సముద్రంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు | Two students died in sea | Sakshi
Sakshi News home page

సముద్రంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు

Published Thu, Jun 5 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM

Two students died in sea

బాపట్ల రూరల్, న్యూస్‌లైన్ : వేసవి తాపం తీర్చుకునేందుకు గురువారం ఉదయం సముద్రంలోకి దిగిన ఇద్దరు విద్యార్థులను ఓ పెద్ద అల అమాంతం కబళించింది. చుట్టం చూపు కోసం వచ్చి చివరి చూపునకు కూడా నోచుకోకపోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి..  కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి పంచాయతీ దుర్గాపురం కాలనీకి చెందిన అసిలేటి రత్నాకర్ కుమారుడైన దినేష్(14) గన్నవరం వీఎస్ సెయింట్‌జాన్స్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. బాపట్ల మండలం దాన్వాయిపేటలోని బంధువు, పాస్టర్ రాజేష్ ఇంటికి తన బాబాయి రమేష్ కుటుంబసభ్యులతో కలసి బుధవారం వెళ్లాడు. తనతో పాటు తన స్నేహితుడైన అదే ప్రాంతానికి ఇంటర్మీడియెట్ విద్యార్థి వీర్ల నాగరాజు (16)ను కూడా తీసుకెళ్లాడు. దాన్వాయిపేటలోని సముద్రతీరానికి బంధువులతో కలసి గురువారం ఉదయం స్నానమాచరించడానికి వెళ్లారు.
 
 కేరిం తలు కొడుతూ ఆనందంగా స్నానం చేస్తున్న సమయంలో పెద్ద అల తాకిడికి దినేష్, నాగరాజు లు సముద్రంలో గల్లంతయ్యారు. పెద్దగా కేకలు వేయడంతో పక్కనే స్నానంచేస్తున్న దినేష్ బాబా యి రమేష్ గమనించి ఇద్దరిని రక్షించేందుకు యత్నించాడు. రెండు చేతులతో వారిని పట్టుకున్నప్పటికీ ఆలల ఉధృతికి రమేష్ యత్నం విఫల మైంది. వెంటనే తీర ప్రాంతంలోని మత్స్యకారులకు సమాచారం చెప్పడంతో మత్స్యకారులతోపాటు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం సమాచారం  తెలుసుకున్న దినేష్, నాగరాజు కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన బాపట్ల బయలుదేరి వెళ్లారు.
 
 ఒక్కగానొక్క కుమారుడ్ని కోల్పోయాం..
 సముద్రంలో గల్లంతైన దినేష్‌కు ఒక సోదరి ఉంది. ఒక్కడే కుమారుడు కావడంతో తల్లిదండ్రులు రత్నాకర్, రామాబాయ్‌లు అల్లారుముద్దుగా పెంచుతున్నారు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తునప్పటికీ కుమారుడిని బాగా చదివిస్తే తమ ఆశలు నెరవేరతాయనుకున్నానని తండ్రి రత్నాకర్ ఆవేదన వ్యక్తంచేశాడు. వేసవి కారణంగా సముద్ర స్నానానికి వెళ్లి వస్తామని చెబితే పంపించామని.. ఇప్పుడు మీ అమ్మకు నీ గురించి ఏమీ చెప్పాలంటూ ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు.
 
 చెట్టంత కొడుకును సముద్రం పాలు చేశా...
 కూలినాలి చేసుకుని కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులమిద్దరం కష్టపడుతున్నాం...చెట్టంత కొడుకును సముద్రంపాలు చేశానంటూ నాగరాజు తండ్రి తిరుపతయ్య విలపించాడు. తిరుపతయ్య, నాగేశ్వరమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. నాగరాజు రెండో కుమారుడు. స్నేహితుడు సముద్రస్నానానికి వెళుతున్నారంటే పంపానంటూ తిరుపతయ్య దీనంగా సముద్రం వైపు చూస్తూ నిటూర్పుగా నిలబడిపోయాడు.
 
 ముమ్మరంగా గాలింపు చర్యలు..
 సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతుకావడంతో పోలీసులు, మత్స్యకారులు సముద్రంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అడవిపల్లిపాలెం వద్ద సముద్రంలో మునిగిపోతే గత అనుభవాలను దృష్ట్యా చీరాల వైపు ఒక బృందం, సూర్యలంక వైపు మరో బృందం వెళ్లి గాలింపు చర్యలను చేపట్టింది. గాలింపునకు మేకనైజ్డ్ బోట్లు, వలలు ఉపయోగించారు. గల్లంతైన ఇద్దరిలో దినేష్ మృతదేహం లభ్యమైంది. నాగరాజు కోసం గాలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement