బదిలీ(ల)లు
‘పచ్చ'నోట్లకే సిఫార్సులు!
ఉద్యోగుల బదిలీల్లో తెలుగుతమ్ముళ్లు చక్రం తిప్పారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి గతంలో సిద్ధం చేసిన జాబితాలను సైతం సవరించి తమకు అనుకులమైన ఉద్యోగులను వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేయించారు. గతంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో సిఫారసు లేఖలు తీసుకువచ్చిన ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా స్థాయిలోని ఓ కీలక అధికారి సైతం.. ఆ తర్వాత టీడీపీ నాయకులు సూచించినవారిని బదిలీ చేశార న్న విమర్శ ఇప్పుడు ఉద్యోగవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
నెల్లూరు (పొగతోట)
జిల్లాలోని రెవెన్యూ, పౌర సరఫరాల శాఖల్లో శనివారం 41 మంది డిప్యూటీ తహశీల్దారులను బదిలీ చేశారు. పది మంది సీనియర్ సహాయకులకు డీటీలుగా పదోన్నతులు కల్పించారు. అయితే ఈ బదిలీల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
సిఫారసులకే పెద్దపీట
డీటీలకు సంబంధించి సెప్టెంబర్ 16న జాయింట్ కలెక్టర్ జి. రేఖారాణి తన చాంబర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో టీడీపీ నాయకుల సిఫారసు లేఖలు తీసుకొచ్చిన ఉద్యోగులపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్‌లో వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారని రెవెన్యూ అసోసియేషన్ నాయకులు జేసీకి కృతజ్ఞతలు కూడా తెలిపారు. అనంతరం జాబితా సిద్ధంచేశారు.
కానీ జన్మభూమి, హుదూద్ తుపాను కారణంగా బదిలీలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ నెల 20తో జన్మభూమి కార్యక్రమం పూర్తయింది. 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. కౌన్సెలింగ్‌లో ప్రాధాన్యత లభించనివారు కాస్త నేతలను ఆశ్రయించారు. ఇదే అదనుగా కొందరు పచ్చ చొక్కాల నాయకులు చక్రం తిప్పారు.
విమర్శలకు కారణాలివే!
గతంలో నిర్వహించిన బదిలీలలో టీజీపీలో డీటీగా పని చేస్తున్న రవిని సీఎస్‌డీటీగా నియమించారు. డక్కిలిలో డీటీగా పనిచేస్తున్న మస్తానయ్యను ఓజిలి డీటీగా నియమించారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో వారికి కేటాయించిన మండలాలను వేరే వారికి కేటాయించారు. ఇలాంటి మార్పులు అనేకం జరిగాయి. సీనియర్ సహాయకుల నుంచి డీటీలుగా పదోన్నతులు మాత్రమే వచ్చినా, పై స్థాయి నుంచి ఒత్తిడి చేయడంతో వారికి సీఎస్‌డీటీలుగా నియమించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులను మాత్రం బదిలీ చేయలేదు. కలెక్టరేట్‌లో ఒక కీలక అధికారి బదిలీల ప్రక్రియలో చక్రం తిప్పినట్లు సమాచారం. బదిలీల ప్రక్రియ పూర్తి అయినా, ఇప్పట్లో బదిలీలు చేయబోమని చెప్పిన అధికారులు శనివారం రాత్రి హడావుడిగా జాబితాను విడుదల చేశారు. ముడుపుల వ్యవహారమే దీనివెనుక మర్మమని కొందరు బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో సీనియర్ సహాయకులు, ఇతర ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. వాటినైనా పారదర్శకంగా నిర్వహించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
పారదర్శకంగానే బదిలీలు
డీటీలకు కౌన్సెలింగ్ నిర్వహించి గతంలో బదిలీల ప్రక్రియ పూర్తి చేసి జాబితా సిద్ధం చేశాం. ప్రస్తుతం 41 మంది డీటీలను బదిలీ చేశాం. గతంలో సిద్ధం చేసిన జాబితాలో కొద్ది మార్పులు చేశాం. సిఫారసులను అనుమతించ లేదు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేస్తాం.
-జి. రేఖారాణి, జాయింట్ కలెక్టర్