పండని జీవితం.
కలిసిరాని తమలపాకుల పంట
ఏటేటా తగ్గుతున్నసాగు విస్తీర్ణం
హుద్‌హుద్‌తో తీరని కష్టం
రూ.15కోట్లకు పైగా రైతులకు నష్టం
తమలపాకు రైతు బతుకు పండలేదు. హుద్‌హుద్ కక్కిన విషంతో జీవనం ఆర్థికంగా దుర్భరమైంది. పెట్టుబడి వాయువేగానికి కొట్టుకుపోయింది. అంది వచ్చిన పంటతో అప్పులు తీర్చేద్దామని ఆశించిన రైతు చేతికి చిల్లిగవ్వ దక్కని దుస్థితి. జిల్లాలో ఏ తమలపాకు రైతును కదిపినా కన్నీటి వెతలే. మారిన బతుకు చిత్రం చూస్తే కడుపు తరుక్కుపోతుంది.
విశాఖపట్నం : హైదరాబాద్‌తో పాటు బెంగుళూరు, పూనే, చెన్నై ప్రాంతాలకు నిత్యం జరిగే తమలపాకుల ఎగుమతులు నిలిచిపోయాయి. విశాఖ జిల్లా పాయకరావుపేట కేంద్రంగా రోజూ ఐదు నుంచి పది లారీల తమలపాకులు ఎగుమతయ్యేవి. ప్రస్తుతం ఒక్క లారీకూడా ఎగుమతయ్యే పరిస్థితి లేకుండా పోయింది. కోస్తాలోని విశాఖజిల్లాలో 1750ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 350 ఎకరాల్లో తమలపాకు (దేశవాళీ రకం) సాగవుతోంది. నీలం తుఫాన్ దెబ్బకు 2012లో రెండు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా హుద్‌హుద్ ధాటికి విశాఖ జిల్లాలో 1350 ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. మిగిలి ఎకరాల్లో కూడా పంట నాసిరకంగా మారడంతో పెట్టుబడి కూడా రాని దుస్థితి. ఈ తుఫాన్‌తో పాటు గోదావరికి పోటెత్తిన వరదల కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో సగం పంట ధ్వంసమైంది. దీంతో దిగుబడులు ఊహించని రీతిలో పడిపోయాయి. ఎకరాకు లక్షన్నర వరకు ఖర్చు చేస్తుండగా.. 30 వేలనుంచి 40వేల పంతాలు(మోదులు) (పంతాకు రూ.150 ఆకుల చొప్పున) దిగు బడి ఉంటుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తమలపాకుల సీజన్. ఈ సీజన్‌లో రావులపాలెం, తుని, పాయకరావుపేట, యలమంచిలి, అడ్డురోడ్డుల నుంచి రోజూ 15కు పైగా లారీలతో పాటు పెద్ద సంఖ్యలో బస్సులు, ఇతర వాహనాల్లో సుమారు రూ.70లక్షల విలువైన తమలపాకులు ఎగుమతయ్యేవి. ప్రస్తుతం అతికష్టం మీద తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి ఒకటి రెండు లోడులు మాత్రమే రాష్ర్టంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ సీజన్‌లో ఒక్క విశాఖ జిల్లా నుంచి రోజూ రూ.50లక్షలకు పైగా ఎగుమతులు జరిగేవి.
ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క లారీ కూడా ఎగుమతి కాని పరిస్థితి. ఒక్క డిసెంబర్‌లోనే దిగుబడులు పతనమైపోవడంతో ఎగుమతుల్లేక రూ.15కోట్లకు పైగా రైతులకు నష్టం వాటిల్లినట్టు అంచనా . కేవలం మూడేళ్ల వ్యవధిలోనే రెండుసార్లు తుఫాన్‌ల దెబ్బకు చేతికంది వచ్చిన పంట సర్వనాశనమై పోవడంతో రైతులు కోలుకోలేక పోతున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఈ పంటసాగుకు రైతులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. హుద్‌హుద్‌కు దెబ్బతిన్న పంటల జాబితాలో తమలపాకులకు చోటుదక్కకపోవడంతో పరిహారం కూడా అందే అవకాశం లేకుండా పోయింది. పెట్టిన పెట్టుబడి దక్కక పాలుపోని స్థితిలో రైతులున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిళ్లీలకు ఉపయోగించే ఈ దేశవాళీరకం తమల పాకుల దిగుబడి లేకపోవడంతో వాటికి గిరాకీపెరిగింది.
పెట్టుబడులు దక్కడం లేదు
నాది పాయకరావుపేట మండలం సత్యవరం. ఎకరాకు లక్షన్నర వంతున పెట్టుబడితో రెండు ఎకరాల్లో తమలపాకుల పంట చేపట్టాను. హుద్‌హుద్ ధాటికి అంతా పాడైపోయింది. ఏటా ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతూనే ఉన్నాయి. కనీసం పెట్టుబడి కూడా దక్కడం లేదు. ప్రస్తుతం మిగిలిన పంటకు సరైన గిట్టుబాటు ధరలేకపోవడంతో కోత చేపట్టినా కూలీ ఖర్చు దక్కదు. 2012 నీలం తుఫాన్ సాయం నేటికీ అంద లేదు. ఇప్పుడు హుద్‌హుద్ నష్టాన్ని కనీసం పరిగణనలోకి తీసుకోలేదు
-టి.గంగారావు, తమలపాకురైతు