ఈ భోజనం.. తినలేం | Triple IT mess In the inferior food | Sakshi
Sakshi News home page

ఈ భోజనం.. తినలేం

Published Mon, Jan 26 2015 5:03 AM | Last Updated on Fri, Oct 5 2018 6:36 PM

ఈ భోజనం.. తినలేం - Sakshi

ఈ భోజనం.. తినలేం

ట్రిపుల్ ఐటీ మెస్‌లో నాసిరకం ఆహారం
వడ్డనలో గంటలతరబడి జాప్యం
తరగతులను కోల్పోతున్న విద్యార్థులు
అధ్వానంగా మార్వెల్ మెస్ నిర్వహణ
కొరవడిన పర్యవేక్షణ
ఎమ్మెల్యే పరిశీలనతో వెలుగులోకి

నూజివీడు : ఉడికీ ఉడకని అన్నం.. రుచిలేని కూరలు.. నీళ్ల సాంబారు.. నలగని చపాతీలు.. సరిగా కడగని ప్లేట్లు.. నీళ్లలా పెరుగు.. ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు గత నాలుగు రోజులుగా తింటున్న ఆహార పదార్థాలు ఇవి. ఆదివారం ట్రిపుల్‌ఐటీని సందర్శించిన ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ బసవా రేవతి వద్ద విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకోగా వెలుగులోకి వచ్చిన విషయాలు.

ఇంత దారుణంగా పెడుతున్నా మెస్ సూపర్‌వైజర్ గాని, ట్రిపుల్‌ఐటీ అధికారులు గాని ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ట్రిపుల్‌ఐటీలో గతంలో వెయ్యిమందికి భోజనం తయారుచేసి పెడుతున్న మార్వెల్ మెస్‌కు మరో మూడువేల మంది విద్యార్థులను అప్పగించడం వల్ల నిర్వహణ సరిగా ఉండటం లేదని, దీనివల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. నాలుగు వేల మందికి ఒకేసారి భోజనం పెట్టాలంటే మధ్యాహ్నం 12 గంటలకు మొదలు పెడితే రెండు గంటలు దాటుతోందని వివరించారు. దీంతో చాలా మంది తరగతులకు కూడా వెళ్లలేకపోతున్నామని వాపోయారు.
 
సామర్థ్యం 2 వేలు.. కాంట్రాక్టు 4 వేలు
మార్వెల్ సంస్థ నూజివీడు ట్రిపుల్‌ఐటీలో నాలుగువేల మందికి భోజనం అందించేందుకు కాంట్రాక్టును సొంతం చేసుకుంది. రెండువేల మంది సామర్థ్యం కలిగిన మెస్‌లో నాలుగువేల మందికి భోజనం పెడుతుండటం వల్లే విద్యార్థులందరికీ సకాలంలో అందించడం లేదని తెలుస్తోంది. దీంతో విద్యార్థులు తరగతులకు దూరమవ్వాల్సి వస్తోంది.
 
నాసిరకంగా ఆహార పదార్థాలు...
తమకు భోజనంలో వడ్డిస్తున్న ఆహార పదార్థాలు కూడా నాసిరకంగా ఉంటున్నాయని విద్యార్థులు ఎమ్మెల్యే ప్రతాప్, చైర్‌పర్సన్ రేవతి ఎదుట వివరించారు. సరిగా కడగని ప్లేట్లు, ఉడగని అన్నం, నాసిరకం కూరలు, నీళ్లను తలపిస్తున్న సాంబారు, పెరుగు.. అన్నీ నాసిరకంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నివేల మందికి ఒకేచోట వడ్డిస్తుండటంతో గంటల తరబడి లైన్‌లో నిలుచుని ఉండాల్సి వస్తోందని తెలిపారు.

దీనివల్ల తరగతులకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని, ఆలస్యం వెళ్లినందుకు ఫైన్‌లు కట్టాల్సి వస్తోందని వాపోయారు. మెస్ నిర్వాహకులు పనివారిని సరిపడా ఏర్పాటు చేయకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. సెలవులకు ముందు మెస్ నిర్వహణ బాగానే ఉందని, సంక్రాంతి సెలవుల తరువాతే అధ్వానంగా తయారైందని వివరించారు.
 
జీవితాలతో ఆడుకుంటే ఎలా : ఎమ్మెల్యే ప్రతాప్
విద్యార్థుల ఇబ్బందులపై ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు స్పందిస్తూ.. మెస్ నిర్వహణ ఎందుకు సరిగా చేయడం లేదని డెరైక్టర్ హనుమంతరావును ప్రశ్నించారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటే ఎలా అని నిలదీశారు. ట్రిపుల్ ఐటీని నూజివీడుకు తీసుకొచ్చింది తానేనని, ప్రతి చిన్నదానికీ జోక్యం చేసుకోవడం ఎందుకులే అని ఊరుకుంటున్నానని తెలిపారు. లోపల నిర్వహణ ఇంత దారుణంగా ఉందని ఇప్పుడే తెలిసిందని చెప్పారు.

గత ఆరేళ్లుగా లేని సమస్యలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. దీనికి డెరైక్టర్ హనుమంతరావు స్పందిస్తూ మార్వెల్ మెస్ నిర్వాహకుడికి ఇంకొక మెస్‌ను కూడా ఇవ్వడానికి సిద్ధం చేశామని, రేపటి నుంచి రెండుచోట్ల రెండు వేల మందికి చొప్పున భోజనం అందించడం జరుగుతుందని వివరించారు. నాణ్యమైన భోజనం వడ్డించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మూడు సంవత్సరాలుగా యూనిఫాం ఇవ్వడం లేదని, పీయూసీ-1లో ఇచ్చిన యూనిఫాంనే ఈ-1కు వచ్చినా వేసుకోవాల్సి వస్తోందని విద్యార్థినీ విద్యార్థులు ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

ఆలస్యంగా తరగతులకు వెళితే ఫైన్‌లు వేస్తున్నారని, వాటి రూపంలో వచ్చిన లక్షలాది రూపాయలు ఏం చేస్తున్నారో అంతుబట్టడం లేదని విద్యార్థులు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ వైస్‌చాన్సలర్, చాన్సలర్‌ల దృష్టికి తీసుకెళతానని స్పష్టం చేశారు. దీంతో పాటు అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తానని విద్యార్థులకు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు బసవా భాస్కరరావు ఉన్నారు.
 
వద్దన్న సంస్థకే కాంట్రాక్టు ఇచ్చారు
మార్వెల్ సంస్థ గత ఏడాది బాసర ట్రిపుల్‌ఐటీలో మెస్ కాంట్రాక్టు నిర్వహించింది.
 గత ఏడాది ఏప్రిల్ 23న అప్పటి ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్య కమిషనర్‌గా ఉన్న అజయ్‌జైన్ బాసర ట్రిపుల్‌ఐటీకి వెళ్లిన సందర్భంలో మార్వెల్ సంస్థ నిర్వహిస్తున్న మెస్‌ను పరిశీలించారు. ఆ తరువాత అప్పటి వైస్ చాన్సలర్ ఆర్‌వీ రాజ్‌కుమార్‌కు దీనిపై నివేదిక ఇచ్చారు. అందులో ‘మార్వెల్ మెస్ నిర్వహణ అధ్వానంగా ఉంది. ఆహార పదార్థాల నాణ్యత ఏమాత్రం బాగోలేదు.

ఇలాంటి అపరిశుభ్రంగా, అధ్వానంగా ఉన్న మెస్‌ను ఎక్కడా చూడలేదు. ఆహార పదార్థాల నాణ్యత ఏమాత్రం బాగోలేదు. విద్యార్థుల నుంచి అనేక ఫిర్యాదులు ఉన్నందున మార్వెల్ సంస్థ కాంట్రాక్టును వెంటనే రద్దుచేసి పీనల్ యాక్షన్ తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. కానీ దీనిని ఏమాత్రం పట్టించుకోకుండా వీసీ రాజ్‌కుమార్ మళ్లీ తన హయాంలోని నూజివీడు ట్రిపుల్‌ఐటీలో మూడువేల మందికి సంబంధించిన భోజనం కాంట్రాక్టును నెలరోజుల క్రితం అప్పగించడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement