన, నివారణ చర్యలు చేపట్టేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. నిధులు నేరుగా ఆయా స్వచ్ఛంద సంస్థలకు చేరుతున్నాయి. నిధులు సక్రమంగా బాధితులకు ఉపయోగపడుతున్నాయా...పక్కదారి పడుతున్నాయా అన్న వాటిపై అధికారులు ఏమాత్రం దృష్టి సారించడం లేదు. జిల్లా లో ఎయిడ్స్ నియంత్రణకు 8 స్వచ్ఛంధ సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ సంస్థలకు ఏ టా 10 నుంచి 15 లక్షల వరకు ఏపీ ఎ యి డ్స్ నియంత్రణ మండలి నుంచి నిధులు మంజూరవుతాయి. సంస్థలు ప్రభుత్వాలకు కాకి లెక్కలు చూపుతూ అందినకాడికి నిధులను దిగమింగడం పరిపాటిగా మారింది.
నివారణకు కృషి
ఎయిడ్స్‌వ్యాధి నివారణకు కృషిచేస్తున్నామని ఎయిడ్‌స నియంత్రణాధికారి రమాదేవి తెలిపారు. బాధితులకు కౌన్సెలింగ్ ద్వారా చికిత్స అందిస్తున్నామన్నారు. హైరిస్క్ ప్రాంతాలపై దృష్టి సారించి అక్కడివారికి చైతన్యం కలిగిస్తున్నామని తెలిపారు.
20 సంవత్సరాలుగా ‘ఆదరణ’
బిట్రగుంట:ముంగమూరు కూడలిలోని హెచ్‌ఐవీ పాజిటివ్ ఆదరణ కేంద్రం వ్యాధిగ్రస్తుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఆసియా ఖండంలోనే మొట్టమొదటగా 1999లో ముంగమూరు కూడలిలో ఏర్పాైటె న ఈ కేంద్రం ద్వారా ఇప్పటి వరకూ సుమారు పదివేల మందికి పైగా బాధితులు సేవలు పొందుతున్నారు. జిల్లాతో పాటు ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల నుంచి హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యాధిగ్రస్తులు ఆదరణ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం 32 మంది ఆశ్రయం పొందుతుండగా వారిలో 22 మంది చిన్నారులే ఉండడం గమనార్హం. వీరితో పాటు నాలుగు వేల మందికిపైగా ఔట్‌పేషెంట్లు ప్రతి నెలా కౌన్సెలింగ్, మందులు పొందుతున్నారు.
ప్రాణం పోస్తున్న దాతలు
ఆదరణ కేంద్రం నిర్వహణకు, ఆశ్రయం పొందుతున్న వ్యాధిగ్రస్తులకు వివిధ ప్రాంతాలకు చెందిన దాతలే జీవం పోస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఒక్కపైసా నిధులు అందకపోయినా దాతలే అన్నీ తామై ఆదుకుంటున్నారు. ఉప్పు, పప్పు వంటి నిత్యావసర వస్తువుల నుంచి వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులు, మినరల్ వాటర్, బెడ్‌లు, పౌష్టికాహారం తదితర అవసరాలను ప్రతీనెలా దాతలే తీరుస్తున్నారు.
వన్నెతెచ్చిన అవార్డులు
ఆదరణ కేంద్రం సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2002లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా న్యూఢిల్లీలో ‘నేషనల్ సివిల్ సొసైటీ’ అవార్డును అందజేశారు. పదుల సార్లు కలెక్టర్లు, ఎస్పీ చేతుల మీదుగా రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవార్డులు అందజేశారు. కర్ణాటక ప్రభుత్వం కూడా ఆదరణ కేంద్రం సేవలు గుర్తించి 2013లో గవర్నర్ భరద్వాజ చేతుల మీదుగా ఆదరణ కేంద్రం నిర్వాహకులు సింహాద్రి రాావుకు గౌరవ డాక్టరేట్ బహుకరించింది. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అయితే ఆదరణ కేంద్రం అనుసరిస్తున్న విధివిధానాలనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసింది.
వ్యాధిగ్రస్తులను ఆదరిద్దాం: సింహాద్రి రావు, కేంద్రం నిర్వాహకుడు
హెచ్ ఐవీ పాజాటివ్ వ్యాధిగ్రస్తులను సమాజం ఆదరరించాలి. చక్కెర వ్యాధిలాగే ఇది కూడా ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే. ప్రస్తుతం వ్యాధిగ్రస్తులు అందరిలాగే సాధారణ జీవితం గడిపేందుకు అవసరమైన ఏఆర్‌టీ, ఆయుర్వేదం మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు కూడా బాధితులను అర్థం చేసుకోవాలి.